ఆన్​లైన్ డేటింగ్ పేరుతో గాలం

ఆన్​లైన్ డేటింగ్ పేరుతో గాలం
  •  కోల్​కతా అడ్డాగా కాల్ సెంటర్లు
  •  మెంబర్ షిప్ పేరుతో డబ్బు వసూలు
  •  మరింత డబ్బుకోసం బ్లాక్ మెయిలింగ్
  •  హైదరాబాద్ యువకుడి నుంచి రూ. 94 వేలు వసూలు 
  • బాధితుడి ఫిర్యాదుతో ముఠా గుట్టు రట్టు  

హైదరాబాద్, వెలుగు: ఆన్ లైన్ డేటింగ్ పేరుతో యువకులను ట్రాప్​చేసి, బ్లాక్​మెయిలింగ్​కు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతులతో ఆకట్టుకునేలా మాట్లాడిస్తూ యువకులకు గాలం వేస్తున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 38 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, బాధితుల డేటాతో కూడిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు.

లేడీ టెలీకాలర్స్ తో ట్రాప్

కోల్కతాకు చెందిన సోమ రోక(26) అర్నబ్సర్(26) ఎండీ ఇమ్రాన్(23) కలిసి సహ ఎంటర్ ప్రైజెస్, ఒసెల్లమ్ జెటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 4 హొ చి మిన్ సరాని పేర్లతో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. 20 మంది లేడీ టెలీకాలర్స్ ను సిబ్బందిగా నియమించుకున్నారు. డార్క్ నెట్, ఏజెన్సీల ద్వారా  ఫోన్ నంబర్లను సేకరించి, కాల్ చేసేవారు. ఆన్ లైన్ లో లవ్ ఆర్ట్స్ అండ్  డేటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పేవారు. అమ్మాయిలతో ఆకట్టుకునేలా మాట్లాడిస్తూ ఈ ముఠా ట్రాప్ చేసేది.

ఇలా బ్లాక్ మెయిల్ చేశారు

యువకుడి వివరాలన్నీ సేకరించి, డబ్బులు రాబట్టిన తర్వాత ఆ ముఠా ఇక బ్లాక్​మెయిలింగ్​ప్రారంభించింది. అతడి ఫొటోలు, ఐడీలు ఆన్ లైన్ డేటింగ్ సైట్లలో ఉన్నాయని, పోలీసులు గాలిస్తున్నారని భయపెట్టింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు చెప్తామని బెదిరించడంతో అతడు రూ.75 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. ముఠా సభ్యులు మరో రూ. 1.20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అతడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మే 5న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ నంబర్స్, బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా ఈ ముఠా కోల్​కతాలో నడుపుతున్న కాల్​సెంటర్​ను గుర్తించారు. సీసీఎస్ నుంచి ఒక​స్పెషల్ టీం కోల్​కతా వెళ్లి ఈ నెల 22న నిందితులు సోమ రోక, అర్నబ్సర్, ఎండీ ఇమ్రాన్ ను అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టింది. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తరలించి కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. కాల్ సెంటర్లలో పనిచేస్తున్న 16 మంది లేడీ టెలీకాలర్స్ కి 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు అందించారు. ఈ ఆన్ లైన్ డేటింగ్ గ్యాంగ్ రెండేళ్లుగా దేశవ్యాప్తంగా అనేక మందిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మెంబర్ షిప్ పేరుతో డబ్బు వసూలు

ఏప్రిల్ 24న హైదరాబాద్ కు చెందిన ఓ యువకునికి డేటింగ్ ముఠా కాల్ చేసింది. స్వీట్ వాయిస్ తో తన పేరు రితిక అని ఓ లేడీ పరిచయం చేసుకుంది. తాను ‘‘లవ్ ఆర్ట్స్’’ నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పింది. ఆన్ లైన్ డేటింగ్ లో అందమైన యువతులతో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామని వివరించింది. డేటింగ్ కోసం రూ.1,025 చెల్లించి పేరు రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పడంతో అతడు డబ్బు ట్రాన్స్​ఫర్ చేశాడు. తరువాత ఫొటోస్ తో పాటు అడ్రస్ ప్రూఫ్స్, ఆధార్, పాన్ కార్డ్ సహా డేటింగ్ గ్యాంగ్ అడిగిన వివరాలన్నీ పంపించాడు. చివరగా అతడి అభిరుచులకు తగ్గ అమ్మాయి సిద్ధంగా ఉందని, మెంబర్షిప్​కోసం రూ. 18 వేలు కట్టాలని, ఆ డబ్బును రీఫండ్​ చేస్తామని చెప్పడంతో అతడు మరోసారి డబ్బును చెల్లించాడు.