‘మీజిల్స్‌‌‌‌’పై ఆరోగ్య శాఖ అలర్ట్‌‌‌‌

‘మీజిల్స్‌‌‌‌’పై ఆరోగ్య శాఖ అలర్ట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆరోగ్య శాఖ మీజిల్స్ పై అప్రమత్తమైంది. ప్రతి ఆశ వర్కర్, ఏఎన్‌‌‌‌ఎం తన పరిధిలోని పిల్లలందరూ మీజిల్స్ అండ్ రుబెల్లా కంటైనింగ్ వ్యాక్సిన్‌‌‌‌(ఎంఆర్ వ్యాక్సిన్) వేయించుకున్నారా? లేదా? రీచెక్ చేయాలని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ శ్వేత మహంతి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబై సహా, ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మీజిల్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జార్ఖండ్, గుజరాత్, కేరళలోనూ కేసుల సంఖ్య పెరిగింది. ఇటీవలే ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ హెల్త్ టీమ్‌‌‌‌లను సర్వే కోసం పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది. ఇందుకోసం ఆశలు, ఏఎన్‌‌‌‌ఎంలు తమ పరిధిలో ఇంటింటికీ తిరిగి సర్వే చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరికైనా జ్వరం, రాషెస్ వంటి సింప్టమ్స్ కనిపిస్తే శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌‌‌‌లోని ఫీవర్ హాస్పిటల్‌‌‌‌కు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.   

రెండో డోస్​ వ్యాక్సిన్ కంపల్సరీ

మీజిల్స్ అనేది అంటు వ్యాధి. కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకితే ఒంటి మీద దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పట్నుంచో ఈ వైరస్ ఉనికి మన దేశంలో ఉంది. ఈ వైరస్ సోకకుండా పిల్లలకు రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇందులో మొదటి డోసు.. పిల్లలు పుట్టిన తర్వాత 9 నుంచి 12 నెలల మధ్య, రెండో డోసు.. 16 నుంచి 24 నెలల మధ్య వేస్తారు. మన రాష్ట్రంలో మొదటి డోసు వేయించుకున్న పిల్లల్లో సుమారు పది శాతం మంది రెండో డోసు వేయించుకోవడం లేదు. ఇలాంటి వాళ్లందరినీ గుర్తించి రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. మీజిల్స్ కేసులు పెరగడానికి వ్యాక్సినేషన్‌‌‌‌ సరిగా జరగకపోవడమే కారణమని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెబుతున్నారు. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో అప్రమత్తమయ్యామని అధికారులు చెప్తున్నారు.