పేదవాళ్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ

పేదవాళ్ల సంక్షేమమే  ప్రభుత్వ ధ్యేయం : జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ

కంది, వెలుగు :  నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, అర్హులందరికీ ఇండ్లు ఇచ్చేలా చూస్తామని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, టీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు  చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్, సంగారెడ్డి మండలం ఫసల్​వాది గ్రామ శివారులలో నిర్మించిన 425 డబుల్​ బెడ్ రూమ్​ ఇండ్లను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కలెక్టర్ శరత్​ తో కలిసి వారు ప్రారంభించారు. లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయించి వారికి పండ్లు, స్వీట్లు, తాంబూలాలతో ఇంటి పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. కాశీపూర్​లో రూ.6 కోట్లతో 4 బ్లాక్ లలో నిర్మించిన 96 ఇండ్లను కాశీపూర్, ఏర్దనూర్, కంది, ఉత్తరపల్లి గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు. ఫసల్​వాది గ్రామంలో సుమారు రూ. 20 కోట్లతో నిర్మించిన 329 ఇండ్లను కులబ్​గూర్, సంగారెడ్డి, ఫసల్​వాది గ్రామాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ ద్వారా జరిగిందన్నారు. అన్ని కుటుంబాలు ఐక్యంగా ఉండి కాలనీని ఆదర్శంగా మార్చాలని కోరారు.

 తెలంగాణ ప్రభుత్వం పార్టీలకు, కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తోందన్నారు. లబ్ధిదారులు తమకు ఇచ్చిన ఇంట్లోనే ఉండాలని, తాళం వేసి ఖాళీగా ఉంచోద్దని సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయా కాలనీలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్ పర్సన్ లతా, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లు రాలేదని మహిళల ఆందోళన 

ఫసల్​వాదిలో ఇచ్చిన డబుల్​ ఇండ్ల వద్ద కొందరు తమకు ఇండ్లు రాలేదని కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. సభా ప్రాంగణం  ఇబ్బంది కాకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ సంగారెడ్డి టౌన్​తో పాటు ఇతర గ్రామాలకు ఇండ్లు ఇచ్చిన వారిలో సగానికి ఎక్కువ మందికి సొంత ఇండ్లు ఉన్నాయన్నారు. పైరవీలు చేసిన వారికి, లీడర్ల అనుచరులకే ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్​శరత్​, టీఎస్​హెచ్​డీసీ చైర్మన్​ చింతా ప్రభాకర్ కు వారు వినతిపత్రాలు ఇచ్చారు. కొందరు మహిళలు కలెక్టర్​ కాళ్లపై పడబోయారు. ఇండ్లు తీసుకున్న వారిలో అర్హులుంటే మంత్రితో మాట్లాడి అర్హులకు  ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన చెందవద్దని  చింతా ప్రభాకర్​ వారికి సూచించారు.