విశ్వాసం..సమాజ హితం కోరేదే కావ్యం

విశ్వాసం..సమాజ హితం కోరేదే కావ్యం

పారాశర్యుని కృతియయి భారతమను పేరబరగు పంచమవేదం
బారాధ్యము జనులకు దద్గౌరవమూహించి నీవఖండిత భక్తిన్‌ 

తిక్కన విరచిత విరాటపర్వంలోని అవతారికలో తిక్కన తండ్రి పలికిన మాటలు ఇవి.మహాభారతాన్ని తిక్కన సోమయాజి  పూర్తిచేయాలని సంకల్పించిన సమయంలో, తిక్కన తండ్రి కలలోకి వచ్చి, ‘‘నాయనా! వ్యాసుడు సంస్కృతంలో రచించిన ఈ మహాభారతం ఇప్పటికే బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన ఇతిహాసం. ఈ భారతాన్ని ఇప్పటికే పంచమవేదంగా భావిస్తున్నారు. ప్రజలంతా ఆరాధిస్తున్నారు. ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. అంతటి మహత్కావ్యానికి గౌరవం తగ్గకుండా, అత్యంత భక్తిశ్రద్ధలతో అనువదించు’’ అని తిక్కనను ఆదేశిస్తూ, నీతిబోధ చేశాడు. 

భారత రచన అత్యంత భక్తిశ్రద్ధలతో రాయమని సూచించడమంటే, ‘సహితస్య హితం సాహిత్యం’ అనే మాటలను అతిక్రమించకుండా రచించమని అర్థం. ఒక రచన వల్ల సమాజం బాగుపడాలే కాని, పాడవ్వకూడదనేది సాహిత్య మూలసూత్రం. అందుకే తిక్కన సోమయాజి తన తండ్రి మాటలను అనుసరించి ఎంతో హృద్యంగా భారతాన్ని తెనిగించాడు. అందరికీ ఆరాధ్యుడయ్యాడు. పెద్దల మాట విని నాలుగు గండాలను తప్పించుకున్న యువరాజు కథ ఒకటి ప్రచారంలో ఉంది. 
అవంతీ నగరాన్ని పరిపాలించే మహారాజు దగ్గరకు ఒకరోజు ఒక పండితుడు వచ్చి, ఒక పద్యం రాసి రాజుగారికి ఇచ్చి, ‘‘ఈ పద్యం అక్షరలక్షల విలువ చేస్తుంది. ఇందులో పెద్దల మాటలు ఉన్నాయి. నా అక్షరాలకు తగ్గట్టుగా లక్షలు ఇప్పిస్తే సంతోషిస్తాను’’ అన్నాడు.

ఆ మాటలు మహారాజుకి రుచించలేదు. ‘‘పెద్దల మాటకు అంత విలువ ఇవ్వాలా’’ అన్నాడు. ఆ పక్కనే ఉన్న యువరాజు మారుమాట్లాడకుండా ఆ పద్యాన్ని స్వీకరించి, ఆయనకు అక్షర లక్షలు బహూకరించి గౌరవంగా సాగనంపాడు.ఆ పండితుడు ఇచ్చిన దానిలో మొదటి మాట – ‘కొత్త చోటుకి వెళ్లినప్పుడు పరిసరాలు పరిశీలించి, పక్కను శుభ్రంగా దులుపుకుని పడుకోవాలి’ అని ఉంది. ఇక రెండోది – ‘కొత్త ప్రదేశంలో ఆహారాన్ని బాగా పరిశీలించాకనే తినాలి’ అని ఉంది.

మూడో వాక్యం ‘మనకు ఎక్కడైనా అనుమానం ఉన్నప్పుడు రాత్రివేళ జాగరణ చేయాలి’ అని ఉంది. చివరగా నాలుగో మాట – ‘ప్రథమ కోపాన్ని నివారించుకోవాలి’ అని ఉంది. యువరాజు దేశాటనకు బయలుదేరిన సందర్భంలో ఆ పద్యాన్ని తన చెంతే ఉంచుకున్నాడు. మార్గమధ్యంలో రాత్రి.. ఊరి చివరన ఉన్న ఇంట్లో బస చేయవలసి వచ్చింది. బాగా అలసిపోవటంతో ఆ రాత్రి అక్కడే నిద్రించాలనుకున్నాడు. పడుకోబోతూ పండితుడు చెప్పిన మొదటి మాట గుర్తు తెచ్చుకున్నాడు. పక్క దులిపాడు. అందమైన పరుపు కింద పెద్ద బావి ఉంది. తన ధనం కోసమే అలా చేశారని అర్థం చేసుకుని, అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇలా మొదటి మాటతో తన ప్రాణం నిలబడిందనుకున్నాడు.

ఆ రాత్రి ఓ చెట్టు కింద నిద్రించి, మరుసటి రోజు ఉదయమే ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో ఒక ఇంటి దగ్గర భోజనం కోసం ఆగాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి తనకు ఆహారం ఇచ్చింది. తినటానికి ముందు యువరాజుకు రెండో మాట గుర్తుకు వచ్చి, పక్కనే ఉన్న కుక్కకు ఒక ముద్ద పెట్టాడు. అది వెంటనే మరణించింది. ఇలా రెండో మాట తన ప్రాణాలు కాపాడిందని తెలుసుకున్నాడు. అలా ప్రయాణిస్తుండగా, ఆ దేశపు రాకుమార్తెకు ఏదో అంతుపట్టని జబ్బు చేసిందని, ఒక రాత్రి ఆమె గదిలో ఉండి, ఆ జబ్బు తగ్గించినవారికి రాకుమార్తెనిచ్చి వివాహం చేసి, అర్ధరాజ్యం ఇస్తానని రాజు ప్రకటించాడు. యువరాజు తాను తగ్గిస్తానని పలికి, ఆ రాత్రి రాకుమార్తె గదిలోకి వెళ్లాడు.

ఆ సమయంలో మూడో మాట గుర్తుకు వచ్చి, ఆ రాత్రంతా జాగరణ చేశాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో రాకుమార్తె గదిలో మూల నుంచి రెండు పాములు వచ్చి, అక్కడే ఉన్న రాకుమారుడిని చంపబోయాయి. మెలకువగా ఉన్న రాకుమారుడు అంతా గమనించి, ఆ రెండు పాములను తన కరవాలానికి బలి చేశాడు. రాకుమార్తెను వివాహమాడాడు. అర్ధరాజ్యం పొందాడు. అలా మూడో మాటతో ప్రాణాలు కాపాడుకున్నాడు. రాకుమార్తెతో కలిసి, స్వగృహానికి చేరేసరికి, భార్య నిద్రిస్తూ ఉంది. పక్కనే ఒక యువకుడు కూడా నిద్రిస్తున్నాడు. ఆగ్రహంతో కత్తిదూయబోతాడు.

ఇంతలో నాలుగో మాట గుర్తుకు వచ్చి, కోపాన్ని అదుపు చేసుకొని భార్యను నిద్ర లేపి, ‘ఇతడు ఎవరు?’ అని ప్రశ్నించాడు. వాడు తమ కుమారుడేనని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆ పద్యం తన ప్రాణాలను, తన కొడుకు ప్రాణాలను కాపాడటమే కాకుండా, రాజ్యాన్ని కూడా పొందేలా చేసింది. పెద్దల మాట వినడం వల్ల మేలు చేకూరుతుందని ఈ కథ మనకు చెప్తుంది.
 
వైజయంతి పురాణపండ
ఫోన్ : 80085 51232