
గయాన్(అఫ్గానిస్తాన్) : సౌత్ఈస్ట్ అఫ్గానిస్తాన్‌లో భూకంపం వచ్చిన వారం రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి మారలేదు. కూలిన మట్టి ఇండ్లు, మొండి గోడలు, దుమ్ము తప్ప ఏం కనిపించడం లేదు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కొందరి మృతదేహాలు శిథిలాల కిందే ఉండిపోయాయి. ఇప్పటి వరకు 1,150 మంది చనిపోగా.. వేలాది మంది గాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సాయం చేసేందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయామని, మళ్లీ జీవితం ఎలా ప్రారంభించాలో తెలియడం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స కూడా అందని పరిస్థితి నెలకొంది. ఇండ్లు మళ్లీ కట్టుకుందామంటే చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి. పక్టికా, ఖోస్ట్ ప్రావిన్స్‌లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, బాధితులను ఆదుకోవాలంటూ తాలిబన్ ప్రభుత్వం అమెరికాను కోరింది. ఫ్రీజ్ చేసిన మనీని రిలీజ్ చేయాలని కోరింది. 800 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను కోరుతున్నారు. కొన్ని దేశాల నుంచి టెంట్లు, టవెల్స్, బెడ్లతో పాటు నిత్యావసరాలు అందాయి. యూఎన్ హెలీకాప్టర్లు అక్కడ ల్యాండై.. బ్రెడ్, బియ్యం, బ్లాంకెట్లు, ఆహార ప్యాకెట్లతో పాటు మెడిసిన్స్ అందజేశాయి.ఇరాన్, పాకిస్తాన్, సౌత్ కొరియా, యూఏఈ, ఖతర్‌తో పాటు ఇండియా సాయం చేసింది.