శునకాన్ని చంపిన వారిపై కొత్తపల్లి పీఎస్ లో కేసు నమోదు

శునకాన్ని చంపిన వారిపై కొత్తపల్లి పీఎస్ లో కేసు నమోదు
  • కరీంనగర్ సీపీని కోరిన మేనకా గాంధీ

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో అరుదైన  కేసు ఒకటి నమోదైంది. కొత్తపల్లి మండలంలో ఈనెల 15వ తేదీన ఒక శునకాన్ని కర్రలతో కొట్టి, హింసించి హతమార్చిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగెం చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు కర్రలతో కుక్కను చితకబాదడంతో అది చనిపోయింది. ఆ తర్వాత కుక్క డెడ్ బాడీని తాడుతో టూవీలర్ కు కట్టి తీసుకెళ్లాడో వ్యక్తి. ఈ విషయం హైదరాబాద్ నల్లకుంటకు చెందిన జంతు సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు పృథ్వీ పన్నీరుకు తెలిసింది. వెంటనే ఆయన కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతేకాదు.. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీకి కూడా సమాచారం అందించడంతో ఆమె కరీంనగర్ సీపీతో మాట్లాడారు. కుక్కను కొట్టి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేనకాగాంధీ ఆదేశించడంతో కరీంనగర్ సీపీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.