మట్టి వాసన కథ : దొండపాటి కృష్ణ

మట్టి వాసన కథ : దొండపాటి కృష్ణ

‘సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే,
శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే’ 

గంటను మోగిస్తూ హారతి ఇచ్చింది వసుధ. భర్త యోగేష్ నుదిటిన బొట్టు పెట్టింది. సొంత ఫ్లాట్ కొనుక్కోవాలన్నది వాళ్ళ కల. అది నెరవేరాలని కోరుకుంది.
లోన్ తీసుకుని ఫ్లాట్ కొంటే దాదాపు పది శాతం వడ్డీని ఓ ఇరవై ఏళ్లపాటు కట్టాలి. పిల్లల ఆలనాపాలనా సరేసరి... అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కొంతైనా కూడబెడితే గట్టెక్కవచ్చు. అందుకే గోల్డ్, స్టాక్స్ , చిట్టీల రూపంలో గత పదేళ్ళ నుంచీ డబ్బులు కూడబెడుతున్నారు.
‘ఎనిమిది వందల అరవై అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఇప్పుడు ముప్పై లక్షలకే...’ అన్న బోర్డు చూసి ఆకర్షితుడయ్యాడు యోగేష్. మల్లంపేట ఏరియా కావడం, తనకు అందుబాటు ధరలో ఉండటంతో బిల్డర్ తో మాట్లాడాడు. అడ్వాన్స్ కింద సగం డబ్బులు ఇప్పుడు కడితేనే ఆ రేటుకి ఇస్తానని, రెండేళ్ళల్లో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాడు. వాళ్ళ దగ్గర ఇరవై లక్షలే ఉన్నాయి. రెండేళ్ళల్లో పది లక్షలు సమకూర్చుకోవడం ఎలా? అని ఆలోచిస్తున్నాడు యోగేష్..
అతని ఆలోచనల్ని భగ్నం చేస్తూ ఫోన్ మోగింది. డిస్ప్లే మీద ‘#నాన్న’ అని కనిపించడంతో సంతోషంగా ఫోన్​ ఎత్తాడు. ఫ్లాట్ గురించి చెప్దామనుకున్నాడు.
‘‘హలో... యోగేసా..’’ అవతలి నుంచి మరొకరి గొంతు వినిపించింది.
‘‘ఎవరూ? ఇది నాన్న ఫోన్ కదా..’’ అతనిలో ఆందోళన మొదలైంది.
‘‘నేనురా... బుచ్చిమయ్య మామను... మీ నాన్నను ఆసుపత్రికి తీసుకొచ్చాం...’’ కంగారుగా చెప్పాడతను.
‘‘నాన్నకేమైంది మామా? ఏ హాస్పిటల్...’’ యోగేష్ ఆందోళన నిజమైంది.
‘‘పాము కరిచిందిరా... ఇషం కక్కించారు. పెమాదం తప్పిందిలే.. రెండు రోజులు ఉండాలట... మన జంక్షన్ ఆసుపత్రే.. నువ్వోపాలి రా...” ఆ మాటలు వినగానే యోగేష్ ఒళ్ళు జలదరించింది.
ఒక్కోసారి పాము, ఒక్కోసారి అడవి పంది, అమావాస్యకో పౌర్ణమికో చిరుతపులి, అప్పుడప్పుడు అడవి పిల్లులు పొలాల్లో విహారయాత్ర చేస్తూనే ఉంటాయ్. వాటి బారి నుంచి తప్పించుకునే అక్కడి రైతులకు ప్రతిసారీ పునర్జన్మే.

