యూపీలో వైద్యాధికారి ఆత్మహత్య..అసలేం జరిగింది..?

యూపీలో వైద్యాధికారి ఆత్మహత్య..అసలేం జరిగింది..?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఓ హోటల్ గదిలో ఆయన ఉరివేసుకుని చనిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది..?

ప్రయాగ్‌రాజ్ డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సునీల్ కుమార్.. సివిల్ లైన్స్ ప్రాంతంలోని కాఫీ హౌస్ పక్కనే ఉన్న విఠల్‌ హోటల్ లో బస చేశాడు. తనకు 51 అనే రూమ్ నెంబర్ ను హోటల్ సిబ్బంది కేటాయించారు. సోమవారం (ఏప్రిల్ 24న) ఉదయం డాక్టర్ సునీల్ కుమార్ సింగ్.. తన గది తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది వెళ్లారు. డోర్ కొట్టినా తీయకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. హోటల్ గదిలోని రూమ్ ను తెరిచిచూడగా.. డాక్టర్ సునీల్ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. 

సునీల్ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం దగ్గరలోని మార్చురీకి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ సునీల్ ఆత్మహత్యకు కారణం ఏంటి..? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

డాక్టర్ సునీల్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను ఆస్పత్రికి పంపించి.. సునీల్ హోటల్ కు వెళ్లారని డ్రైవర్ సతీష్ సింగ్ పోలీసులకు వివరించాడు. ఉదయం సునీల్ భార్య తనకు ఫోన్ చేసిందని, సునీల్ ఫోన్ ఎత్తడం లేదని, ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ తనను అడిగిందని చెప్పాడు. 

మరోవైపు.. డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ కొంతకాలం నుంచి డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక ద‌ర్యాప్తు అనంత‌రం సునీల్ కుమార్ మ‌ర‌ణానికి సంబంధించిన వివ‌రాలు వెల్లడ‌వుతాయ‌ని పోలీస్ అధికారులు చెబుతున్నారు.