తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమకారులే పాలించాలె

తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమకారులే పాలించాలె

దేశం గర్వించే స్థాయిలో ఉద్యమాన్ని చేసి, అన్ని పార్టీలను ఒప్పించి ఉద్యమకారులు తెలంగాణ సాధించారు. కానీ, ఉద్యమకారులు, ప్రజలు ఆశించిన ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో రాలేదు. అవకాశవాద, అబద్ధాలకోరు, ఎన్నికల హామీలను నెరవేర్చని కేసీఆర్​ ప్రభుత్వం నడుస్తోంది. ఎన్నికల సమయంలో కేసీఆర్ చెప్పిన మాయమాటలు నమ్మి ప్రజలు టీఆర్ఎస్​కు ఓటు వేశారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిపోయింది. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒక్క కుటుంబం కాకుండా ఉద్యమకారులు, మేధావులు ప్రభుత్వాన్ని నడిపి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న దశలో సబ్సిడీలకు స్వస్తి పలికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇల్లు లేని వారికి ఇల్లు, చేతి నిండా పని కల్పించగలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉద్యమకారులపై ఉంది. అలాంటి కార్యాచరణ కలిగిన పార్టీలో చేరి అధికారాన్ని చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.


తెలంగాణ ఉద్యమం 1968లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా మొదలైంది. ఉద్యమాన్ని గ్రామగ్రామానా వ్యాప్తి చేసేందుకు విద్యార్థులు రాజకీయ నాయకులను ఆశ్రయించారు. అనేక మంది ఉద్యమకారులు అమరులై, కనీవినీ ఎరుగని రీతిలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. సంవత్సరంలోనే చల్లారిపోయింది. అటు తర్వాత 1990ల్లో కొందరు గ్రామగ్రామానా తిరిగి తెలంగాణ జెండాలు ఎత్తి, ప్రొఫెసర్లు, మేధావులతో శిక్షణ ఇప్పించి మలి దశ ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆర్ఎస్​యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు అన్ని సంస్థలను ఏకం చేసి గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని ఉదృతం చేసిన నాడే ప్రత్యేక రాష్ట్రం సాధించగలమని మేధావులు ఇచ్చిన సలహాల మేరకు అటు నక్సలైట్లతో ఇటు ఆర్ఎస్ఎస్ నాయకులతో చర్చలు జరిపి గ్రామగ్రామానా జేఏసీలుగా ఉద్యమాన్ని తీవ్ర రూపానికి తీసుకెళ్లారు. ఉద్యమ ఉధృతి చూసిన వివిధ రాజకీయ పార్టీలు తమ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందాయి. సమైక్య వాదులమని సిద్ధాంతాన్ని బోధించే పార్టీలు కూడా తమ ఉనికి కోల్పోతామని తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. ఉద్యమకారులతో మమేకమై ప్రత్యేక రాష్ట్రాన్ని కోరాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్​లో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించింది. 2014 జూన్​ 2న తెలంగాణ ప్రజలు పరాయి పాలన నుంచి విముక్తి పొంది సొంత ఏలుబడిలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క వ్యక్తి వల్లో, ఒక్క కుటుంబం వల్లో ఏర్పడలేదు. సంబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకుని ప్రాణాలతో పాటు అనేక త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 
తెలంగాణ ప్రజలది ఉద్యమాల చరిత్ర
భారతీయులు బానిసత్వాన్ని ఎన్నడూ అంగీకరించరు. పైగా నరనరానా జాతీయవాదాన్ని జీర్ణించుకున్నారు. అందుకే బ్రిటిష్ వారిపై కొన్ని దశాబ్దాల పాటు పోరాటాన్ని సాగించి స్వాతంత్ర్యాన్ని సాధించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, సొంత రాజ్యాంగాన్ని ఆమోదించి, ప్రజల హక్కులను కాపాడుకుంటూ దేశాన్ని పరిపాలించుకుంటున్నాం. మన దేశ చరిత్ర చూస్తే దశాబ్దాలుగా ఒకే కుటుంబం పాలన సాగింది. కానీ, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించినందుకు భారతీయులు ఉద్యమాలు చేసి.. ఎన్నికల్లో ఆ కుటుంబ పార్టీని మట్టికరిపించారు. అధికారం చేపట్టిన కిచిడీ పార్టీలు విచ్చిన్నమైన తర్వాత మళ్లీ అదే కుటుంబ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఈ రోజు వరకు ఆ కుటుంబ పార్టీ అయితే అధికారంలో లేదంటే ప్రతిపక్షంలో