*   *   *

యాంటీ స్నేక్ ఇంజక్షన్ సెలైన్ ద్వారా గోవర్ధనరావు శరీరంలోకి ఎక్కుతోంది. బెడ్ మీద పడుకున్న తండ్రిని తడిమి చూశాడు యోగేష్. ఆ దృశ్యాన్ని చూసి రంగమ్మ మరింతగా బాధ పడింది.
‘‘ఇప్పటికైనా నా మాటింటావా?’’ పక్కనే కూర్చున్నాడు యోగేష్.
‘‘దేని గురించి?’’ ఓపికలేని మాట, తండ్రి నోటివెంట సన్నని శబ్దంగా వెలువడింది.
‘‘హైదరాబాదుకి వచ్చెయ్యండి..’’ తల్లివంక చూశాడు యోగేష్. భర్తవంక చూసిందామె. తిరస్కారాన్ని సూచించే నవ్వొకటి నవ్వాడు గోవర్థన్.
‘‘ఏంటా నవ్వుకు అర్థం?’’ నిండా కోపాన్ని నింపుకున్న మాట, యోగేష్ గొంతు నుంచి ఉబికొచ్చింది. 
‘‘నువ్వెన్నిసార్లడిగినా అదే నా సమాధానం!” పౌరుషాన్ని తొడుక్కున్న మాట, తండ్రి సమాధానంగా బయటకొచ్చింది.
ప్రేమ ఉన్న చోట బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది. అది ఒక్కోసారి ప్రేమను కూడా జయిస్తూ ఉంటుంది. భావావేశాన్ని రగులుస్తుంది. అహాన్ని ఆశ్రయించిన యోగేష్ ప్రేమ, కోపంగా మారింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ‘‘నువ్వింత మూర్ఖుడివనుకోలేదు’’ ఎన్నో భావోద్వేగాల సమ్మిళితంలా మారింది యోగేష్ మాట.
‘‘యోగీ, ఏంటా మాటలు? ఆ...’’ రంగమ్మ కసురుకుంది.
తల్లి ప్రేమ అతనిలోని అహాన్ని అణచివేసింది. కోపాన్ని పారదోలింది. ఎర్రబడిన యోగేష్ కళ్ళు, శాంతించడానికి కన్నీటితో స్నానం చేశాయి.
సమయం సాయంత్రం ఏడు గంటలవుతోంది. డ్యూటీ డాక్టర్ వచ్చాడు. పేషెంట్ రిపోర్ట్స్ చూశాడు.
‘‘ఇప్పుడెలా ఉంది?’’ నాడి పట్టుకున్నాడు. నోరు తెరవమని లైట్ వేశాడు. పాము కరిచిన చోట నొక్కాడు. ఇంకో సెలైన్ బాటిల్ పెట్టమని నర్సుకు చెప్పాడు.
అతన్ని చూస్తుంటే పంట ఎదుగుదలను చూసే రైతులా కనిపించాడు గోవర్ధనరావుకు పదాలు మారుతున్నాయ్, చికిత్స మారుతోంది, చేసే పని ఒకటే అనిపించింది.
‘‘డాక్టర్ గారూ, ఇప్పుడెలా ఉందండీ?’’ ఆందోళనగా అడిగింది రంగమ్మ.
“పర్వాలేదమ్మా... పూర్తిగా కోలుకోవడానికి రెండు రోజులు పడుతుంది” ధైర్య వచనం చెవిన పడగానే సాధారణంగా కొట్టుకోవడానికి సిద్ధమైంది ఆమె గుండె. డ్యూటీ డాక్టర్ వెళ్ళాడు.
‘‘నాకేం గాలేదుగానీ... ఆ వాసుకి ఫోన్ చేసి కట్టుడు కూలీలు వత్తానన్నారో! లేదో! కనుక్కో...’’ అన్నాడు గోవర్ధనరావు.
‘‘దానికేం తొందర లేదులే... ఇదవ్వకు..’’ కోపంగా అంది రంగమ్మ.
‘‘చెప్పగానే ఏనాడు చేశావ్? ముందు ఆడికి ఫోన్ చెయ్...” అరిచాడు గోవర్ధనరావు. ఆయాసంతో దగ్గు వచ్చింది. మంచినీళ్ళు తాగించి నెత్తిమీద తట్టింది.
‘‘చెప్తే ఇనడు. మొండిగా చేత్తాడు. చేను, చేను అంటూ ఆరాటపడి ఇంతదాకా తెచ్చుకున్నాడు’’ ఇంకా ఏవో గొణుగుతూ కన్నీళ్లను పైటకొంగుతో తుడుచుకుంది. ఫోన్ పట్టుకుని బయటకు నడిచింది.
గోవర్ధనరావు ఆలోచనలు రెండో కట్టుడుకు వచ్చిన చెరకు పొలంవైపే తిరుగుతున్నాయి. సరైన టైంకి నీరు అందకపోతే చెరకు కణుపులు మందంగా రావు. బరువు తగ్గిపోతుంది. తియ్యగా ఉన్నా సరే బరువు లేనిదే గిట్టుబాటు ధర రాదు. అక్కడే కూర్చుని, అదంతా గమనిస్తున్నాడు యోగేష్.
‘‘నాన్నకు పొలమంటే ఎందుకంత పిచ్చి? దాన్ని వదిలేసి సిటీకి రాడు ఎందుకు? అందరమూ ఓ దారి అయ్యాక్కూడా ఎందుకంతగా ఆరాటపడుతున్నాడు? పొలం కొనాలనే ఆశ ఆవిరవ్వదెందుకు?” దారీతెన్నూ లేని ఆలోచనలు అతన్ని స్థిరంగా ఉండనివ్వటంలేదు.
“నాన్నా...” ప్రేమగా పిలిచాడు యోగేష్. ఏమిటన్నట్లు చూశాడు గోవర్ధనరావు.
‘‘పొలమంటే నీకెందుకంత ప్రేమ?” కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
పుట్టి పెరిగాక ఏనాడు ఈ ప్రశ్న అడగలేదు. పొలం పిచ్చోడనుకున్నాడు, ఆ పిచ్చితనాన్ని తిట్టుకున్నాడు. కానీ ఆ పిచ్చితనం ఎలా వచ్చిందో మాత్రం అడగాలనిపించలేదు. ఇప్పుడు అడిగేసరికి ఆశ్చర్యపోయాడు గోవర్ధనరావు. వాడిపోతున్న మొక్కకు నీరు అందినట్లుగా అనిపించింది. దుమ్ము పడిన ఆకులపై వర్షపు చినుకులు వసంతగానాన్ని పలికించినట్లుగా ఉప్పొంగిపోయాడు.
‘‘అది చాలా పెద్ద కతరా...’’ అని శ్వాసిస్తూ గుండెపై ఎడమ చేతిని వేసుకున్నాడు. అతని ఆలోచనలు గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లాయి.

