
- సప్లయ్ తగ్గడమే కారణం
వెలుగు బిజినెస్ డెస్క్: పాత కారు కొనాలనుకుంటున్నారా ? ఇప్పుడు గతంలో కంటే కొంచెం ఎక్కువ రేటే పెట్టాల్సి ఉంటుంది, రెడీ అవండి. కరోనా మహమ్మారి రాకతో సొంత వెహికల్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు జీతాల కోతతోపాటు, కొంత మందికి ఉద్యోగాలే పోవడంతో ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరయింది. దీంతో 2020–21 ఫైనాన్షియల్ ఇయర్లో కొత్త కార్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 27 శాతం పడిపోయాయి. డీలర్షిప్స్ వద్ద రిజిస్ట్రేషన్స్ డేటా దీనిని వెల్లడిస్తోంది.
సేల్స్ ఏటా 15 శాతం పెరుగుతున్నాయ్..
2021–22 ఫైనాన్షియల్ ఇయర్లో పాత కార్ల అమ్మకాలు కొంచెం అటూ ఇటూగా 40 నుంచి 45 లక్షల లెవెల్లో ఉంటాయని క్రిసిల్ చెబుతోంది. కిందటి ఫైనాన్షియల్ ఇయర్ మొదటి క్వార్టర్లో అమ్మకాలు చెప్పుకోదగ్గ రీతిలో లేవు. ఎందుకంటే దేశమంతటా కచ్చితమైన లాక్డౌన్ అమలులో ఉంది. కరోనా మహమ్మారి కంటే ముందు నుంచే పాత కార్ల అమ్మకాలు మన దేశంలో జోరందుకున్నాయి. పాత కార్ల సేల్స్ ఏటా 15 శాతం చొప్పున పెరుగుతున్నాయని, 2024 నాటికి ఈ అమ్మకాలు ఏకంగా 49 బిలియన్ డాలర్లకు చేరతాయని నోమురా అంచనా వేస్తోంది. ఖర్చు తగ్గించుకునేందుకు కొత్త వాటి కంటే పాత కార్ల వైపే ఎక్కువ మంది ఇప్పుడు చూస్తున్నారు.
సప్లయ్ చాలట్లే..
కొత్త కార్లు కొనే వారి సంఖ్య తగ్గడంతో డిమాండ్‌కి తగినన్ని పాత కార్లు మార్కెట్లో లేవు. ఫలితంగా రూ. 4 లక్షల లోపు పాత కార్ల రేట్లు కిందటి ఫైనాన్షియల్ ఇయర్లో సగటున 10 శాతం పెరిగాయి. సెకండ్ హాండ్ మార్కెట్లో ఈ సెగ్మెంట్లోనే ఎక్కువ అమ్మకాలు జరుగుతాయని ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆశిష్ మోదాని చెప్పారు. 2020–21లో కొత్త వెహికల్స్ అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో మార్కెట్లోకి వచ్చే పాత కార్ల సంఖ్యా తగ్గిపోయింది. కిందటేడాది ఎక్స్చేంజ్లు కూడా బాగా తగ్గాయి. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే పర్సనల్ మొబిలిటీనే ఇష్టపడే వారు పాత కార్లపై దృష్టి పెడుతున్నారని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ సీఈఓ అశుతోష్ పాండే తెలిపారు.
ఎంట్రీ లెవెల్ హ్యాచ్బాక్స్ కోరుకుంటున్నారు..
పాత కార్లను కొనాలనుకునే వాళ్లలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్ హ్యాచ్బాక్స్ను ఇష్టపడుతున్నారు. మారుతి సుజుకి స్విఫ్ట్, డిజైర్, వేగన్ ఆర్, బాలెనో మోడల్స్‌ను, హ్యుండాయ్ ఐ–20, ఐ–10. మహీంద్రా స్కార్పియో మోడల్స్ వైపు మొగ్గుచూపుతున్నారని ఓఎల్ఎక్స్, మహీంద్రా ఫస్ట్ ఛాయిస్‌లు వెల్లడిస్తున్నాయి. గత అయిదారేళ్లలో చూస్తే ఈ ఏడాది గ్రోత్ చాలా బాగుందని కార్వాలే శర్మ తెలిపారు. కోవిడ్‌కు ముందు కంటే ఇప్పుడు అమ్మకాలు ఊపందుకున్నాయని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే డిమాండ్ 30 శాతం పెరిగిందన్నారు. కిందటి ఫైనాన్షియల్ ఇయర్ చివరి క్వార్టర్లో తమ ప్లాట్‌ఫామ్ చూసే వారి సంఖ్య 48 శాతం పెరిగిందని వెల్లడించారు.
