ఒక్కరోజులో వసూలైన ఆస్తి పన్ను రూ.24 కోట్లు

ఒక్కరోజులో వసూలైన ఆస్తి పన్ను రూ.24 కోట్లు
  • జనవరి నుంచి చెల్లించేవారికి ఆస్తిపన్నుపై 2% పెనాల్టీ
  • టార్గెట్​ రీచ్ అయ్యే దిశగా జీహెచ్ఎంసీ అడుగులు

హైదరాబాద్, వెలుగు:ఏడాది చివరి రోజున భారీగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. జీహెచ్ఎంసీకి డిసెంబర్​31న ఒక్కరోజే రూ.24 కోట్లు వచ్చాయి. 2022– 23 ఆర్థిక సంవత్సరానికి రూ.2వేల కోట్లు టార్గెట్​పెట్టుకోగా అధికారులు ఇప్పటివరకు రూ.1,416.21కోట్లు వసూలు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వసూలైన ప్రాపర్టీ ట్యాక్స్​మొత్తం ఈసారి డిసెంబర్ నాటికే దాదాపుగా వసూలవడం విశేషం. మరో మూడు నెలలు టైమ్​ ఉండడంతో ఈసారి టార్గెట్ ​రీచ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే జనవరి 1 నుంచి చెల్లించేవారు ఆస్తి పన్నుపై 2 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పెనాల్టీ లేకుండా సెకండ్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు డిసెంబర్ 31చివరి తేదీ కావడంతోనే శనివారం రూ.24కోట్లు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న బల్దియాను ప్రభుత్వం ఆదుకోవడం తప్ప వేరే దారి లేదు. ఈ క్రమంలోనే కమిషనర్ సహా ఉన్నతాధికారులంతా ప్రాపర్టీ ట్యాక్స్​వసూళ్లపైనే ఫోకస్ పెట్టారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్ లోకేశ్ కుమార్ తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి నెలవారీ టార్గెట్లు ఇస్తూ టార్గెట్ రీచ్​అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొండి బకాయిలపై ఫోకస్

ఏటా బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ రీచ్ కావడం లేదు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22 రూ.1,495 కోట్లు వసూలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలలు మిగిలిండగానే దాదాపుగా పోయినేడాది వచ్చిన మొత్తం వసూలైంది. ఈసారి రూ.2వేల కోట్లు వసూలు చేస్తామనే ధీమాలో అధికారులు ఉన్నారు. ఎర్లీబర్డ్ స్కీమ్​ టైంలో రూ.748 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​ వచ్చింది. దీంతో జనం ట్యాక్స్​చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా కలెక్షన్​లోని లోపాలతోనే ఆదాయం రావడం లేదనే ఆరోపణలు ఉండడంతో బల్దియా ఉన్నతాధికారులు మొండి బకాయిలపై ఫోకస్ పెట్టి మరీ వసూలు చేయిస్తున్నారు.   

ప్రభుత్వాన్ని అడగలేక..

జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్ రావడం లేదు. ఎన్నిసార్లు అడిగినా నయా పైసా ఇవ్వడంలేదు. ఎలాగోలా బల్దియాను గట్టెక్కియ్యాలని అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ భవనాలకు సంబంధించిన  రూ.5,564 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు చెల్లించడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బల్దియా చేరుకోవడంతో అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్ పై ఫోకస్ పెట్టారు.

జోన్ల వారీగా కలెక్షన్

గ్రేటర్ పరిధిలో ఆరు జోన్లు ఉండగా ఎక్కువగా ప్రపార్టీ ట్యాక్స్​కలెక్షన్ ఖైరతాబాద్ జోన్​నుంచే వస్తోంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయాన్ని చూస్తే ఎల్బీనగర్​లో టార్గెట్ రూ.262 కోట్లు కాగా, రూ.205.6 కోట్లు వసూలయ్యాయి. చార్మినార్ జోన్ లో రూ.172 కోట్లకు గాను రూ.103 కోట్లు, ఖైరతాబాద్ జోన్ లో రూ.585 కోట్లకు గాను రూ.369.85 కోట్లు, శేరిలింగం పల్లి జోన్​లో రూ.393 కోట్లకు గాను రూ.306.37 కోట్లు, కూకట్ పల్లి జోన్ లో రూ.295 కోట్లకు గాను రూ.231.17 కోట్లు, సికింద్రాబాద్ జోన్ లో రూ.293 కోట్ల టార్గెట్ కి రూ.200.77 కోట్లు వచ్చాయి.