
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. చోరీ జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో విగ్రహం ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాల్గా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ విగ్రహానికి రూ. 5 కోట్ల విలువ ఉంటుందని అంచనా. దీంతో ప్రొఫెషనల్ గ్యాంగే దొంగిలించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది జరిగిన సుమారు వారానికి మెదక్ జిల్లా దొంతి గ్రామంలో ఆండాళ్లమ్మ విగ్రహం చోరీకి గురైంది. ఈ రెండు ఘటనలు ఒకేవిధంగా జరిగినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు స్పీడప్ చేశారు.
చోరీకి పక్కాగా ప్లాన్
వర్గల్ వేణుగోపాల స్వామి విగ్రహ చోరీ విషయంలో దొంగలు పకడ్బందీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటీ ఆధారాలు లభించకకుండా పనికానిచ్చేశారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు గర్భ గుడి ద్వారాలను చాకచక్యంగా తీసిన దొంగలు తాము అనుకున్న పంచలోహ విగ్రహాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఇతర విలువైన విగ్రహాలు, ఆభరణాలు ఉన్నా వాటి జోలికి వెళ్లలేదు. ఆలయంలో రెక్కీ తర్వాతే తాము అనుకున్న విగ్రహాన్ని చోరీ చేసినట్లు తెలుస్తోంది. చోరీ చేసేటప్పుడు వేలిముద్రలు పడకుండా జాగ్రత్తపడటంతోపాటు డాగ్స్వ్కాడ్గుర్తించకుండా కారం పొడి చల్లినట్లు తెలుస్తోంది. ద్వారాలకు ఉన్న తాళాలను పగలగొట్టిన దొంగలు.. వాటి ఆచూకీ దొరకకుండా చేశారు.
నాలుగు టీమ్ లతో దర్యాప్తు
వర్గల్ వేణుగోపాలస్వామి విగ్రహ చోరీపై పోలీసులు నాలుగు ప్రత్యేక టీమ్ లతో దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిన ముందు రోజు గ్రామంలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరించారా అనే కోణంలో దర్యాప్తు చేయడంతో పాటు టవర్ లోకేషన్ ఆధారంగా కాల్ లిస్ట్ లను తనిఖీ చేసినా ఎలాంటీ ఆధారం దొరకనట్టు తెలుస్తోంది. టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు చేస్తున్నా ఇంతవరకు ఎలాంటీ లీడ్ దొరకలేదు.