*   *   *

స్వాతంత్ర్యానంతరం స్వేచ్చగా తిరుగుతున్న రోజులు... ఉపాధి ఉన్నచోటుకు వలసలు పోతున్న కాలం.  కొత్త రేమల్లెలోని పొలాలన్నీ బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవి. కొన్ని దేవుడి మాన్యాలు. కాలం గడుస్తున్న కొద్దీ బ్రాహ్మణ కుటుంబీకులు చదువు పేరుతో పట్నం పోసాగారు. వాళ్ళ దగ్గరున్న పశువుల్ని, పొలాల్ని అమ్మకానికి పెట్టారు.

ఆ మారుమూల గ్రామానికి బడి వచ్చింది. అందులో కమ్మ, బ్రాహ్మణుల పిల్లలే ఉండేవారు. ఊరి చివరనున్న ఆ బడి పక్క పొలాల్లో గేదెల్ని మేపుతుండేవాడు మత్తేసు. అక్కడా పిల్లల్ని చూసేసరికి తాను కూడా చదువుకోవాలని ఉబలాటపడేవాడు. ఇంట్లో జరుగుబాటు లేక కమతం చేయాల్సి వచ్చేది. పిల్లల ఆటలు, పాటలు దూరంగా గమనించేవాడు. వాళ్ళ ప్రవర్తనను అనుకరించేవాడు. పెద్దల పట్ల గౌరవంగా మెలగడం నేర్చుకున్నాడు. అది గమనించిన అగ్ర కులస్తులు మత్తేసు ఒక్కడినే వాళ్ళ ఇళ్ళల్లోకి రానిచ్చేవారు.
ఒకనాడు ‘‘ఒరేయ్, ఇద్దిగా... ఆ బ్రామ్మలు పొలం అమ్మకానికి పెట్టారు. ఎకరం రెండొందలు. ఈ యేడు మత్తేసు కమతం డబ్బులు పెడితే ఐదెకరాలొత్తాయ్. ఇంకో వెయ్యి రూపాయలు తెచ్చావంటే పది ఎకరాల్ని తీసేసుకోవచ్చు. ఏమంటావ్?” అడిగాడు నాయుడు.
‘‘అదేదో మీరే తీసుకోండి బాబు. వచ్చే కమతం డబ్బుల్తో ఇట్టా పొలాలు కొంటే మేమెట్టా బతకాలండీ... పిల్లోడికి లేనిపోని ఆశలు రేపొద్దు” అని తిరస్కరించాడు మత్తేసు తండ్రి ఇద్దయ్య.
‘‘నాకు వందెకరాలున్నాయ్. చాలదూ... మీరూ ఓ దారి అవుతారని చెప్తున్నా! తలో రెండెకరాలు ఎవసాయం చేసుకున్నా నీ ఐదుగురు కొడుకులకు రోజెళ్ళిపోతుందిరా..’’ అంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఇద్దయ్య.
పొలాన్ని వదులుకోవడం ఇష్టంలేక ఆఖరి ప్రయత్నంగా మత్తేసును కదిలించాడు నాయుడు.
‘‘ఒరేయ్, మత్తేసూ! మీ నాయన్ని ఒప్పించి వెయ్యి రూపాయలు తెచ్చుకో... ఏనాటికైనా భూదేవేరా కూడు ఎట్టేది’’ అంటూ పొలం వలన ఉపయోగాలను అర్థమయ్యే రీతిలో చెప్పాడు.
‘‘చంపెత్తాడండీ. ఆయన చండశాసనుడని మీకు తెలుసుగా’’ నిట్టూర్చాడు మత్తేసు.
“సరే, ఐదెకరాలు నీ పేర కొనేస్తానురా’’ అన్నాడు.
‘‘వద్దండి బాబూ. తర్వాతైనా మా నాయనికి తెలుస్తుంది. ఒళ్ళు చీరేత్తాడు” భయపడ్డాడు మత్తేసు.
‘‘అట్టా అంటే ఎట్టారా? అంత తక్కువ ధరకి మళ్ళీ దొరకదు. చక్కగా పొలం పండుతుంది. నీకు నాగలి పట్టడం, సాళ్ళు వేయడం, విత్తనాలు జల్లడం వచ్చు. నీలా శ్రద్ధగా పొలం పని చేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల చూపించు! నీ బలమేంటో నీకు తెల్వట్లా. ఎన్నాళ్ళని ఇలా ఆడి దగ్గర, ఈడి దగ్గర పనిచేస్తూ బతుకుతారు. మీ పిల్లలు చేతికొస్తున్నారు. ఆళ్ళను చదివించవా? నీలాగే కమతం చేపిత్తావా? ఇప్పుడు కాకపోతే జీవితంలో పొలం కొనగలవా?’’ ఆశాజ్యోతిని వెలిగించాడు నాయుడు.
