
ఈ మధ్య బాలీవుడ్ సినిమా ‘దస్వీ’ విడుదలైంది కదా. అందులో కథ ప్రకారం హీరో గంగారామ్ చౌదరి అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు. ఒక స్కామ్లో జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే, అక్కడే హీరోలో మార్పు వస్తుంది. జైల్లో ఉండగానే పదో క్లాస్ చదివి, పరీక్షలు రాసి పాసవుతాడు. ఈ సినిమాలోని జైలు సీన్లను ఆగ్రాలోని సైంట్రల్ జైలులో తీశారు. షూటింగ్ జరుగుతుండగా, అక్కడ ఉన్న 12 మంది ఖైదీలకు ఈ సినిమా లైన్ గురించి తెలిసింది. వెంటనే తాము కూడా చదువుకోవడం మొదలుపెట్టారు. ఎగ్జామ్స్ రాశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ బోర్డ్ విడుదల చేసిన పదోతరగతి ఫలితాల్లో పాసయ్యారు. ఈ విషయాన్ని ఆగ్రా జైలు సూపరింటెండెంట్ వీకే సింగ్ చెప్పారు. పాసయిన ఖైదీల్లో జితేంద్ర, అర్జున్ అనే ఇద్దరికి 60శాతం పైగా మార్కులు వచ్చాయని చెప్పాడు. ఇది తెలిసి ‘దస్వీ’లో గంగారామ్ చౌదరి పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ అభిషేక్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘సినిమాలో మనం నటించిన పాత్ర నిజజీవితంలో మంచిపనులకు ఇన్స్పిరేషన్గా మారితే ఆ ఆనందం ముందు అవార్డులు కూడా బలాదూరే’ అంటూ ట్వీట్చేశాడు.