వరంగల్ శిల్పారామం ప్రాజెక్టుకు మోక్షం కలిగేదెన్నడు

వరంగల్ శిల్పారామం ప్రాజెక్టుకు మోక్షం కలిగేదెన్నడు
  • 14 ఏండ్లుగా స్థల పరిశీలనతోనే సరిపెడుతున్నరు

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో శిల్పారామం ఏర్పాటు ప్రక్రియ 14 ఏండ్లుగా ముందుకు కదలడం లేదు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్‍ రాజశేఖరరెడ్డి వరంగల్‍ జిల్లా కేంద్రానికి శిల్పారామం మంజూరు చేశారు. నిర్మాణానికి అవసరమైన పర్మిషన్లు ఇచ్చారు. రూ.12 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. మొదటి దశ పనుల కోసం రూ.5 కోట్లు  కేటాయించారు. 14 ఏళ్లు గడుస్తున్నా పాలకులు కనీసం దీనికి అవసరమైన స్థలాన్ని ఖరారు చేయలేకపోయారు. ప్రభుత్వ పెద్దల చిన్నచూపు, లోకల్‍ లీడర్లు, అధికారుల అలసత్వం కారణంగా శిల్పారామం ఏర్పాటు హామీగానే మిగిలిపోయింది. సీఎం రాజశేఖర్‍రెడ్డి 2008లో ఆంధ్రాలోని  కడప, వైజాగ్‍, తిరుపతి, అనంతపూర్‍తో పాటు తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‍ నాగోల్, వరంగల్‍ జిల్లాలకు కొత్త శిల్పారామాలు మంజూరు చేశారు. ఒక్క వరంగల్‍ తప్పించి మిగతా ఐదుచోట్ల వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 ఏండ్లలో ఉప్పల్‍, మహబూబ్‍నగర్‍లో కొత్త శిల్పారామాల ఏర్పాటుకు అడుగులు పడ్డప్పటికీ వరంగల్‍ ప్రాజెక్టుకు మాత్రం మోక్షం కలగడం లేదు.

స్థలాలు చూసుడు.. క్యాన్సిల్‍ చేసుడు
శిల్పరామంను మొదట హన్మకొండ  గోపాల్‍పూర్‍లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థల సేకరణ చేసి బోర్డులు సైతం పెట్టారు. కొన్ని ప్రైవేటు బిల్డింగులు ఉండటానికి తోడు లోతట్టు ప్రాంతం కావడంతో ఆ ప్రతిపాదనకు బ్రేక్‍ పడింది. తర్వాత రాంపూర్‍, మడికొండ, బాలసముద్రం, హసన్‍పర్తిలో స్థలాలను పరిశీలించారు. ఆపై జక్కలొద్ది, రెడ్డిపురం, హయగ్రీవచారి గ్రౌండ్‍ పేర్లు వినపడ్డా అడుగు ముందుకు పడలేదు. ఖిలా వరంగల్‍ వద్ద స్థలాలను చూశారు. ఒకనొక సందర్భంలో ఫోర్ట్ వరంగల్‍ పక్కన ఓకే అన్నారు. కాగా, కేంద్ర పురావస్తుశాఖ పర్మిషన్‍ ఇవ్వలేదు. వరంగల్‍ ఖమ్మం రోడ్‍లోని బెస్తం చెరువు వద్ద 60 ఎకరాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. మాజీ ఐఏఎస్‍ ఆఫీసర్‍, యాదాద్రి టెంపుల్‍ డెవలప్‍మెంట్‍ ఆఫీసర్‍ జి.కిషన్‍రావు, ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్‍ ఆనంద్‍ సాయి ఈ స్థలానికి ఓకే చెప్పారు. అప్పటి జిల్లా కలెక్టర్‍ వాకాటి కరుణ మొత్తం స్థలంలో 15 ఎకరాలు కేటాయించడానికి గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చారు. అయినా కార్యరూపం దాల్చలేదు.  

2019లో కేటీఆర్‍తో భూమిపూజ అన్నరు
శిల్పారామం ఏర్పాటుకు పది ప్రాంతాలను పరిశీలన చేసిన అధికారులు, లీడర్లు చివరికి హన్మకొండ జూపార్క్  ఎదురుగా సైన్స్ సెంటర్‍ పక్కనున్న 30 ఎకరాల స్థలాన్ని కన్‍ఫర్మ్ చేసినట్లు చెప్పారు. అక్కడ జేసీబీల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్‍ ఉంటే కూల్చివేశారు.  2019 సెప్టెంబర్‍ 19న  ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍, కలెక్టర్‍ ప్రశాంత్‍ జీవన్‍ పాటిల్‍, హైదరాబాద్‍ శిల్పారామం జనరల్‍ మేనేజర్‍ కిషన్‍దాస్‍ ఈ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. 2019 అక్టోబర్‍ 5న కేటీఆర్‍ వరంగల్‍ పర్యటన సందర్భంగా శిల్పారామం పనులకు శంకుస్థాపన చేయించనున్నట్లు ప్రకటించారు. లీడర్లు ఈ మాట చెప్పి మూడేళ్లు దగ్గరకొస్తున్నా పనులకు కనీసం ముగ్గు కూడా పోయలేదు. ఇటీవల వరంగల్‍ పర్యటనకు వచ్చిన టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‍గౌడ్‍ మాత్రం అధికారుల తీరువల్లే శిల్పారామం పనులు లేట్‍ అవుతున్నట్లు విమర్శించారు. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆఫీసర్లు కన్‍ఫర్మ్ చేయలేదని చెప్పారు.

త్వరలో పనులు ప్రారంభిస్తాం 
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా మంజూరైన శిల్పారామం ఏర్పాటులో జాప్యం జరిగిన మాట వాస్తవమే. ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిధిలో ఉన్న హంటర్ రోడ్ లో స్థల సేకరణ చివరి దశలో ఉంది. త్వరలో శిల్పారామం పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్