కిటకిటలాడిన గుట్ట.. సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన భక్తుల రద్దీ

కిటకిటలాడిన గుట్ట..  సెలవులు ముగుస్తుండటంతో  పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం (జూన్ 07) భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, స్పెషల్‌‌‌‌ దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. 

స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజే ఆలయానికి  రూ.73,75,642 ఆదాయం వచ్చింది. ప్రసాద విక్రయం ద్వారా అత్యధికంగా రూ.25,04,420, వీఐపీ దర్శనాలతో రూ.17,74,200, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8.15 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.6.87 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.

  • నారసింహుడిని దర్శించుకున్న కిషన్‌‌‌‌రెడ్డి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌‌‌‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం (జూన్ 06) రాత్రి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన రాత్రి ప్రెసిడెన్షియల్‌‌‌‌ సూట్‌‌‌‌లో బస చేశారు. ఆదివారం తెల్లవారుజామునే కొండపైకి వెళ్లి  స్వామివారి అభిషేక దర్శనం చేసుకున్నారు.

 ఆయనకు ఈవో భవానీశంకర్‌‌‌‌ ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజల అనంతరం, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, నారసింహుడి ప్రతిమను అందజేశారు.