సముద్రాన్ని దాటి సీతాదేవి జాడ కనుక్కోవడానికి వెళ్లేముందు హనుమంతుడు తన శక్తిని గుర్తెరిగినట్లు, మత్తేసు కూడా పంట పండించడంలో తనకున్న నైపుణ్యాన్ని గుర్తెరిగాడు. దాంతో పొలం కొని సాగుబడి చేయాలనే కోరిక కలిగి, బలపడింది. పిల్లల్ని బడులకు పంపించాలని, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే చూసి తరించాలని కలలు కన్నాడు. అతని కలలు కల్లలే అయ్యాయి. పెళ్ళయ్యాక కుటుంబ నియంత్రణ పాటించలేకపోయాడు. నలుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్ళకు జన్మనిచ్చి, పురిటినొప్పులు పడుతున్నట్లు వాళ్ళను పోషించాల్సి వచ్చింది. కొడుకులు తలో దారి అయ్యాక వాళ్ళ కాయకష్టంతో ఒక ఎకరం కొనగలిగాడు. కొద్దిరోజుల్లోనే ఆ ఎకరం పొలం పక్కనే తారు రోడ్డు పడింది. ఇళ్ళ స్థలాలకు గిరాకీ పెరిగింది. చేసేదిలేక నలుగురికీ పాతిక సెంట్ల చొప్పున పంచేశాడు.
వాస్తు ప్రకారం చివరి పాతిక సెంట్ల స్థలాన్ని నాలుగోవాడైన రామయ్యకిచ్చాడు మత్తేసు. అది రోడ్డుకు దూరంగా ఉండడంతో ఆకుకూరలు పెట్టేవాడు రామయ్య. వాటిని ఊళ్లోనే అమ్మేవాడు. ఆసామిగా ఎదగాలని తాత మత్తేసు ఎంతలా తహతహలాడేవాడో మనవడు గోవర్థనరావుకు చెప్పేవాడు రామయ్య. అవి వింటూ పెరగడం వలన గోవర్ధనరావుకూ వ్యవసాయంమీద మక్కువ ఏర్పడింది. దాంతో ఒక ఎకరం కౌలుకి తీసుకుని టొమాటో పంట వేశాడు. నష్టమొచ్చింది. బీరకాయలు, దోసకాయలు, బెండకాయలూ వెక్కిరించాయి. అయినా వదల్లేదు. అతని కష్టాన్ని చూసిన దురదృష్ట దేవత పక్కకు జరిగి అదృష్ట దేవతకు చోటిచ్చింది.
ఆ సంవత్సరం నీళ్ళతో చెరువు నిండిపోయింది. వరి వేశాడు. పంట పర్వాలేదనిపించింది. వ్యవసాయంపట్ల గోవర్ధనరావుకున్న శ్రద్ధను గుర్తించాడు శేషగిరి. అతనికున్న ఐదు ఎకరాల్లో బోరు వేయించి, చెరకు వేసి, గోవర్ధనరావుకు బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత మరో ఇరవై ఎకరాలు కొని భూస్వామిగా ఎదిగాడు శేషగిరి.
అదృష్ట దేవత గోవర్ధనరావు వెంట ఉండటంతో ఆ ఐదు ఎకరాల్ని కొన్నాడు. పొలం హక్కుదారుడిని అనుకునేలో పే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కో ఎకరం చొప్పున అమ్మేశాడు. యోగేష్ ఉన్నత చదువుల నిమిత్తం మిగిలిన మూడు ఎకరాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. చీకటిని చీల్చే వెలుగై... దీపంలాగ మిగిలిపోయాడు గోవర్ధనరావు.

