
- రూ.7 వేలకు చేరిన హెచ్ఎంటీ, జైశ్రీరాం రకాలు
- బీపీటీ, సోనామసూరి రూ.6,500 పైనే
- వారం రోజుల్లో క్వింటాల్‌పై రూ.800 పెరిగిన రేట్లు
- సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు
- మన రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు
- వ్యాపారులు, మిల్లర్ల గుప్పిట్లో సన్నబియ్యం మార్కెట్
నిజామాబాద్, వెలుగు:రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వారం పది రోజుల్లోనే క్వింటాల్‌పై రూ.600 నుంచి రూ.800 దాకా పెరిగాయి. బీపీటీ, సోనామసూరి లాంటి రకాలు రూ.6,500కుపైగా పలుకుతుంటే.. జైశ్రీరాం, హెచ్ఎంటీ లాంటివి రూ.7 వేలకు చేరాయి. శుక్రవారం నిజామాబాద్ సిటీలోనైతే జైశ్రీరాం రకం పాత బియ్యం 25 కిలోల బ్యాగులను ఏకంగా రూ.2 వేల చొప్పున అమ్మారు. అంటే క్వింటాల్‌కు రూ.8 వేలు తీసుకుంటున్నారన్నమాట! ఈ వానకాలం సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణ, కర్నాటకలో వరి విస్తీర్ణం పడిపోవడం, తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో వరి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది.
దీన్ని ముందే ఊహించిన వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సన్నవడ్లను కొని స్టాక్పెట్టుకున్నారు. ఇప్పుడు అదను చూసి వారం వ్యవధిలో రేట్లు అడ్డగోలుగా పెంచేశారు. వ్యాపారులు, మిల్లర్లపై సర్కారుకు కంట్రోల్ తప్పడం కూడా రేట్ల పెరుగుదలకు ఓ కారణంగా కనిపిస్తున్నది.
డిమాండ్ పెరిగింది.. సాగు తగ్గింది..
దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాలకు చీడపీడలు ఎక్కువ. దిగుబడి తక్కువ. కానీ మార్కెట్లో దొడ్డు, సన్న వడ్ల రేటు దాదాపు సమానం. దీంతో సన్న వడ్లు పండించే రైతులు ప్రతి ఎకరాపై రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం సన్న వడ్లపై ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో సన్న వడ్ల సాగు తగ్గుతూ వస్తున్నది. 2022 వానాకాలం సీజన్‌లో 65 లక్షల ఎకరాల్లో, 2023 వానకాలం సీజన్‌లో 63.55 లక్షల ఎకరాల్లో సాగు చేసినా.. ఇందులో సన్నాలు మూడో వంతు మించలేదు. పైగా నాగార్జున సాగర్ కింద నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఈసారి క్రాప్‌హాలిడే ప్రకటించడంతో వరి సాగు విస్తీర్ణం.. సగానికి పడిపోయింది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్నాటకతో సహా దొడ్డు బియ్యం తినే వివిధ రాష్ట్రాల ప్రజలు కొన్నాళ్లుగా సన్న బియ్యానికి అలవాటు పడ్డారు. కానీ ఆయా రాష్ట్రాల్లో అక్కడి ప్రజల అవసరాలకు సరిపడా సన్న వడ్లు పండడం లేదని వ్యాపారులు అంటున్నారు. దీనికితోడు ఇటీవలి తుఫాన్ల కారణంగా ఏపీ, తమిళనాడులో లక్షలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. వర్షాభావంతో కర్నాటకలోనూ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో బియ్యానికి డిమాండ్ పెరగడంతో అక్కడి వ్యాపారులు మన రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో రేట్లు కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఎగుమతులపై నిషేధం విధించినా.. వ్యాపారులు దొడ్డిదారిన శ్రీలంక, ఉక్రెయిన్, రష్యాకు తరలిస్తున్నారు. ఫలితంగా సన్నబియ్యానికి కొరత ఏర్పడి రేట్లు పెరుగుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.
15 రోజుల్లో రూ.800..
నల్గొండ జిల్లాలో వారం రోజుల్లో అన్ని రకాల బియ్యం రేట్లు ఒక్కో క్వింటాల్‌పై 500 నుంచి రూ.700 దాకా పెరిగాయి. వారం కింద మీడియం క్వాలిటీ బీపీటీ రూ.5,200 ఉండగా, ఇప్పుడు రూ.5,700కు.. టాప్ క్వాలిటీ రూ.5,500 ఉండగా, రూ. 6,100కు.. జేఎస్ఆర్ రూ.6,600 నుంచి రూ.7,200కు.. హెచ్ఎంటీ రూ.6 వేల నుంచి రూ.6,700కు చేరాయి. కరీంనగర్ జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే క్వింటాల్‌పై రూ.900 దాకా రేట్లు పెరిగాయి. జైశ్రీరాం రకం పాతవి క్వింటాల్‌కు రూ.6 వేలు నుంచి రూ.6,900కు, హెచ్ఎంటీ కొత్తవి 4,600 నుంచి 5,400కు చేరాయి. సిద్దిపేట జిల్లాలో సన్న రకం బియ్యం రేట్లు 15 రోజుల్లో రూ.800 పెరిగాయి. జైశ్రీరాం, హెచ్ఎంటీ రకాలు రూ.6 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.6,800కు చేరాయి. యాదాద్రి జిల్లాలో జైశ్రీరాం బియ్యాన్ని రూ.7 వేలకు క్వింటాల్ అమ్ముతున్నారు.
మిల్లర్ల సిండికేట్.. వాళ్ల గుప్పిట్లోనే సన్న బియ్యం..
బియ్యం రేట్లు పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యాపారులను నియంత్రించలేదు. గతంలో బియ్యం రేట్లపై సర్కారుకు ఆజమాయిషీ ఉండేది. మిల్లులకు ఫుడ్ గ్రెయిన్ లైసెన్సులు జారీ చేసి, మన అవసరాలకు మించి స్టాక్ ఉన్నప్పుడే ఎగుమతులకు అనుమతులిచ్చేది. బియ్యం రేట్ల నియంత్రణకు కలెక్టర్, సివిల్సప్లై ఆఫీసర్ల నేతృత్వంలో కమిటీలు ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ జోక్యం, కొందరు ఆఫీసర్ల అవినీతి కారణంగా కమిటీలు నిర్వీర్యమయ్యాయి. ఈక్రమంలోనే మిల్లర్లంతా సిండికేట్‌గా మారి, దొడ్డువడ్లను సర్కారుకు వదిలేసి, సన్న వడ్లను మొత్తం కొని, బియ్యం మార్కెట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు.