మూకీ నుంచి 4కె ..రంగులద్దుకున్న సినిమా

మూకీ నుంచి 4కె ..రంగులద్దుకున్న సినిమా

ప్రాంతం, భాష, కల్చర్​తో సంబంధం లేకుండా అందరూ కలిసి ఎంజాయ్ చేసేది సినిమా. మూకీ సినిమాలతో మొదలై టాకీ, కలర్, త్రీడి వరకు ఎన్నో మార్పులొచ్చాయి ఇన్నేండ్లలో. కథలు, జానర్స్, స్క్రీన్ ప్లే, టెక్నికల్ ఇష్యూస్.. ఇలా ప్రతిదాంట్లో మార్పులొచ్చాయి. మనదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సినిమా మనుషులందరినీ ఏకం చేసింది. ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్స్​లోనూ మెరిసింది మన సినిమా. స్వాతంత్ర్యం వచ్చాక సినీ రంగం ఇంకాస్త ఊపందుకుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులేంటో ఒకసారి పరిశీలిస్తే...

స్వాతంత్ర్యం కంటే ముందు నుంచే సినిమా అనేది ప్రజల జీవితాల్లోకి వచ్చింది. ఇండియా ఇండిపెండెన్స్ చరిత్ర 75ఏండ్లదైతే.. ఇండియన్ సినిమాది వందేండ్ల చరిత్ర. కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద... వంటి తేడాలు లేని వసుదైక కుటుంబం. సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ నుంచి టెక్నీషియన్​ వరకు అందరూ పనిచేస్తేనే ఒక ప్రాజెక్ట్ తెర మీదికి వస్తుంది. దాన్ని అద్భుతంగా చూపించేందుకు ఎంతో కష్టపడతారు. ఇప్పుడు  టెక్నాలజీ రాకతో సినిమాకి మరిన్ని మెరుగులు అద్దుతున్నారు. వందల కోట్లతో భారీ బడ్జెట్​ సినిమాలు తీసి, ప్రపంచానికి ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిస్తున్నారు. అందులోనూ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి ప్రపంచస్థాయి సినిమాలు మన తెలుగు వారి సత్తా చాటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్​లో ఉండాలని టెక్నీషియన్లు, గ్రాఫిక్స్ కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఇది ఇప్పటి సినిమా సంగతి. మరి వందేండ్ల చరిత్ర ఉన్న సినిమాలో ఎన్నెన్ని మార్పులు, చేర్పులు జరిగాయో చూస్తే...
 

ఫ్లాష్​బ్యాక్
కెమెరా, ఫిల్మ్​ కనిపెట్టాక, అప్పట్లో ఫొటో తీసుకోవడమే ఒక వింత. అలాంటిది సినిమా అంటే అది ఊహకే అందని మాట. అయితే, ఆరోజుల్లో టెక్నాలజీ లేకపోవచ్చు. కానీ, ఇప్పుడున్న టెక్నాలజీకి పురుడు పోసింది మాత్రం నాటి ఆవిష్కర్తలే. ఒక్కో ఫిల్మ్ తీసి, దాన్ని ఒకదానితో ఒకటి వరుసగా అంటించేవారు. ఆ తర్వాత ప్రొజెక్టర్ మీద రీల్ తిరుగుతూ ఉంటే తెర మీద బొమ్మలు కదలాడేవి. ఇలా రకరకాలుగా మార్పు చెందింది సినిమా. అయితే, అందరికీ తెలిసింది.. మొట్టమొదటి చిత్రంగా చెప్పుకునే మూకీ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’. ఈ సినిమా1913లో దాదాసాహెబ్ ఫాల్కే తెరమీదికి తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయనే. సౌండ్, మ్యూజిక్ లేని ఆ టైంలో ప్రేక్షకులకు ఆ కథ చెప్పడానికి యాక్టర్స్​ చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా ఆ సినిమా కమర్షియల్​గా సక్సెస్ అయింది. అదే ఇప్పటి సినిమాలకు పూలబాట వేసింది. 
 

గోల్డెన్ ఏజ్
టెక్నాలజీ డెవలప్​ అయ్యాక సినిమాకి మాటలు, వాటితోపాటు పాటలొచ్చాయి. డైరెక్టర్ వి. శాంతారామ్ సినిమాల టైంని ‘గోల్డెన్​ ఏజ్’ అని పిలిచారు. ఈయన తీసిన మొదటి టాకీ చిత్రం ‘అయోధ్య కా రాజా’ (1932). శాంతారామ్ సినిమాల్లో సమాజం, మతపరమైన తేడాలు, మహిళా హక్కుల గురించి చెప్పేవాళ్లు. ఇలాంటి సినిమాలు ఇండియాలో అప్పుడే మొదటిసారి వచ్చాయి. మాటలు, పాటలు, ఫైట్​లు, ఎమోషన్స్.. అన్నీ ఉన్నా ఏదో వెలితి. ఎందుకంటే నటీనటులంతా అందంగా రంగురంగుల బట్టలు వేసుకున్నారు. లొకేషన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నా.. అవేవీ కళ్లకు కనిపించేవి కావు. కారణం, ఫిల్మ్​ బ్లాక్ అండ్ వైట్​లో ఉండడమే. దానివల్ల కాస్త అసంతృప్తి ఉండేది. కానీ.. అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి సినిమా చూడడమే గొప్పగా భావించేవాళ్లు ప్రేక్షకులు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలతో పాటు కావ్యాలు, నవలల్ని సినిమాలుగా తీశారు. నటులు పౌరాణిక వేషాలు వేసుకుని, అందంగా అలంకరించుకునేవాళ్లు. ఎన్నిరోజులైనా ఓపికగా సినిమా కంప్లీట్ చేసేవాళ్లు. రాజ్యాలు, యుద్ధాలు వంటి సన్నివేశాలు చూపించేందుకు భారీ సెట్లు వేసేవారు. అవి కూడా ఆ కాలంలో దొరికిన వాటితోనే తయారుచేసుకునేవాళ్లు. 
 

స్వాతంత్ర్యానికి, సినిమాకి మధ్య సంబంధం..
స్వాతంత్ర్యం కోసం పోరాడే సమయంలో సినిమా బ్రిటిష్ రూల్స్​ను వ్యతిరేకించే గొంతుకలా ఉపయోగపడింది. జాతీయ నాయకులు, పార్టీ డిమాండ్లను వినిపించే సాధనంగా వాడుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక, సమాజంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపేందుకు ఉపయోగపడింది.  సొసైటీలో మార్పు కోసం ఎన్నో సినిమాలు తీసేవారు అప్పటి దర్శకులు. అలాగే నాటి స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు తెరమీద కళ్లకు కట్టినట్టు చూపించారు. దేశభక్తి కాన్సెప్ట్​లో వచ్చిన తెలుగు సినిమాల్లో కొన్ని.. ‘అల్లూరి సీతారామరాజు’, ‘బొబ్బులి పులి’, ‘మరో ప్రపంచం’, ‘వందేమాతరం’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘సుభాష్​ చంద్రబోస్’, ‘ఖడ్గం’, ‘ఠాగూర్’. వీటితోపాటు ఈ మధ్య వీర జవాన్ల బయోపిక్​లు ఎన్నో కళ్లముందుకొచ్చాయి. ఇప్పటికీ దేశ ఖ్యాతి చాటే సినిమాలు వస్తూనే ఉన్నాయి. మనదేశ గొప్పదనం గురించి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ..  ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇదే ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా 75వ యానివర్సరీ చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది మే నెలలో జరిగిన ఫెస్టివల్​లో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ సినిమాని ప్రదర్శించారు. 
 

స్వాతంత్ర్యం రాకముందే అంతర్జాతీయ స్థాయికి..
1946లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​​లో ఇండియన్ సినిమా మెరిసింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో మొట్టమొదటిసారి ప్రదర్శించిన ఇండియన్ సినిమా ‘నీచా నగర్’. ఈ సినిమా డైరెక్టర్ చేతన్ ఆనంద్. అలాగే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్​లో డైరెక్టర్ సత్యజిత్​ రే తీసిన ‘అపరాజితొ’ మూవీని ప్రదర్శించారు. ఆ తర్వాత డైరెక్టర్ మెహబూబ్​ ఖాన్ తీసిన ‘మదర్ ఇండియా’, బి.ఆర్. చోప్రా తీసిన ‘నయా దౌర్’, విమల్ రాయ్ తెరకెక్కించిన ‘బందిని’ వంటి సినిమాలు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శించారు. ఈ కాలాన్ని న్యూ వేవ్ ఆఫ్​ సినిమా, న్యూ రియలిస్టిక్ సినిమా అని పిలిచారు. అప్పట్లో ఇండియాలో ఫేమస్ డైరెక్టర్స్​ సత్యజిత్​ రే, రిత్విక్ ఘటక్, మణి కాల్, అదూర్ గోపాలకృష్ణన్, కుమార్ షహానీ, బసు భట్టాచార్య, మృణాల్ సేన్, బసు ఛటర్జీ వంటి వాళ్లు ఎంతో పేరుతెచ్చుకున్నారు. అయితే అప్పట్లో సినిమాలు చూడ్డానికి జనాలు ఎక్కువగా థియేటర్​కి వెళ్లేవాళ్లు కాదు. గవర్నమెంట్ కూడా ఈ సినిమాల కోసం ఖర్చుపెట్టడానికి అంత ఆసక్తి చూపించలేదు. 
 