*   *   *

కట్టె, కొట్టే, తెచ్చేలాగా గతాన్నంతా నెమరేసుకున్న గోవర్ధనరావు, కొడుక్కి చెప్పాడు.
‘‘పొలమే నా శ్వాస. అదే నా ఆయువు. ఆ మట్టి వాసన పీల్చకపోతే ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే దాన్ని వదిలి మీతో రాలేకపోతున్నా. సాగు చేయకుండా ఉండలేకపోతున్నా. నీకో సంగతి తెలుసా యోగి! నాకు ప్రాణం బాగోకపోయినా నేను డాక్టర్ దగ్గరికి పరిగెత్తను. మట్టి వాసన పీల్చుతూ, ప్రకృతి ఒడిలో సేద తీరుతాను. అదే నయమైపోతుంది. అదే మట్టితో నాకున్న అనుబంధం. దాన్ని వదులుకుని ఎలా రమ్మంటావ్? నా చుట్టూ ఉన్న రైతుల కష్టాలు చూస్తూ ఎలా ఏసీ గదుల్లో కూర్చోమంటావ్? బతుకు తెరువు చూపించలేకపోయినా వాళ్లకి బతుకుమీద ఆశ కలిగించలేనా?” గోవర్ధన్ కళ్ళు మసగ్గా మారాయి.
మట్టితో రైతుకి ఎందుకంత అవినాభావ సంబంధముంటుందో, మట్టిలోనే రైతు జీవితాన్ని ఎలా వెతుక్కుంటాడో యోగేష్ తెలుసుకున్న క్షణమది. ఎన్నిసార్లు నట్టేట ముంచినా ఆవిరవ్వని ఆశతో మరో సంవత్సరం సాగు చేసే రైతుల మొహాలు జ్ఞప్తికొచ్చాయి. నిండా మునిగినప్పుడు పైకి లేచే మార్గంలేక, వ్యవసాయాన్ని వదులుకోలేక, వేరేది చేతకాక ఆత్మహత్యలు చేసుకున్న, చేసుకుంటున్న రైతులు కళ్ళముందు మెదిలారు.

