ఆర్టీసీని సర్కార్‌‌లో విలీనం చేయాలె

ఆర్టీసీని సర్కార్‌‌లో విలీనం చేయాలె
  • జాబ్ సెక్యూరిటీ గైడ్​లైన్స్ పక్కన పడేయండి 
  • వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టండి
  • ఎఫ్ఎన్సీ కేసుల్లో డిస్మిస్ పవర్ ను సవరించాలె
  • లేదంటే 21 తర్వాత నిరాహార దీక్ష: అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మిక సంఘాలు బహిష్కరించిన వ్యక్తులతో కలిసి ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ జాబ్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వాటిని పక్కన పెట్టాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్​చేశారు. ఆ గైడ్ లైన్స్ ను ఎవరూ స్వాగతించడంలేదని, ఏపీలో మాదిరిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాగోల్ లోని శుభం ఫంక్షన్​హాల్ లో ఆదివారం జరిగిన టీ‌‌ఎం‌‌యూ కేంద్ర కమిటీ మీటింగ్ కు అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు, యూనియన్ లీడర్లు హాజరయ్యారు. మీటింగ్ లో అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె తర్వాత కార్మికులపై ఆర్టీసీ మేనేజ్మెంట్ పనిభారం పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని, ఏటా వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ కార్యక్రమాలను రీస్టార్ట్ చేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టాలన్నారు. అప్పటివరకూ గుర్తింపు సంఘంగా ఉన్న టీఎం‌‌యూతోనే చర్చలు జరపాలని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నాశనం చేయాలని చూస్తున్నారని, ప్రస్తుతం 3 వేలకు పైగా గ్రామాలకు బస్సులు బంద్ అయ్యాయన్నారు.

థామస్ రెడ్డిని బహిష్కరించినం.. 

టీ‌‌ఎం‌‌యూ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెలో పాల్గొన్న అన్ని రకాల ఉద్యోగులకు సమ్మె కాలానికి జీతాలు ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సాధారణ సభ్యులుగా ఉండి టీఎంయూ పేరిట లెటర్ హెడ్ తయారు చేసుకుని యూనియన్ వ్యతిరేక కార్యక్రమాలు సాగిస్తున్న ఎం.థామస్ రెడ్డి, డీపీ‌‌ఆర్ రెడ్డి, నరేందర్, కమలాకర్ గౌడ్, ఉషాకిరణ్‌లను టీఎంయూ నుంచి బహిష్కరిస్తూ తీర్మానించినట్లు ప్రకటించారు. టీఎంయూ కోశాధికారి రాజలింగం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మొహమ్మద్, నిరంజన్, యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి పాల్గొన్నారు.

ఎఫ్ఎన్సీ సవరించకుంటే దీక్ష

ఆర్టీసీ కార్మికుల యూనియన్ కు ఎమ్మెల్సీ కవిత గౌరవ అధ్యక్షురాలు అవుతారని థామస్ రెడ్డి అంటున్నారని, తమకు సంతోషమేనని, కానీ కార్మికులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని అశ్వత్థామ రెడ్డి అన్నారు. జాబ్ సెక్యూరిటీ ఆర్డర్ లో ఎఫ్ఎన్సీ (ఫేర్ నాట్ కలెక్ట్) కేసుల్లో ఉద్యోగులను తీసివేసే అధికారం ఇచ్చారని, దీన్ని సవరించకపోతే ఈ నెల 21 తర్వాత మళ్లీ పోరాటం చేస్తామని హెచ్చరించారు. గన్ పార్క్ వద్ద నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించారు. థామస్ రెడ్డి టెన్త్ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడని, దానిపై విచారణ జరుగుతోందన్నారు. లీవ్ పెట్టుకుంటే ఇవ్వకుండా షోకాజ్ ఇచ్చారని, అది టిష్యూ పేపర్ తో సమానమన్నారు.

జాబ్ సెక్యూరిటీ ఓ మైలురాయి: మంత్రి పువ్వాడ

ఆర్టీసీ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ కల్పించడం సంస్థ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థ అభివృద్ధి కోసం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను పెంచేందుకు ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్​లోని ట్రాన్స్​పోర్ట్ భవన్​లో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో కలిసి జాబ్ సెక్యూరిటీ పాలసీని మంత్రి విడుదల చేశారు. సంస్థ బాగుండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వచ్చారని చెప్పారు. ఇప్పటివరకు ఉద్యోగులు అభద్రతతో డ్యూటీ చేసేవారన్నారు. ఇకపై మళ్లీ మళ్లీ తప్పులు చేస్తే తప్ప.. ఎంప్లాయీస్ కు శిక్ష ఉండని విధంగా కొత్త పాలసీని తెచ్చామని తెలిపారు. టికెట్ తీసుకునే బాధ్యత ప్యాసింజర్లదేనని, సిబ్బంది ఏవైనా చిన్న తప్పులు చేస్తే వాటిని డిపో మేనేజర్ స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీలో టికెట్ల ద్వారా రోజూ రూ.10 కోట్ల ఆదాయం వస్తోందని, దాన్ని రూ.13 కోట్లకు పెంచేందుకు కృషి చేయా లని ఉద్యోగులకు సూచించారు.

ఇవి కూడా చదవండి..

లైన్ దాటి మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడ్త.. వినకపోతే కాళ్లు పట్టుకొని బండకు కొడతా

కేసీఆర్​ వార్నింగ్​ వెనుక మతలబేంది..? ఆరా తీస్తున్న కేడర్

వైరల్ వీడియో: మహిళా జడ్జితో నిందితుడి పరాచకాలు