
- సీఎస్ఈ సీటు..15 లక్షలు
- మేనేజ్మెంట్ కోటా సీట్లలో అడ్డగోలు దందా
- కౌన్సెలింగ్ కు ముందే మొదలైన అమ్మకాలు
హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ కౌన్సెలింగ్ కూడా మొదలవకముందే రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల అమ్మకాల దందా షురువైంది. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ఇప్పటికే పూర్తయింది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) సీట్లకు ఫుల్ డిమాండ్ కొనసాగుతోంది. ఒక్కో సీటుకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. ఇదంతా ఓపెన్ గా అన్ని కాలేజీల్లో జరుగుతోంది. అయినా, ఉన్నతాధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. స్టేట్లో 170 వరకూ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలుండగా, వాటిలో లక్షకు పైగా సీట్లున్నాయి. రూల్స్ప్రకారం ఆయా కాలేజీల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా, మిగిలిన 30శాతం సీట్లు మేనేజ్మెం ట్ కోటా ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇది కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే కన్వీనర్ కోటా, మేనేజ్ మెంట్ కోటా సీట్లను నింపాల్సి ఉంటుంది. గత శనివారం టీఎస్ ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్ను రిలీజ్ చేశారు.
వచ్చేనెల 26 నుంచి ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ, ఇదంతా ప్రైవేటు మేనేజ్మెంట్లకు పట్టినట్టు లేదు. అప్పుడే మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మేనేజ్మెంట్ కోట సీట్లకు కాలేజీ స్టేటస్ కు అనుగుణంగా డొనేషన్లు, ఫీజులు ప్రకటించేశాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలకు ఫుల్ డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులకు మేనేజ్మెంట్లు భారీగా ఫీజులు నిర్ణయించారు. ఒక్కో కాలేజీలో రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా విడతల వారీగా కాకుండా, ఒకేసారి క్యాష్ రూపంలో కట్టేయ్యాలి. అలాగైతేనే, సీటు ఇస్తామని మేనేజ్మెంట్ప్రతినిధులు తేల్చిచెబుతున్నారు.
సీఎస్ఈ సీట్లకే ఫుల్ డిమాండ్
ఇంజినీరింగ్లో అనేక బ్రాంచీలున్నా.. కంప్యూటర్ సైన్స్ సీట్లకు డిమాండ్ ఎక్కువ. సీఎస్ఈ, దాని అను బంధ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర వాటి ల్లో గతేడాది సుమారు 54వేల వరకూ సీట్లున్నాయి. వీటిలో 30% సీట్లను మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసుకునే అవకాశముంది. ప్రస్తుతం పేరెంట్స్, స్టూడెంట్లు అంతా ఆ కోర్సులో జాయిన్ అయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న మేనేజ్మెంట్లు.. అమాంతం సీట్ల రేటును పెంచేస్తున్నారు. అయితే, కౌన్సెలింగ్ మొదలయ్యాక వీటికి మరింత ధర పెంచుతారని భావించిన పేరెంట్స్.. ఇప్పటి నుంచే బేరాలు మొదలుపెట్టారు.
నిబంధనలు గాలికి
ప్రతి కాలేజీలో మేనేజ్ మెంట్ కోటాలో 30శాతం ఉంటుంది. ఈ సీట్లను హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే నింపాల్సి ఉంటుంది. కానీ, అదేదీ పట్టించుకోవట్లేదు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాకముందే, మేనేజ్ మెంట్ కోటా సీట్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అయితే, నిబంధనల ప్రకారం మేనేజ్ మెంట్ సీట్లకూ స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లు తీసుకొని, జేఈఈ ర్యాంకులకు ప్రయార్టీ ఇచ్చి సీట్లు కేటాయించాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకు, ఆ తర్వాత చివరలో ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకొని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ప్రైవేటు మేనేజ్ మెంట్లు అవేవీ పట్టించుకోవడం లేదు. ఎక్కువ డబ్బులు ఎవరిస్తే వారికే సీట్లు అలాట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మేనేజ్ మెంట్ సీట్లకూ టీఏఎఫ్ఆర్సీ కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణయించిన ఫీజునే వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ మేనేజ్మెంట్లు మాత్రం భారీగా డొనేషన్లు, ఫీజులను పేరెంట్స్ నుంచి వసూలు చేస్తున్నాయి. మరోపక్క ఎన్ఆర్ఐ కోటా కింద 15శాతం సీట్లను ఏఐసీటీఈ పర్మిషన్తో భర్తీ చేసుకునే అవకాశం ఉంది. దీనికి 5వేల డాలర్లు మాత్రమే ఫీజు తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలు కూడా అమలు చేయట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, మేనేజ్మెంట్ సీట్ల అమ్మకాలను నియంత్రించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారమే సీట్లు నింపాలె
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారమే మేనేజ్ మెంట్ కోటా (బీ కేటగిరి) సీట్లను భర్తీ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిష న్లు చేపడితే కాలేజీలపై చర్యలు తీసుకుం టాం. ప్రైవేటు కాలేజీలు ముందుగా సీట్లు ఇస్తామంటే, పేరెంట్స్ కూడా నమ్మి మోసపో వద్దు. ముందస్తు అడ్మిషన్లు చెల్లవు.
–ప్రొఫెసర్ లింబాద్రి, టీఎస్సీహెచ్ఈ చైర్మన్