*   *   *

పది రోజులు గడిచాయి. రెండో కట్టు కట్టిన చెరకు పొలాన్ని తనివితీరా స్పృశించాడు గోవర్ధనరావు. గట్టు మీద కూర్చున్నాడు. చేతిలోకి మట్టి తీసుకుని వాసన పీల్చాడు. అతని అణువణువూ పులకించింది.
‘‘ఏం గోవర్ధన్, ఎలా ఉందిప్పుడు?’’ అక్కడకొచ్చిన శేషగిరి యోగ క్షేమాలు విచారించాడు.
‘‘బావుందండి. మీరేంటిలా?’’ లేచి నిలబడ్డాడు గోవర్ధనరావు.
‘‘ఈ పత్రాలు ఇచ్చి పోదామని’’ అంటూ సంచిలోంచి పేపర్లు తీసిచ్చాడు శేషగిరి.
‘‘నీ ఐదు ఎకరాలు మరలా నీ దగ్గరికే వచ్చాయోయ్...” నవ్వుతూ అందించాడు. వాటివంక అయోమయంగా చూశాడు గోవర్ధనరావు.
‘‘ఏంటలా చూస్తున్నావ్. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక మీ అబ్బాయి వచ్చి నన్ను కలిశాడు. విషయమంతా చెప్పాడు. ఈ పొలాన్ని తిరిగి కొన్నాడు. ఈ పత్రాల్ని నన్నే స్వయంగా ఇవ్వమని కోరాడు”అంటూ రిజిస్ట్రేషన్ పేపర్స్ గోవర్ధనరావు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు శేషగిరి.
డిశ్చార్జ్ అయ్యే రోజున యోగేష్, కొన్ని పేపర్లలో తన వేలి ముద్రలు తీసుకున్న సంగతి జ్ఞప్తికొచ్చింది. హాస్పిటల్ కాగితాలతో పాటుగా రిజిస్ట్రేషన్ పేపర్లలోనూ వేలి ముద్రలు వేయించుకున్నట్లు గ్రహించాడు. 
కొడుక్కి ఫోన్ చేశాడు. ‘‘యోగీ, ఎందుకిలా చేశావ్?” గద్గదమైన గొంతుతో అడిగాడు.
‘‘మత్తేసు తాతలా నువ్వూ కాకూడదని... స్థిరంగా చెప్పాడు యోగేష్. 
‘‘ఫ్లాట్ కొనాలని ఎంతగానో కోరుకున్నావు కదరా? అందుకే ఈ పొలం డబ్బులు నీకు ఇద్దామనే పారుకులాడుతున్నా” అన్నాడు. తండ్రి తనకోసం ఎంతదూరం ఆలోచించాడో తెలిశాక మనసు ద్రవించింది.
‘‘నాన్నా... అంతకుముందు మీరెన్నిసార్లు పొలం కొందామని అడిగినా నేను పట్టించుకోలేదు. నువ్వు చెప్పింది విన్నాక మాత్రం...’’ ఏదో చెప్పబోయాడు యోగేష్.
‘‘వద్దు యోగి. వెంటనే దీన్ని అమ్మేసి ఫ్లాట్​కి డబ్బులు కట్టెయ్. ముందుముందు ఫ్లాట్ రేట్లు ఆకాశాన్నంటుతాయి. ఇప్పుడు నాకు పొలం ఎందుకు? ఎన్నాళ్ళు బతికుంటానని!’’ తిరస్కరించాడు గోవర్ధన్. 
‘‘నాన్నా.. మీకో లెక్క చెప్తా. ఇప్పుడు నేనుంటున్న ఇంటి అద్దె పది వేల రూపాయలు. సంవత్సరానికి లక్షా ఇరవై వేలు. అంటే దాదాపు పాతికేళ్ళ అద్దెను ఇప్పుడే ఫ్లాట్ రూపంలో కట్టేస్తున్నా. దానికి బదులుగా పొలం కొంటే అది ఇంకెంతో పెరుగుతుంది. అదీగాక నీ కల నెరవేరుతుంది. నా మనసు తృప్తి పడుతుంది. ఇప్పుడు నువ్వు వద్దంటే నీ ఇద్దరు మనవళ్ళు మీద ఒట్టే...’’ సున్నితంగా హెచ్చరిస్తూ ఒప్పుకోమన్నాడు యోగేష్. ఓ క్షణం ఆలోచించాడు గోవర్ధనరావు.
‘‘నువ్వు నాకు ఇచ్చింది నేను నా మనవళ్ళకు ఇచ్చేస్తా. చెరో రెండున్నర ఎకరాలు గిఫ్ట్ డీడ్ రాసేస్తా. నా పేరుమీదే ఉండాలనేం లేదుగా. ఇప్పుడు నువ్వు కాదంటే వాళ్ళ మీద ఒట్టే’’ అంటూ నవ్వాడు గోవర్ధనరావు.

- దొండపాటి కృష్ణ 
ఫోన్​: 90523 26864