ఎక్కువ అన్ ఆర్గనైజ్డే..
పాత కార్ల మార్కెట్ ఇంకా అన్ ఆర్గనైజ్డ్గానే ఉందని చెప్పుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 సిటీలలోని కస్టమర్లు ఎక్కువగా ఆన్లైన్ పోర్టల్స్‌పై ఆధారపడుతుండగా, మరోవైపు చిన్న పట్టణాలలోని వారు మాత్రం లోకల్ డీలర్స్పైనే ఆధారపడుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం ఈ ట్రెండ్స్‌ను మారుస్తోంది. ఆర్గనైజ్డ్ ఛానెల్స్ ద్వారా ట్రాన్సాక్షన్లు గత పదేళ్లలో రెట్టింపవడమే దీనికి నిదర్శనమని నోమురా చెబుతోంది. రాబోయే ఏళ్లలో ఆర్గనైజ్డ్ మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ భావిస్తోంది. ఎందుకంటే, పాత కార్లు అమ్మడానికి, కొనడానికి ట్రాన్స్పరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. కొత్త కార్ల సేల్స్ పెరుగుతున్నాయంటే, పాత వాటి అమ్మకాలు కూడా పెరుగుతాయి. కొత్త కార్ల అమ్మకాలు పుంజుకుంటే కొంతయినా, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో సప్లయ్ కొరత తీరుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
కరోనాతో సొంత కారంటే పెరిగిన ఇష్టం..
డిమాండ్ 133 శాతం పెరిగితే, సప్లయ్ మాత్రం 120 శాతమేనని ఓఎల్ఎక్స్ ఆటో (నాస్పర్స్) సీఈఓ అమిత్ కుమార్ చెబుతున్నారు. సప్లయ్‌లో 18 నుంచి 20 శాతం షార్టేజ్ ఉందని కార్వాలే సీఈఓ బన్వరి లాల్ శర్మ తెలిపారు. పాత కారు కొనాలనుకునే కొంత మంది నిర్ణయాలను కూడా కరోనా మహమ్మారి ప్రభావితం చేసింది. కోవిడ్–19 కారణంగా సొంత వెహికల్ కొనాలనుకుంటున్నట్లు 65 శాతం మంది తమ సర్వేలో వెల్లడించినట్లు ఇండియన్బ్లూబుక్ తెలిపింది. అంతేకాదు, కరోనాకి భయపడకపోతే కారు కొనేవాళ్లమే కాదని పాత కార్లను కొన్న వారిలో 29 శాతం మంది చెప్పినట్లు ఈ సర్వే పేర్కొంది.
ఎంక్వైరీల జోరు..
పాత కార్ల అమ్మకాల మార్కెట్లో 80 శాతం వాటా ఉందని చెప్పుకుంటున్న ఓఎల్ఎక్స్ సేల్స్ ఏకంగా 130 శాతం పెరిగాయి. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన వెంటనే రూరల్ ఏరియాల నుంచి డిమాండ్ జోరందుకుందని, ఆ తర్వాతే అర్బన్ ఏరియాల నుంచి డిమాండ్ పెరిగిందని కుమార్ చెప్పారు. ఏదైనా కారు అమ్మకానికి ఉందని పోస్ట్ చేస్తే గతంలో వచ్చే రిప్లయ్‌ల కంటే ఇప్పుడు రిప్లయ్‌లు ఎక్కువయ్యాయని కూడా ఓఎల్ఎక్స్ ఆటో చెబుతోంది. కిందటేడాదితో పోలిస్తే ఈ సేల్స్ రెట్టింపయినట్లు మరో కంపెనీ స్పిన్నీ వెల్లడించింది. ఈ కంపెనీ ఇటీవలే 65 మిలియన్ డాలర్ల ఫండింగ్ తెచ్చుకుంది. సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల సేల్స్ కూడా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్ల డిమాండ్ 45 శాతం దాకా ఎక్కువైందని బిగ్ బాయ్ టాయ్జ్ చెబుతోంది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పైనా దృష్టి పెడుతున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. 2021 ఫైనాన్షియల్ ఇయర్లో తమ సేల్స్ రెవెన్యూ 20% పెరిగిందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ తెలిపింది. కిందటి ఏడాది కొత్తగా 200 స్టోర్లను కంపెనీ తెరిచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 1,150 కి చేరింది.