యునెస్కో గుర్తింపుతో రామప్ప గుడికి లాభాలివే

యునెస్కో  గుర్తింపుతో రామప్ప గుడికి లాభాలివే
  • 2020కి వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా ఆమోద ముద్ర
  • నార్వే వ్యతిరేకించినా రష్యా సహా 17 దేశాల సపోర్ట్‌
  • ఫలించిన కేంద్ర ప్రభుత్వ వ్యూహం
  • రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు
  • తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు వచ్చిన ఏకైక కట్టడం

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరం. తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయుల వైభవం గుర్తు చేసేలా రామప్ప ఆలయంలో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుంది. దేశ ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి గొప్పతనాన్ని తెలుసుకోవాలి.        - ప్రధాని మోడీ

2020కి వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా ఆమోద ముద్ర


ఇండియా టైమ్‌ ప్రకారం ఆదివారం సాయంత్రం 4.36కు రామప్పను జాబితాలో చేర్చారు. తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌ అధికారికంగా మీడియాకు వెల్లడించారు. ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక ప్రపంచ స్థాయి కట్టడమని సంతోషం వ్యక్తం చేశారు. 
దౌత్య పద్ధతిలో ‘రామప్ప’ కు గుర్తింపు
రామప్పకు వారసత్వ సంపద హోదా రాకుండా నార్వే అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు కేంద్రం నియమించిన ప్రత్యేక బృందం రామప్ప ఆలయ విశిష్టతను వివరించింది. ఫైనల్‌గా భారత్‌కు రష్యా అండగా నిలించింది. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా రష్యా సహకరించింది. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరి, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా తదితర దేశాలు మద్దతు తెలిపాయి.  వారసత్వ జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా రష్యా సహా 17 దేశాల ఆమోద ముద్ర వేయడంతో రామప్పకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పటివరకు 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు జాబితాలో ఉన్నాయి.  
2014 నుంచే ప్రయత్నాలు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని 808 ఏళ్ల నాటి కాకతీయ రుద్రేశ్వర ఆలయం (రామప్ప)ను యునెస్కో జాబితాలో చేర్చేందుకు కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 2014లో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్ టెంటేటివ్‌ జాబితాలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, వరంగల్‌లోని ఖిలా వరంగల్ ఫోర్ట్‌తో పాటు రామప్ప చోటు దక్కించుకుంది. వేయి స్తంభాల గుడి చుట్టూ, వరంగల్ కోటలో ప్రైవేట్ నిర్మాణాలు ఉండటంతో అవి రిజెక్ట్ అయ్యాయి. తర్వాత రామప్ప ఆలయ నిర్మాణం ప్రపంచ స్థాయిలో ఎలా ప్రత్యేకతను సంతరించుకుందో వివరిస్తూ యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో) కు కేంద్రం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్‌ అండ్‌ సైట్స్‌ (ఐకోమాస్‌) ప్రతినిధిగా వాసు పోశానందన్‌ 2019 సెప్టెంబర్  25న రామప్పను సందర్శించారు. ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అర్హతలున్నాయని కితాబిచ్చారు. ఆ తర్వాత 2020కి గాను వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌ గుర్తింపునకు ఇండియా తరఫున రామప్ప ఎంపికైంది. 2020 జులైలో యునెస్కో హెరిటేజ్ ప్రతినిధులు సమావేశం కావాల్సి ఉండగా కరోనా వల్ల జరగలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 16 నుంచి 30 వరకు చైనాలో జరుగుతున్న మీటింగ్‌లో రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది. 
దేశంలో ఇప్పటివరకు 38
దేశం నుంచి 1983లో తొలిసారి అజంతా, ఎల్లోరా, ఆగ్రా ఫోర్ట్‌‌‌‌, తాజ్‌‌‌‌మహల్‌కు యునెస్కో గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరాయి. 
గుర్తింపుతో లాభాలివే
యునెస్కో గుర్తింపు పొందిన స్థలాలు, కట్టడాల గురించి ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రచారం జరుగుతుంది. ఈ కట్టడాలను చూడటానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి రామప్ప ప్రాంతం టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చెందనుంది. ఈ హోదా వచ్చిన ప్రాంతం చారిత్రక, ప్రాకృతిక ప్రాధాన్యాన్ని కాపాడేందుకు యునెస్కో చర్యలు తీసుకుంటుంది. ఆలయ అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు కూడా వస్తాయి. కట్టడం ఉన్న ప్రాంతానికి దగ్గర్లో ఎయిర్‌పోర్టు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
శివుడి ఆజ్ఞ కోసం చూస్తున్నట్టుగా నంది 
సూది బెజ్జం సందుతో ఉండే అతి సూక్ష్మమైన శిల్పాలు అనేకం రామప్పలో కొలువుదీరి ఉన్నాయి. ఆలయం బరువును మోస్తున్నట్లుగా వందలాది ఏనుగుల శిల్పాలను ఆలయం చుట్టూ చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. శివుడి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టు చెవిని లింగం వైపుకు పెట్టి లేవడానికి రెడీగా ఉన్నట్టు నందిని మలిచాడు శిల్పి రామప్ప. 

రామప్పలో తేలియాడే ఇటుకలు
నేల స్వభావాన్ని బట్టి ఆలయ బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వాడే మట్టి ఇటులకు 2.2 సాంద్రత ఉంటుంది. రామప్ప గోపురానికి వాడిన ఇటుకలు 0.8 సాంద్రత కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు ఉండి నీళ్లలో తేలుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు.
కేంద్రానికి కేసీఆర్ థ్యాంక్స్​
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.  ఆలయం గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు, సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.  కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో రాష్ట్రంలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదని అన్నారు.  

ఆలయానికి 808 ఏళ్లు
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని హయాంలో ఆయన సేనాని రేచర్ల రుద్రడు రామప్ప ఆలయాన్ని నిర్మించారు. 1173లో మొదలైన పనులు నలభై ఏళ్ల పాటు సాగాయి. 1213లో పూర్తయ్యాయి. కర్నాటకకు చెందిన రామప్ప అనే శిల్పి ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన గుడితో పాటు అనుబంధంగా కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపురాలయం వంటి 20 అనుబంధ ఆలయాలు నిర్మించారు. కాకతీయుల సామ్రాజ్యం పతనం తర్వాత 1323లో ఈ ఆలయం మూతపడింది. తరువాత 600 ఏళ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో 1911లో గుడికి మరమ్మతులు చేశారు. శిల్పి పేరిట పేరు సంపాదించిన అరుదైన ఆలయం ఇదే కావడం విశేషం.  

సంతోషంగా ఉంది: కిషన్ రెడ్డి​
రామప్ప ఆలయానికి యూనెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఈ విజయంలో మార్గదర్శకంగా ఉన్నారంటూ ప్రధాని మోడీకి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

ఆకట్టుకునే మదనికలు
రామప్ప గుడి నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు (నాగిని శిల్పాలు) చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని బ్లాక్‌ గ్రానైట్‌ రాయిపై చెక్కారు. ఆలయం లోపల నాట్య మంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి నిదర్శనం. జాయప సేనాని రచించిన నృత్త రత్నావళిలోని నాట్య సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తా యి. వీటిపై పరిశోధన చేసిన నటరాజ రామకృష్ణ కాకతీయుల కాలంనాటి 
పేరిణి నృత్యానికి ప్రాణం పోశారు.
పీఎం సహకారంతోనే: సంజయ్
రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం హర్షనీయమని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్​ అన్నారు. పీఎం మోడీ సహకారంతోనే యూనెస్కో గుర్తింపు సాధ్యమైందన్నారు.