కుస్తీనా.. దోస్తీనా? : ఆర్‌‌.దిలీప్‌‌రెడ్డి

కుస్తీనా.. దోస్తీనా? :  ఆర్‌‌.దిలీప్‌‌రెడ్డి

మైనార్టీలు ఈ దేశంలో తరచూ చర్చనీయాంశమే! దాంతో వారికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ! వారే లక్ష్యంగా పార్టీలు వ్యూహ-ప్రతివ్యూహాలు పన్నుతుంటాయి. అది పార్టీల లాభనష్టాల వ్యవహారమే తప్ప ముస్లింలకు ఒరిగేదేమీ ఉండదు. ముస్లింలు ఇతర బలహీన వర్గాల సంరక్షణ కోసమే పనిచేస్తున్నట్టు చెప్పుకునే ఎంఐఎం వల్ల కూడా వారికి కలిగే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ, అలా పడిన ముద్ర వల్ల మజ్లీస్‌‌ పార్టీ పొందే రాజకీయ ప్రయోజనమే ఎక్కువ! గంపగుత్తగా ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం తెలుగునాట మజ్లీస్‌‌తో ముందు కాంగ్రెస్‌‌ అంటకాగింది. రాష్ట్రం ఏర్పడ్డ నుంచి బీఆర్​ఎస్​ వారితో సయోధ్య నెరుపుతోంది. ఆ మేర లబ్ధి కూడా పొందుతోంది. అదేదో సయోధ్య బెడిసినట్టుందని, మజ్లీస్‌‌ తిరిగి కాంగ్రెస్‌‌ వైపు నడుస్తోందా? అన్న తాజా చర్చ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. అదంత తేలిగ్గా జరిగే ఆస్కారం లేదని క్షేత్ర పరిస్థితులు, గతానుభవాలూ చెబుతున్నాయి. ఈ లాలూచీ కుస్తీ ‘మిత్రుల’ మరేదైనా ఎత్తుగడా? అన్న సందేహమూ తలెత్తుతోంది.

తెలంగాణ ఏర్పడ్డ నుంచీ ఇక్కడి పాలకపక్షమైన బీఆర్‌‌ఎస్‌‌, మజ్లీస్‌‌ మిత్రపక్షాలుగా ఉంటున్నాయి. ముందు మజ్లీస్‌‌కు ఆ సఖ్యత చాలా ఏండ్లు కాంగ్రెస్‌‌తో ఉండేది. కిరణ్‌‌ కుమార్‌‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇరుపక్షాల అగ్ర నేతల మధ్య వివాదంతో బెడిసింది. తర్వాత టీఆర్‌‌ఎస్‌‌ మజ్లీస్‌‌కు దగ్గరయింది. కాంగ్రెస్‌‌ను కాదని బీజేపీ ఎదుగుతున్న క్రమంలో వారి బంధం ఇంకా పటిష్టమైంది. కానీ, అసెంబ్లీ తాజా బడ్జెట్‌‌ సమావేశాల సందర్భంగా ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌‌ ఒవైసీ, రాష్ట్ర కీలక మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్​తనయుడు కేటీఆర్​మధ్య జరిగిన మాటల యుద్ధం వల్ల బీఆర్‌‌ఎస్‌‌, మజ్లీస్‌‌కు బెడిసిందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో ఊపందుకుంది. అదే క్రమంలో... సదరు ప్రచారానికి ఊతమిచ్చేవిగా చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలతో చర్చ వేడి పుట్టిస్తోంది. మీ వైఖరి తప్పంటే, కాదు మీ వైఖరే తప్పని మంత్రి, మజ్లీస్‌‌ నేత అసెంబ్లీలోనే పరస్పరం నిందించుకున్నారు. ఇరుపక్షాల మధ్య ఇది అరుదే! మరుసటి రోజు అసెంబ్లీలోనే మజ్లీస్‌‌ నేత కాంగ్రెస్‌‌ శాసనసభాపక్ష నాయకుడితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక కలయికే తప్ప ఇందులో రాజకీయమేమీ లేదని వారు ఖండిరచినా, ఊహాగానాలు తప్పటం లేదు. కేసీఆర్‌‌ మంత్రి కేటీఆర్‌‌ను ఏమన్నారో, మజ్లీస్‌‌ అధినేత, హైదరాబాద్‌‌ ఎంపీ అసదుద్దీన్‌‌ ఒవైసీ తమ్ముడు అక్బరుద్దీన్‌‌ను ఏమన్నారో తెలియదు కానీ, చివరకు అక్బరుద్దీన్‌‌ హైదరాబాద్‌‌ పాతబస్తీ అభివృద్ధి గురించి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌‌తో భేటీ తర్వాత వివాదం సద్దుమణిగింది. చర్చ మాత్రం ఆగటం లేదు. తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అంతకు ముందు మజ్లీస్‌‌ చేసిన ప్రకటనే ఆ చర్చ పొగను రాజేసి, పెంచింది.