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
ఒక దశలో  సినిమాలో హీరోయిన్స్​కు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ఓన్లీ యాక్షన్​ సినిమాలు తీయడం వల్ల హీరోయిన్ కేవలం పాటలు, డాన్స్, కిడ్నాప్​ అయ్యే సీన్లలో మాత్రమే కనిపించేవాళ్లు. సినిమా మొత్తం హీరో మీదే ఆధారపడి ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి ట్రెండ్ మారింది. ఆడవాళ్లనే మెయిన్ లీడ్స్​గా పెట్టి విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. వాటిని కూడా ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. 
 

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్​లు
సినిమాలో టెక్నికల్​గా ఎన్నో మార్పులొచ్చాయి. వాటితోపాటు కథలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్​లు, స్ర్కీన్ ప్లేలో మార్పులు వచ్చాయి. హీరో డబుల్ రోల్, త్రిబుల్ రోల్​​లో కనిపించడం కొత్తగా ఉండేది మొదట్లో. ఆ తర్వాత పాములు, పులులు, సింహాలు, ఏనుగులు వంటి జంతువుల్ని గ్రాఫిక్స్​, వీఎఫ్ఎక్స్​లో చూపించడం, పాటల్ని విదేశాల్లో షూటింగ్​ చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యంలోనూ మార్పులొచ్చాయి. కామెడీ, యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, హారర్ వంటి రకరకాల జానర్స్​లో సినిమాలొచ్చాయి. ఒక సినిమా బాగుందంటే దానికి సీక్వెల్ తీయడం ఇప్పుడు ట్రెండ్​. ప్రొజెక్టర్స్​లో సినిమా చూసే స్థాయి నుంచి థియేటర్స్, మల్టీప్లెక్స్ వరకు డెవలప్ అయింది. క్యూలో నిలబడి టికెట్​ కోసం గంటలతరబడి వేచి చూసే బాధ లేకుండా ఆన్​లైన్​లోనే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. అంతెందుకు ఒకప్పుడు పోస్టర్ చూసి సినిమాకి వెళ్లేవాళ్లు. ఆడియో రిలీజ్​, ప్రి–రిలీజ్ ఫంక్షన్లు ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్, వీడియో సాంగ్, ఆడియో రిలీజ్, ప్రి–రిలీజ్... ఇలా రిలీజ్ డే వరకు రకరకాల ప్రమోషన్లతో ప్రేక్షకుల​ను అట్రాక్ట్ చేస్తున్నారు. మొదట్లో సినిమా నటుల రెమ్యూనరేషన్ చాలా తక్కువ. వంద రూపాయలు తీసుకున్న వాళ్లు పెద్ద నటులు. కానీ, ఇప్పుడు సినిమా చూడాలంటే వందరూపాయలు ఏమూలకు సరిపోవు. సగటు ప్రేక్షకుడ్ని శాటిస్​ఫై చేసేందుకు డైరెక్టర్స్‌‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు. సో... సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే... ఎంత చెప్పినా ఎండ్ కార్డ్ పడదు. 

రంగులద్దుకున్న సినిమా
అప్పటి వరకు తెలుపు, నలుపు రంగుల్లో మాత్రమే కనిపించిన సినిమా కాస్త రంగులు అద్దుకుంది 1937లో. ఇండియాలో మొదటి కలర్​ సినిమా ‘కిసాన్ కన్య’. ఇది హిందీ సినిమా. దీని డైరెక్టర్ మోతీ గిద్వాని. ఆ తర్వాత 1963లో మొట్టమొదటిసారి తెలుగు తెర మీద రంగుల సినిమా కనిపించింది. అదే ఎన్టీఆర్​ నటించిన ‘లవకుశ’. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు రంగులతో కళకళలాడాయి. అప్పటికే కెమెరా ట్రిక్​లు వాడి స్పెషల్ ఎఫెక్ట్స్​ చేసేవారు. ఆ తర్వాత ఆ ఎఫెక్ట్స్​ మరింత జోరందుకున్నాయి. రంగుల మీద ఫోకస్ చేసి సరికొత్త కథల్ని తెరకెక్కించారు నాటి దర్శకులు. దాంతోపాటు ప్రొజెక్టర్స్​తో కూడా రకరకాల ఎక్స్​పరిమెంట్స్ చేసేవాళ్లు ఫిల్మ్ మేకర్స్. ఎక్కువగా కార్ సీన్స్​లో ఆ టెక్నిక్ వాడేవాళ్లు. కార్​లో యాక్టర్స్ వెళ్తుంటారు. ఆ సీన్ తీయాలంటే బ్యాక్​గ్రౌండ్ లొకేషన్స్ మారుతూ ఉండాలి. కాబట్టి దానికోసం ఒక టెక్నిక్ వాడేవాళ్లు. 1950 నుంచి1970 వరకు సినిమాలకు స్వర్ణయుగంగా చెప్తారు. ఎందుకంటే మనదేశం మిగతాదేశాలకంటే పేదదే అయినా, మన సమాజంలో కనిపించే అనుబంధాలు, కట్టుబాట్లను తెరమీద చక్కగా చూపించేవాళ్లు.