ఇలాంటి సినిమాలకు క్రేజ్‌‌ ఎప్పటికీ తగ్గేదే లే!

ఇలాంటి సినిమాలకు క్రేజ్‌‌ ఎప్పటికీ తగ్గేదే లే!

మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు పెద్దలు.నిజమే.. డబ్బు చేయలేని పని లేదు. డబ్బు చొరబడని చోటు కూడా లేదు.చివరికి సినిమా కథల్లోనూ దాని హవా నడుస్తోంది.తన పవరేంటో చూపించి ప్రేక్షకుణ్ని కట్టి పడేస్తోంది.రీసెంట్‌‌గా వచ్చిన ‘సర్కారు వారి పాట’.. త్వరలో రానున్న ‘ఎఫ్‌‌ 3’..రెండూ కూడా కాసుల చుట్టూ తిరిగే కథలే. ఇలాంటి సినిమాలకు క్రేజ్‌‌ ఎప్పటికీ తగ్గేదే లే!

డబ్బే డబ్బు

బస్‌‌ కండక్టర్ చిల్లర ఇవ్వకపోతే కూడా కొందరు బాధపడిపోతారు. ఎందుకంటే ఆ చిల్లర కూడా మధ్య తరగతివాడి మంత్లీ బడ్జెట్‌‌ని తారుమారు చేస్తుంది. డబ్బు ఉన్నవాడికి దాని లెక్క తెలీదు. లేనివాడికి ఖర్చుల లెక్క ఎంతకీ తేలదు. ఆ కష్టాన్ని చాలా సినిమాలు చూపించాయి. మిడిల్ క్లాస్ లైఫ్‌‌ గురించి తీసిన సినిమా అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ‘అమ్మో ఒకటో తారీఖు’. ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. మధ్య తరగతి వాడి జీవితం ఎలా ఉంటుందో, ఎన్ని కష్టాలు దాటాల్సి వస్తుందో, కన్నీళ్లను ఎంతగా దాచుకోవాల్సి వస్తుందో మనసు పిండేసేలా చూపించారందులో. అలాగే డబ్బు డబ్బు డబ్బు, డబ్బంటే ఎవరికి చేదు, డబ్బు భలే జబ్బు, సంసారం ఒక చదరంగం.. ఇలా చాలా సినిమాలు ఫ్యామిలీస్‌‌లో ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ ఎలా ఉంటాయో, రిలేషన్స్​ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూపించాయి. అవి తెచ్చే తంటాలను వివరించాయి. ‘ఎఫ్‌‌ 3’ కూడా ఫ్యామిలీ సబ్జెక్టే. ఫన్‌‌, ఫ్రస్ట్రేషన్‌‌లతో ఫైనాన్స్ చేరి ఏం హంగామా చేస్తుందో చూడాల్సిందే.

 

నోట్ల పాటలు

రైలు బండిని నడిపేది పచ్చ జెండా అయితే బతుకు బండిని నడిపేది పచ్చనోటు అన్నాడో హీరో. అమ్మ చుట్టమూ అయ్య చుట్టమూ కాకపోయినా అన్నీ అదే అంటూ మనీ గురించి వర్ణించాడు మరో హీరో. మనీ రిలేటెడ్ సాంగ్ ఏదైనా కూడా వాస్తవాలను కళ్లకు కట్టేలా చెబుతుంది. ఇలాంటి పాటలు రాయమంటే ప్రతి లిరిసిస్ట్ కలం కదం తొక్కుతుంది. అందుకే అద్భుతమైన డబ్బు పాటలెన్నో వచ్చాయి మనకి. ‘డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా అది లేనివాడి బతుకంతా ఒకటే చింత (బీదల పాట్లు), ధనమేరా అన్నిటికీ మూలం (లక్ష్మీనివాసం), కో అంటే కోటి పొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి (క్షణక్షణం), నోటు పచ్చనోటు అయ్యబాబోయ్ చాలా గ్రేటు.. దీనివల్లే ఏ మనిషికైనా గుండెపోటు, వెన్నుపోటు (మిస్టర్ నూకయ్య), ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్ (వేదం).. ఇలా ఎన్నో పాటలు డబ్బు చేసే చిన్నెల గురించి కళ్లకు కట్టినట్లు చెప్పాయి. ఇక ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే’ లాంటి  పాటలు డబ్బు జీవితాన్ని ఎలా తలకిందులు చేయగలదో చెప్పకనే చెప్పాయి. 

సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా మనీ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌‌ అవసరం. ‘ఠాగూర్’ సినిమా చూశాం కదా. ప్రభుత్వాధికారులు డబ్బుకి లొంగిపోతే అవినీతి ఎలాంటి అక్రమాలు చేస్తుందో చాలా గొప్పగా చూపించారు. అలాగే ‘ఇజం’. ఇది కూడా అవినీతిని వ్యతిరేకించిన సినిమానే. ‘యువసేన’ లక్ష్యం కూడా అవినీతి రహిత సమాజమే. ‘పైసా’లో నాని కోరుకుంది కూడా ఇలాంటి సొసైటీనే. ఇక చిరంజీవి ‘చాలెంజ్’ అయితే.. యువత తలచుకుంటే డబ్బు సంపాదించడం, జీవితంలో ఎదగడం అసాధ్యమేం కాదని ప్రూవ్ చేసింది. మనీ రిలేటెడ్ మూవీస్‌‌లో మంచి సినిమాగా నిలిచిపోయింది.

స్కామ్‌‌ స్టోరీస్‌‌

స్కామ్.. ఈ మాట ఇటీవలి కాలంలో బాగా వినబడుతోంది. అసలింతకీ స్కామ్ అంటే ఏంటి? మోసమనేది చిన్నగా జరిగితే చీటింగ్. పెద్ద మొత్తంలో జరిగితే స్కామ్. ఇవి చాలా  దశల్లో, చాలా రకాలుగా జరుగుతాయి. మనందరి జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఆ ప్రభావం ఇన్‌‌డైరెక్ట్‌‌గా ఉండటం వల్ల మనం గుర్తించలేమంతే. వాటి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి కొందరు ఫిల్మ్ మేకర్స్ రకరకాల స్కామ్స్‌‌ ఆధారంగా సినిమాలు తీశారు, తీస్తున్నారు. ఎడ్యుకేషన్‌‌ సిస్టమ్‌‌ని తమ స్వార్థం కోసం కొందరు ఎలా వాడుకుంటున్నారో ‘అర్జున్ సురవరం’ చూపించాడు. స్టూడెంట్స్‌‌ని, వాళ్ల పేరెంట్స్‌‌ని ర్యాంకుల మత్తులో పడేసి డబ్బు లాగేసే గ్యాంగ్‌‌ని ‘వై చీట్ ఇండియా’లో ఇమ్రాన్‌‌ హష్మి కళ్లకు కట్టాడు. బడా వ్యాపారాల వెనుక ఉండే చీకటి కోణాల్ని ‘కార్పొరేట్’ చూపిస్తే.. స్టాక్‌‌ మార్కెట్‌‌ క్రైమ్‌‌ని ‘బాజార్‌‌‌‌’ చూపించింది. మంచు విష్ణు, కాజల్‌‌ ‘మోసగాళ్లు’గా చేసిన స్కామ్ చూసి జనాల బుర్ర తిరిగింది. స్కామ్స్ చేయడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన హర్షద్ మెహతా జీవితం ద బిగ్‌‌బుల్‌‌, స్కామ్‌‌ 1992 పేర్లతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. టెక్నాలజీని వాడి జనాన్ని మోసగించడాన్ని ‘అభిమన్యుడు’ అడ్డుకున్నాడు. బడాబాబులు వేల కోట్ల లోన్లు ఎగ్గొట్టినా పట్టించుకోని బ్యాంకులు పేదవాళ్లని మాత్రం  వేధించడం ఏంటని రీసెంట్‌‌గా ‘సర్కారువారి పాట’లో ప్రశ్నించాడు మహేష్. ఎవరో చేసే తప్పులకి సామాన్యుడి మీద అదనపు భారం పడుతోందని చెప్పేందుకు చేసిన ప్రయత్నమే అది. ఇలా చెప్పుకుంటూ పోతే స్కామ్స్ చుట్టూ తిరిగే సినిమాలు చాలానే ఉన్నాయి.హాలీవుడ్‌‌లోనూ మనీ రిలేటెడ్ సినిమాలు చాలానే వస్తుంటాయి. అవార్డులూ రివార్డులూ సంపాదిస్తుంటాయి. మైఖేల్ డగ్లస్ నటించిన ‘వాల్ స్ట్రీట్: మనీ నెవర్ స్లీప్స్‌‌’, విన్ డీసిల్‌‌ ‘బాయిలర్ రూమ్’, రసెల్ క్రో ‘ఎ గుడ్‌‌ ఇయర్’, ఇవాన్ మెక్‌‌గ్రెగర్‌‌‌‌ ‘రోగ్ ట్రేడర్’, లియొనార్డో డికాప్రియో ‘ద ఉల్ఫ్ ఆఫ్ వాల్‌‌ స్ట్రీట్’, జార్జ్ క్లూనీ ‘మనీ మాన్‌‌స్టర్‌‌‌‌’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకి అంతే ఉండదు. 