ఎవరితో ఎవరిది లాలూచీ కుస్తీ?

‘వారితో మేమెప్పుడు కలిసి పోటీ చేయలేదు, మాకు సంబంధం లేదు’ అని బీఆర్‌‌ఎస్‌‌ నేతలు ఎంత చెబుతున్నా, మజ్లీస్‌‌ బీఆర్‌‌ఎస్‌‌కు మిత్రపక్షమే అన్నది పలుమార్లు కేసీఆర్‌‌ బహిరంగంగా చెప్పిన నిజం. పార్టీ విస్తరణ పేరుతో ఎంఐఎం దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీ చేసినా, తెలంగాణలో హైదరాబాద్‌‌, దాని శివార్లకు మాత్రమే పరిమితమవటం రివాజు. తగిన సంఖ్యలో ముస్లిం ఓటర్లున్నా, తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేయకపోవడం టీఆర్‌‌ఎస్‌‌కు లాభిస్తోందనేది ఒక పరికల్పన! అందుకనుగుణంగానే రాష్ట్రంలో పాలకపక్షం కూడా పాతబస్తీలో రాజకీయంగా వారికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం పరస్పర సహకారంలో భాగమే! సర్కారుకు సభలో, బయట ఎంఐఎం బేషరతుగా మద్దతిస్తూ వస్తోంది. ఉద్రేకమో, వ్యూహమో తెలియదు కానీ, ఎంఐఎం ‘తెలంగాణలో మేం 50 స్థానాల్లో పోటీ చేస్తాం’ అనటం ఒక రకం బెదిరింపే! కానీ, ఇదంతా ఉత్తదేనని, ఈ ‘షాడోఫైట్‌‌’ టీకప్పులో తుఫాను, చివరకు వాళ్లిద్దరూ ఒకటే అని బీజేపీ విమర్శిస్తోంది. ‘ఇద్దరే కాదు, బీజేపీకి ఇవి రెండు ‘బీ’ టీంలు, కలిసి ముగ్గురూ ఒకటే, మమ్మల్ని ఎదగనీయకుండా ఇదంతా ముగ్గురి చీకటి ఒప్పందం’ అని కాంగ్రెస్‌‌ ఆరోపిస్తోంది. ఎవరు ఎవరికి ‘బీ’ టీమ్‌‌? పరిమిత స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడం ఎవరి ప్రయోజనాల కోసం? కాదని, 50 లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే ఎవరికి నష్టం? పరోక్షంగా మరెవరికి లాభం? అన్నదాన్ని బట్టి నిజం నిగ్గుతేలుతుంది. ఇప్పుడు వేర్వేరు రాగాలు పాడుతున్నా... బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌, ఎంఐఎం మూడూ ఒక గూటి పక్షులే! తాజాగా బీజేపీ–బీఆర్‌‌ఎస్‌‌ మధ్య బెడిసినందున, బీజేపీకి మేలు చేసేందుకు ఎంఐఎం క్రమంగా బీఆర్‌‌ఎస్‌‌కు దూరమయ్యే ఎత్తుగడ అనే ప్రచారమూ ఉంది. అదేం ఉండదు, దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓటులో ముస్లీం ఓట్లను తాను వేర్పరచి, బీజేపీకి మేలు చేసే పని ఎంఐఎం తెలంగాణ బయట చేస్తుంది. తెలంగాణలో మాత్రం తన ప్రయోజనాల కోసం బీఆర్‌‌ఎస్‌‌తోనే ఉంటుందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, అసలు బీఆర్‌‌ఎస్‌‌–బీజేపీదే లాలూచీ కుస్తీ అని, కాంగ్రెస్‌‌ను దేశంలో ఎక్కడా ఎదగనీయకుండా.. దాని మిత్ర పక్షాల్ని పక్కకు లాగే బీఆర్‌‌ఎస్‌‌ ఎత్తుగడ అనేది బీజేపీ విస్తృత వ్యూహంలో భాగమనే వారూ ఉన్నారు.

పరికల్పనలో నిజం పాలెంత?

బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం ఓట్లు, దాని ప్రధాన ప్రత్యర్థులపాలు కానీయకుండా చీలిక ఎత్తుగడే వివిధ రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ అనే వాదన గత కొన్నేళ్లుగా వినిపిస్తోంది. తానేమీ లబ్ధి పొందకపోయినా, వేర్వేరు రాష్ట్రాల్లో10 శాతం పైబడి ముస్లిం ఓట్లున్న నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేయడం ఈ సందేహాన్ని బలపరుస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 38 చోట్ల పోటీ చేసినా ఏమీ రాలేదు. 2022 లో 5 పార్టీల ‘బాగీదారీ పరివర్తన్‌‌ మోర్చా’ ఏర్పరచి, 95 స్థానాల్లో బరిలో దిగి ఒక సీటూ గెలువలేదు. పోటీ చేసిన పశ్చిమ బెంగాల్‌‌, ఉత్తరాఖండ్‌‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఫలితం శూన్యమే! మహారాష్ట్రలో 2014లో 24 చోట్ల పోటీచేసి 2 సీట్లు, 2019లో 44 చోట్ల పోటీ చేసి 2 సీట్లు మాత్రం గెలుచుకున్నారు. 2020 బీహార్‌‌లో 20 చోట్ల పోటీ చేసి 5 స్థానాల్లో ఎంఐఎం నెగ్గింది, కానీ, గెలిచిన వారిలో నలుగురు తర్వాత పార్టీని వీడి ఆర్జేడీలో కలిశారు. పలు చోట్ల ఫలితాల్ని ప్రభావితం చేసిన మాట నిజం. విస్తరణే లక్ష్యమైతే ఇన్నాళ్లు హైదరాబాద్‌‌(ఆ మాటకొస్తే పాతబస్తీ) బయట తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్నకు వారి వద్ద సమాధానమే లేదు. నగరం–శివార్లకు బయట ... కరీంనగర్‌‌, జగిత్యాల, మెట్‌‌పల్లి, కోరుట్ల, సిర్పూర్‌‌, ఆదిలాబాద్‌‌, నిర్మల్‌‌, ముథోల్‌‌, నిజామాబాద్‌‌ అర్బన్‌‌, బోధన్‌‌, కామారెడ్డి, మెదక్‌‌, సంగారెడ్డి, జహీరాబాద్‌‌, మహబూబ్‌‌నగర్‌‌, నల్గండ... ఇలా పాతిక నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసేంత సంఖ్యలో ముస్లిం మైనారిటీ ఓట్లుంటాయి. నిజంగానే 50 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తే రాజకీయ సమీకరణాల్లో వ్యత్యాసం ఖాయం. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్నా... పోటీ తీరు చూసి, బీజేపీని ఓడించే అభ్యర్థి సత్తాను బట్టి అది బీఆర్‌‌ఎస్‌‌ అయినా, కాంగ్రెస్‌‌ అయినా వారి వైపే మొగ్గుతామనే ముస్లిం ఓటర్లూ తెలంగాణలో ఉన్నట్టు ‘పీపుల్స్‌‌పల్స్‌‌ సర్వే’ చెబుతోంది.

ఎంఐఎం సాహసించేనా?

బయట ఎలా ఉన్నా సొంత రాష్ట్రంలో పాలకపక్షాలతో అంటకాగటం మజ్లీస్‌‌కు పరిపాటి! 50 చోట్ల పోటీ చేస్తుందా? అన్నది సందేహమే! నగరం-శివార్లను దాటి తాను అభ్యర్థుల్ని పోటీకి దింపి, తమకు ఖాయంగా ఉన్న పాతబస్తీ-శివారు సీట్లలో కుంపటి పొగకు సిద్ధమౌతుందా? అనే సందేహాలూ రాజకీయవర్గాల్లో ఉన్నాయి. ఒకసారి పాతబస్తీలో సీపీఎం చేసిన హడావుడికే బెంబేలెత్తింది. ఇపుడు కమ్యూనిస్టులు బీఆర్‌‌ఎస్‌‌తోనే ఉన్నారు! తమ ఆధిపత్యాన్ని ఎవరైనా ఒకసారి ప్రశ్నిస్తే... ఇక అంతే! అనే భయమూ ఎంఐఎంలో ఉంది. ఎటుతిరిగి ఎంఐఎం పోటీ చేసే స్థానాలెన్ని అనేదాన్ని బట్టే సయోధ్యలు, లాలూచీ ఫైట్లు, ‘బి’ టీమ్‌‌ ఊడిగాలు.. అన్నీ తేటతెల్లమౌతాయి.

- ఆర్‌‌.దిలీప్‌‌రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, పీపుల్స్‌‌ పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