ఎకరాల్లో సర్వే చేసి గుంటలకే పట్టాలిచ్చిన్రు .. నిరాశలో పోడు రైతులు

ఎకరాల్లో సర్వే చేసి  గుంటలకే పట్టాలిచ్చిన్రు .. నిరాశలో పోడు రైతులు

మహబూబాబాద్, వెలుగు : తమ ఆధీనంలో ఉన్న మొత్తం భూమికి పట్టా వస్తదని ఆనందంలో ఉన్న పోడు రైతులకు నిరాశే మిగులుతోంది. తాము సాగు చేసుకుంటున్న భూమికి, పాస్‌‌ బుక్స్‌‌లో నమోదు చేసిన భూమికి పొంతన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాల లెక్కన సర్వే చేసిన ఆఫీసర్లు ఇప్పుడు కేవలం గుంటలకే పరిమితం చేస్తూ పట్టా పాస్‌‌బుక్స్‌‌ ఇస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న మిగతా భూమి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇంకా 4 వేల మందికి పెండింగ్‌‌

మహబూబాబాద్‌‌ జిల్లాలో బయ్యారం, కొత్తగూడ, గంగారం, గార్ల, గూడూరు, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల పరిధిలో 152 గ్రామ పంచాయతీలు, 320 ఆవాసాల్లో పోడు భూములు సాగవుతున్నాయి. మొత్తం 31,222 మంది పోడు రైతుల ఆధీనంలో 78,662.42 ఎకరాల భూమి ఉంది. పోడు పట్టాల పంపిణీని ఇటీవల ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత రైతులకు గ్రామాల వారీగా పోడు పట్టా పాస్‌‌బుక్స్‌‌ అందజేస్తామని ఆఫీసర్లు తెలిపారు. పాస్‌‌బుక్స్‌‌ పంపిణీ బాధ్యతలను ఆయా మండలాల ఎంపీడీవోలకు అప్పగించడంతో పంచాయతీ కార్యదర్శుల ద్వారా పట్టాలు పంపిణీ చేస్తున్నారు. 25,254 మంది రైతుల ఆధీనంలో ఉన్న 71,797.61 ఎకరాలకు పోడు పట్టాలను మంజూరు చేశారు. ఇంకా 4,258 మందికి 5,270.31 ఎకరాలకు సంబంధించిన పట్టాలను ఇంకా పెండింగ్‌‌లోనే ఉన్నాయి.

అత్యాధునిక టెక్నాలజీతో సర్వే

పోడు భూముల సర్వే సమయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పంచాయతీరాజ్‌‌ ఆఫీసర్లు సంయుక్తంగా సర్వే చేశారు. ఇందులో భాగంగా విలేజ్ మ్యాప్, జీపీఆర్‌‌ఎస్‌‌ టెక్నాలజీ, అధునాతన పరికరాల ద్వారా సర్వే పూర్తి చేశారు. పోడు రైతుల ఆధీనంలో ఉన్న మొత్తం భూమిని సర్వే చేసినట్లుగా వారితో సంతకాలు తీసుకొని, రైతులకు స్లిప్పులు సైతం ఇచ్చారు. కానీ రైతులకు ఇచ్చిన పట్టాదార్‌‌ పాస్‌‌బుక్స్‌‌లో మాత్రం తక్కువ భూమి నమోదు చేశారు. దీన్ని గమనించిన రైతులు ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ పరిధిలో ఉన్న భూమి మొత్తం ఎటు పోయిందని ప్రశ్నిస్తున్నారు. 

తాము సాగు చేసిన భూమిపై హక్కు కల్పిస్తేనే తమ జీవనం సాగుతుందని, తక్కువ భూమిని సాగు చేసుకుంటూ తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తక్కువ భూమి నమోదు చేసి ఇచ్చిన పాస్‌‌బుక్స్‌‌తో తమకు ఎలాంటి ఉపయోగం లేదని, ఆఫీసర్లు స్పందించి మొత్తం భూమికి సంబంధించి పాస్‌‌బుక్స్‌‌ జారీ చేయాలని కోరుతున్నారు.

నా పేరు భుక్యా కోబాల్‌‌. నేను మహబూబాబాద్‌‌ జిల్లా గూడూరు మండలం తోటదస్రు తండాలో 30 ఏళ్ల నుంచి 9 ఎకరాల భూమిని పోడు సాగు చేసుకుంటున్న. రెవెన్యూ, ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు ఇటీవల సర్వే నిర్వహించారు. నాకు 9 ఎకరాలకు సంబంధించి పోడు పట్టా వస్తుందని అనుకుంటే కేవలం36 గుంటల భూమికి మాత్రమే పట్టా ఇచ్చారు. మిగిలిన భూమి ఎటు పోయింది. నా ఆధీనంలో ఉన్న మొత్తం భూమికి పట్టా ఇవ్వాలి. లేకుంటే ఈ బుక్‌‌తో నాకెలాంటి ఉపయోగం లేదు .

నా పేరు మల్లెల రాంబాబు. మా కుటుంబం కొత్తగూడ మండలం గాంధీనగర్‌‌ సమీపంలో 40 ఏళ్ల నుంచి 5 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నాం. సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు కేవలం 1.34 ఎకరాలకే పోడు పట్టా మంజూరు చేశారు. మొత్తం భూమికి పట్టా ఇవ్వనప్పడు ఇది మాత్రం ఎందుకు. ఈ భూమిని మా కుటుంబ అవసరాలకు అమ్ముకోలేము. బ్యాంకులు లోన్లు ఇవ్వడం కూడా కష్టమే. అలాంటప్పడు ఈ పట్టాతో ఏం ఉపయోగం