 

కాసుల కామెడీ.. ఖర్చు చేయలేని ట్రాజెడీ

కథ డబ్బుతో ముడిపడి ఉంటుంది. పాత్రలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఆ క్రమంలో జెనరేట్ అయ్యే కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన సందర్భాలు కోకొల్లలు. మనీ, మనీ మనీ చిత్రాలు గుర్తొస్తే ఇప్పటికీ ఆడియెన్స్ నవ్వాపుకోలేరు. అప్పట్లో వచ్చిన భాగ్యలక్ష్మి బంపర్‌‌‌‌ డ్రా, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు కూడా మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. ఇవన్నీ కామెడీని పండించి మెప్పించాయి. ఇలాంటి సినిమాలు బాలీవుడ్‌‌లోనూ ఎక్కువే. ఇక డబ్బు సంపాదించడం కోసం పడే కష్టం ఒకటైతే.. ఖర్చు పెట్టడం కోసం పడే కష్టం మరొకెత్తు. ‘బాబాయ్ అబ్బాయ్‌‌’లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అతని తండ్రి పెట్టిన కండిషన్‌‌కి బాలకృష్ణ తల వంచుతాడు. ఆయన చెప్పిన టైమ్‌‌లో చెప్పినంత డబ్బు ఖర్చు చేసి చూపించాలి. దానికి అతను పడే కష్టాలు మామూలుగా ఉండవు. ‘అరుణాచలం’లో రజినీకాంత్‌‌కి ఎదురయ్యింది కూడా ఇదే సమస్య. వీళ్ల లక్ష్యం సీరియస్ అయినా.. వాళ్లు పడే కష్టాలు మాత్రం ప్రేక్షకుల్ని చాలా బాగా ఎంటర్‌‌‌‌టైన్‌‌ చేశాయి.

అందరూ దొంగలే!

కొందరు కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కొందరు అవతలివాడు కష్టపడి సంపాదించినదాన్ని కొట్టేసి తాము హ్యాపీగా బతకాలనుకుంటారు. ఇలాంటివాళ్లు సినిమాల్లో కోకొల్లలుగా కనిపిస్తుంటారు. స్కీమ్స్‌‌ ద్వారా ప్రజల్ని అట్రాక్ట్ చేసి సొమ్ము చేసుకోవడంలో ‘బ్లఫ్  మాస్టర్’ ఆరితేరి పోయాడు. డబ్బు కోసం ఏమైనా చేయడానికి ‘ఖిలాడి’ రెడీ అయిపోయాడు. ‘డాలీకీ డోలీ’లో హీరోయిన్ పెళ్లి పేరుతో బోలెడంతమంది కుర్రాళ్లని దోచుకుంది. తప్పుడు దారిలో డబ్బు సంపాదించాలనుకున్న శ్రీవిష్ణుకి ‘అర్జున ఫల్గుణ’లో తన తప్పేంటో తెలిసొచ్చింది. ‘కనులు కనులను దోచాయంటే’లో ప్రేమ పేరుతో హీరో హీరోయిన్లు ఒకరినొకరు దోచుకునే ఆట అందరికీ తెగ నచ్చింది. ‘దోచెయ్‌‌’లో నాగచైతన్య, ‘జులాయి’లో అల్లు అర్జున్‌‌, ‘గ్యాంగ్‌ లీడర్​’లో నాని దొంగ సొమ్ము వల్ల తంటాలు పడినవారే. బ్యాంక్ రాబరీలు, దారి దోపిడీలు, లాటరీలు.. ఇలా రకరకాల కాన్సెప్టులు. ప్రతి కథలోనూ బోలెడంతమంది దొంగలు. వారికి ప్రాణంతో చెలగాటం. చూసే ప్రేక్షకుడికి చెప్పలేనంత వినోదం.