అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరితే ప్రభుత్వంలో ఉండబోం.. షిండే వర్గం హెచ్చరిక

అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరితే ప్రభుత్వంలో ఉండబోం.. షిండే వర్గం హెచ్చరిక

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరబోతున్నారంటూ ఈ మధ్య వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే షిండే వర్గం బీజేపీ అధిష్టానానికి ముందే ఒక హెచ్చరిక పంపించింది. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ నేరుగా బీజేపీతో కలవదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీపీ గురించి తమ విధానం స్పష్టంగా ఉందన్నారు.

‘ఎన్సీపీ ద్రోహం చేసే పార్టీ. మేం అధికారంలో ఉన్నా ఎన్సీపీతో కలిసి ఉండబోం. బీజేపీ ఎన్సీపీతో చేతులు కలుపడం మహారాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజలకు ఇష్టం లేదు. అందుకే ఠాక్రే వర్గాన్ని వీడి బయటకు వచ్చాం’ అని సంజయ్ శిర్సాత్‌ తెలిపారు.

ఎన్సీపీని వీడుతున్నట్లు అజిత్‌ పవార్‌ చెప్పలేదని ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన నేత సంజయ్ శిర్సాత్ అన్నారు. ఒకవేళ అజిత్ పవార్ ఎన్సీపీని వీడితే తాము స్వాగతిస్తామని చెప్పారు. అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థా పవార్‌ ఎన్నికల్లో ఓడిపోవడం వల్లే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 16 మంది శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత అంశానికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 

2019లో సీఎంగా దేవేందర్‌ ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవర్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించడం వంటి పరిణామం మళ్లీ జరిగితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వస్తుందని సంజయ్ శిర్సాత్ హెచ్చరించారు.