ఉంటూ వచ్చింది. మరోవైపు ప్రాంతీయ ఉద్యమాల ద్వారా దేశంలో అనేక ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడి సొంత పాలన సాగిస్తున్నాయి. తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్త కాదు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కొరకు, బానిసత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. రజాకార్లను ఉరికించి తరిమికొట్టడమే కాకుండా నిజాం నవాబును భారత ప్రభుత్వానికి లొంగిపోయేలా చేసి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారు. సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోయే ఈ ఘనత తెలంగాణ గడ్డకు ఉన్నది.
ఉద్యమకారులంతా ఒకే వేదికపైకి రావాలె
తెలంగాణలోని పార్టీలను విశ్లేషించినప్పుడు కుటుంబ పార్టీ అయిన టీఆర్ఎస్​ కాకుండా ఇక మిగిలింది రెండే పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్​ వారసత్వ పార్టీ. బీజేపీలో కరడుగట్టిన కొద్ది మంది తెలంగాణ వాదులు ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1969 ఉద్యమకారులకు స్వాతంత్ర్య సమర యోధులకిచ్చే పెన్షన్ తోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తామని, అమరుల ఆశయాలకు భిన్నంగా సాగుతున్న అరాచక, అవినీతి, గడీల పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగినవారు, సిద్ధాంతాలతో పార్టీల్లో పని చేసిన వారు బీజేపీలో చేరాలి. నేడు తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది. సామాజిక తెలంగాణ రావాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలి. కాబట్టి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీలో ఉద్యమకారులు చేరి తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్య సుపరిపాలన అందించాలి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు సమావేశమై కొన్ని తీర్మానాలు చేశారు. ఉద్యమ ఎజెండాలోని అంశాల సాధనతోపాటు కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి మరో పోరాటం చేయాల్సి ఉందని, ఉద్యమ లక్ష్యాలు నెరవేరనందున మరోసారి ఉద్యమకారులందరూ ఒకే వేదికపైకి రావాలని తీర్మానించింది.
అన్యాయం చేసిన వారిని తెలంగాణ జనం సహించరు
రాజ్యాంగానికి కట్టుబడి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. మన దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. ఎక్కడైతే ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని ప్రజలు భావిస్తున్నారో అక్కడ ఆ పార్టీలను మట్టి కరిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు స్వాతంత్ర్య పిపాసులు. వారికి అన్యాయం జరిగిందని, ప్రజా పరిపాలన అందుబాటులో లేదని భావించిన నాడు గట్టి బుద్ది చెప్పి ఎన్నికల్లో ఓడించే సత్తా ఉందని కూడా నిరూపించారు. సీఎం కన్న బిడ్డనే నిజామాబాద్​ ప్రజలు ఓడించారు. ఆయనకు నమ్మకస్తుడైన బంధువును కరీంనగర్ లో ఓడించారు. కొన్ని నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి కుటుంబ పాలనకు ఓటర్లు బుద్ధి చెప్పడం జరిగింది. ప్రజా వ్యతిరేకతను పసిగట్టి కోట గోడల నుంచి దొర బయటకు వచ్చారు. తెలంగాణ తన సొంత జాగీరైనట్టు ప్రభుత్వ భూములను అందరికీ పంచిపెడుతున్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ, కుల వృత్తులకు దూరం చేసి ఓటుకు నోటులా కోట్ల రూపాయలను సబ్సిడీలుగా ఇచ్చి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కలతిరిగి గెలిచి అదే పద్ధతిని హుజూరాబాద్​ ఎన్నికలో ప్రయోగించాలని చూస్తున్నారు. దుబ్బాకలో కుటుంబ పార్టీ పాలనను ఓడించి తెలంగాణ ఉద్యమకారుడిని ఏ పార్టీ వాడని చూడకుండా ప్రజలు గెలిపించారు. అలాగే హుజూరాబాద్​ బై ఎలక్షన్లలో కూడా తెలంగాణ ఉద్యమకారుడిని గెలిపిస్తే తెలంగాణలో కుటుంబ పాలనకు, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడగలం.
                                                                                                    - మేచినేని కిషన్ రావు, అధ్యక్షుడు, 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి