తగ్గుతున్న వంట నూనెల ధరలు

తగ్గుతున్న వంట నూనెల ధరలు
  •    దిగుమతులపై ట్యాక్స్​ తగ్గించిన కేంద్ర సర్కార్‍
  •     ప్రస్తుతం 15 శాతం నుంచి 20 శాతం రేట్లు తగ్గింపు
  •     ఏడాది చివరి వరకు మరింత తగ్గే అవకాశం 

వరంగల్‍ రూరల్‍, వెలుగు: రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం పేద, మిడిల్‍ క్లాస్‍ జనాలకు చుక్కలు చూపెట్టిన వంటనూనె ధరలు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. కరోనా ఎఫెక్ట్​తో ఎన్నడూ లేని విధంగా ధరలు 70 నుంచి 90 శాతం వరకు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి పన్ను తగ్గించడంతో ప్రస్తుతం కిలో ఆయిల్‍ ప్యాకెట్‍పై దాదాపు 15 నుంచి 20 శాతం వరకు రేట్లు తగ్గుముఖం పట్టాయి. కరోనా టైంలో వంట నూనె రేట్లు డబుల్‍ అయ్యాయి. ఏప్రిల్‍ నాటికి కిలో సన్‍ఫ్లవర్‍ ఆయిల్‍ రూ.90 నుంచి రూ.100 ఉండగా.. ఒక్కసారిగా రూ.180కి చేరింది. ఇదే లెక్కన పామాయిల్‍, సోయా, ఆవనూనె, వేరుశనగ ధరలు సైతం అలానే ఆకాశాన్నంటాయి. దేశంలో నూనె గింజల దిగుబడి తగ్గడానికి తోడు కరోనా ప్రభావమే దీనికి కారణంగా చెప్పారు. మామూలుగా మన దేశం మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్‍, బ్రెజిల్‍, రష్యా, అర్జెంటినా వంటి దేశాల నుంచి సన్‍ ఫ్లవర్‍ ఆయిల్‍ను దిగుమతి చేసుకుంటుంది.ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‍డౌన్‍ అమలు చేయాల్సి రావడం ధరలపై ప్రభావం చూపింది. స్థానికంగా దిగుబడి లేక ట్రాన్స్​పోర్ట్​చార్జీలు పెరగడంతో వంట నూనె ధరలు ఎవరూ ఊహించని రీతిలో రెట్టింపయ్యాయి. కేంద్రం తీసుకున్న చర్యలతో రూ.180 ఉన్న సన్‍ఫ్లవర్‍ ఆయిల్​ఇప్పుడు రూ.150కు చేరింది.  అలాగే మిగతా అన్ని నూనెల రేట్లు తగ్గాయి.  

మరింత తగ్గే అవకాశం

దేశంలో వంట నూనె ధరలు జనాలకు ఒక్కసారిగా చుక్కలు చూపెట్టడంతో  కేంద్ర సర్కారు అలర్ట్ అయింది. ఓ వైపు దిగుమతి పన్ను తగ్గించడానికి తోడు దేశంలో నూనె గింజల సాగు పెంచడానికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో నవంబర్‍, డిసెంబర్‍ నాటికి నూనె ధరలు మరింత తగ్గే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. కరోనా, లాక్‍డౌన్‍ ఎఫెక్ట్ సైతం తగ్గుముఖం పడితే వంట నూనె ధరలు కొంత కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనపడుతోంది.

నవంబర్‍ వరకు రేట్లు ఇంకా తగ్గుతయ్‍ 

మూడు నెలల కిందటితో పోలిస్తే వంట నూనె ధరలు బాగా తగ్గినయ్‍. వరల్డ్ మార్కెట్‍ ఆధారంగా మన దగ్గర వంటనూనె రేట్లు ఉంటాయి. కరోనా టైంలో ట్రాన్స్​పోర్ట్ ఆగింది. అందుబాటులో ఉన్న స్టాక్‍కు డిమాండ్‍ ఏర్పడడంతో ధరలు డబుల్‍ అయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తున్నాం. ఈ ఏడాది నవంబర్‍ వరకు మన దగ్గర పంట కూడా చేతికొస్తుంది. ఇప్పుడున్న ధరలు ఇంకా తగ్గుతాయి.
- గోయల్, ఆయిల్‍ షాప్‍ డీలర్‍, హన్మకొండ