
- పూర్తి స్థాయిలో అమలుకాని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
- ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న బాధితులు
- సర్కార్ తీరుపై కోర్టుకు వెళ్లిన 10 వేల మంది
- ప్రాజెక్టుల ప్రాంతాల్లో నెలల తరబడి దీక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... రైతులకు పరిహారం చెల్లించడం లేదు. వేగంగా భూసేకరణ చేస్తున్న సర్కార్.. పరిహారం చెల్లింపులో మాత్రం ఏండ్లకేండ్లు ఆలస్యం చేస్తోంది. పరిహారం కోసం రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ అరిగోస పెడుతోంది. ఐదారేండ్ల కింద తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోగా, ఇచ్చిన కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. సర్కార్ కు భూములిచ్చిన రైతులు పరిహారం అందక, ఉపాధి లేక కుటుంబాన్ని సాదేందుకు తిప్పలు పడుతున్నారు. పిల్లలను చదివించలేక, లగ్గాలు చేయలేక మానసిక వేదనకు గురవుతున్నారు.ఉన్న కాస్త భూమిని సర్కార్ తీసుకోవడం, వచ్చే అరకొర పరిహారంతో మరో చోట భూమి కొనుక్కునే పరిస్థితి లేకపోవడంతో పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్, ఇతర నగరాలకు వలస వెళ్తున్నారు.
కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, దేవాదుల తదితర ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఇండస్ట్రీయల్ కారిడర్ల వరకు అన్నీ చోట్ల ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమల కింద దాదాపు 2 లక్షల ఎకరాల భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. ఇందులో ఇప్పటికే 1.60 లక్షల ఎకరాల వరకు సేకరించింది. కానీ నిర్వాసితుల్లో చాలా మందికి పరిహారం చెల్లించలేదు. సర్కార్ పరిహారం చెల్లించకుండానే రైతుల భూముల్లోకి చొరబడి పనులు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
పరిహారం అంతంతే..
2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామాల్లోనైతే మార్కెట్ విలువ కంటే 4 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూముల సేకరణ కోసం 2015లో జీవో నంబర్ 123 రిలీజ్ చేసింది. దీని ప్రకారం మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం చెల్లిస్తారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమి తీసుకునేలా మరో జీవో (నంబర్ 45)ను ఇచ్చింది. ఈ రెండు జీవోలనూ హైకోర్టు రద్దు చేసింది. కానీ అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం సుమారు 19,570 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం.. సంబంధిత ఇంజనీర్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసింది. తర్వాత కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద బదిలీ చేసింది. పరిహారం మొత్తాన్ని తక్కువగా చెల్లించేందుకు ప్రభుత్వం 2014 నుంచి 2021 వరకు భూముల మార్కెట్ వాల్యూను కూడా సవరించలేదు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ఆయా జిల్లాల్లో అప్పట్లోనే ఎకరం ధర రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉంది. నిర్వాసితులకు ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు చెల్లించింది.
ప్రాణాలు తీసుకుంటున్న నిర్వాసితులు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, గౌరవెల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు ఐదేండ్లవుతున్నా పూర్తి పరిహారం అందలేదు. ఇండ్ల నిర్మాణమూ జరగలేదు. బస్వాపూర్ రిజర్వాయర్ కింద 1,229 ఎకరాల భూములు కోల్పోయిన బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు పరిహారం రాకపోవడంతో.. 35 రోజులుగా వారు రిజర్వాయర్ కట్టపై దీక్షలు చేస్తున్నారు. తనకున్న రెండెకరాలు ప్రాజెక్టు కింద పోయిందని, భూమి లేదనే కారణంతో పిల్లనివ్వడం లేదన్న వేదనతో భూనిర్వాసితుడు వల్దాసు భిక్షపతి కొడుకు బాలస్వామి(25) గతేడాది ఉరేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పిన్నం సతీశ్ పరిహారం అందలేదనే మనోవేదనతో 2021 మేలో ఆఫీసర్ల ముందు కిరోసోన్ పోసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. జులైలో రావుల రాజు(40) అనే నిర్వాసితుడు గుండెపోటుతో చనిపోయాడు.
అసైన్డ్ భూములు గుంజుకుంటోంది..
దళితులు, గిరిజనులు, బీసీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటున్నది. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం 25 జిల్లాల్లో 11,500 ఎకరాలు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. నిరుడు 9 వేల ఎకరాలు సేకరించింది. మిగతా భూముల సేకరణకు నోటిఫికేషన్లు ఇస్తోంది. అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు హక్కులు లేవంటూ బలవంతంగా తీసుకుంటున్నది. తామ భూములివ్వబోమని రైతులు చెప్పినా వినడం లేదు. అసైన్డ్ భూములనే సాకుతో ఎకరాకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. నిమ్జ్ కోసమని ప్రభుత్వం ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్, ఝరాసంగం మండలాలకు చెందిన 18 గ్రామాలు, 5 తండాల్లో 2,800 ఎకరాలు సేకరించింది. ఇందులో అసైన్డ్ భూములే 924 ఎకరాలు ఉన్నాయి. కొందరు పట్టాదారులకు ఎకరాకు రూ.5.60 లక్షలు, మరికొందరికి రూ.7 లక్షలు చెల్లించారు. అసైన్డ్ భూములకు కేవలం రూ.3.25 లక్షలు మాత్రమే ఇచ్చారు.
కోర్టుకు పోతున్న రైతులు..
భూసేకరణ చట్టం–2013కు విరుద్ధంగా ప్రభుత్వం భూములు లాక్కుంటుండడంతో ఏడేండ్లలో దాదాపు 10 వేల మంది కోర్టు మెట్లెక్కారు. పరిహారంలో జరుగుతున్న అన్యాయంపై సుమారు 4 వేల కేసులు వేశారు. ఫలితంగానే హైకోర్టు గతంలో జీవో నంబర్ 123ను కొట్టేసింది. దీంతో నిమ్జ్ కోసం ఈ జీవో కింద సేకరించిన భూములను తిరిగి ఇవ్వాలిని 254 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇక్కడ అసైన్డ్ భూములు కలిగిన మరో 54 మంది రైతులకు పరిహారం అందకపోవడంతో కోర్టుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేపట్టిన ప్రభుత్వం.. స్థానిక రైతుల అంగీకారం లేకుండానే ధరణి పోర్టల్ లో వారి పేర్లు తీసేసింది. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించగా.. రైతుల పేర్ల మీదికి భూములు మార్చాలని ఆదేశాలిచ్చింది.