శాంతి అనేది పదునైన ఆయుధం

శాంతి అనేది పదునైన ఆయుధం

శాంతి అనే ఖడ్గం ధరించినవానిని ఏ దుష్టుడూ ఏమీ చేయలేడని పెద్దలు చెబుతారు. ఇందులో ‘శాంతి’ అని చెప్తూ ‘ఖడ్గం’ అనే పదాన్ని ఉపయోగించడంలో పరమార్థం ఉంది. శాంతి అనేది పదునైన ఆయుధం అని అర్థం. ఈ ఆయుధాన్ని వాడుకలో ‘అస్త్రం’ అని కూడా అంటాం. అందుకే ‘శాంతి అనే ఆయుధం’ అనే పదానికి బదులుగా ‘శాంతి అనే ఖడ్గం’ అని ఉపయోగించారు. ప్రపంచశాంతి కోసం మునులు, రుషులు యజ్ఞయాగాదులు చేశారు. 

రామాయణంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యవాసానికి వెళ్లినప్పుడు ఒకనాడు భరతుడు అన్నగారిని చూడటం కోసం సైన్యాన్ని వెంటపెట్టుకుని బయల్దేరాడు. దూరాన్నించే వారిని చూసిన లక్ష్మణుడు ఆగ్రహావేశంతో బాణం ఎక్కుపెట్టబోతుండగా, ‘లక్ష్మణా! శాంతి!శాంతి!’ అని శాంతి వాక్యాలు పలికాడు. భరతుడు వచ్చిన తరువాత విషయం తెలుసుకున్న లక్ష్మణుడు సిగ్గుతో ముడుచుకుపోయాడు. అందుకే ఏ విషయాన్నైనా శాంతంగా ఆలోచించమంటారు పెద్దలు. పన్నెండేండ్లు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేసిన తరువాత కూడా కౌరవులు తమ రాజ్యాన్ని ‘తిరిగి ఇవ్వం’ అన్న సందర్భంలో కూడా ధర్మరాజు శాంతి మంత్రాన్నే వల్లించాడు. ‘యుద్ధం చేయటం వల్ల రక్తపాతం జరుగుతుంది. శాంతితో సాధించుకుందామ’ని చెప్పాడు. భీముడు, అర్జునుడు, నకులుడు కూడా శాంతి మంత్రమే పలికారు. శాంతియుతంగా సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపారు. తప్పనిసరి పరిస్థితిలో కురుక్షేత్ర యుద్ధం చేశారు పాండవులు. ఆవేశంతో అశ్వత్థామ సౌప్తిక ప్రళయాన్ని సృష్టించాడు. నిద్రిస్తున్న ఉపపాండవులను హతమార్చాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత వ్యాసుడు  శాంతంగా ఉండటం వల్ల కలిగే లాభాల గురించి శాంతి పర్వంలో వివరించాడు. 

‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అన్నాడు త్యాగరాజు తన కీర్తనలో. శాంతి మార్గంలోనే గాంధీజీ స్వాతంత్య్రం సాధించాడు. హింసకు ప్రతిహింస చేసుకుంటూ పోతే చివరకు హింసే మిగులుతుంది. మహాత్మా గాంధీ 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ‘అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి’ని ప్రవేశపెట్టింది. శాంతియుతంగా పోరాటం చేయాలనే తన ఆశయాన్ని పావురం చిహ్నంగా చూపాడు నెహ్రూ. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించటానికి ప్రయత్నిస్తోంది. ప్రపంచశాంతిని కాంక్షించే వ్యక్తులు లేదా సంస్థలకు నోబెల్​ శాంతి పురస్కారం అందచేస్తారు. ఇది అత్యున్నత బహుమతి. విశ్వకవి రవీంద్రనాథ్​ స్వయంగా శాంతినికేతన్​ స్థాపించాడు. భారతీయ సనాతన ధర్మం శాంతినే ప్రభోదిస్తుంది. 

 ‘‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష...’’ అంటాడు సుమతీ శతకకారుడు. మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రశాంతమైన ఆలోచనలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. సత్కార్యాలు ఆచరించగలుగుతాం. శాంతం విడిచిపెట్టి, ఆవేశంతో ఆచరించే కార్యాల వల్ల నష్టాలు కలుగుతాయి. భారతీయ సంప్రదాయంలో ఏ పనిచేసినా చివరలో ‘‘ఓం శాంతిః శాంతిః శాంతిః’’ అని మూడుసార్లు  శాంతి మంత్రం చదవటం ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో గురుకుల విద్యాభ్యాసం ఉన్న రోజుల్లో ప్రతిరోజూ గురుశిష్యులు కలిసి ‘‘ఓం సహనావవతు, సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై. తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతిః’’ అంటూ శాంతి మంత్రం చదివేవారు. ఇది మన ఉపనిషత్తులలోనిది. వేదవిదులైన పండితులు ఈ మంత్రాలను పఠించేవారు. ఈ శాంతి మంత్రం ద్వారా దేశంలో శాంతికి సుస్థిర స్థానం కల్పించారు.
‘‘వ్యక్తిగత (ఆత్మ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలగాలి’’ అని ఆశీర్వదిస్తారు పండితులు. అందరికీ సుఖసంతోషాలు కలగాలి. అందరికీ శుభాలు కలగాలి. ‘‘లోకాస్సమస్తాః సుఖినో భవంతు’’ అని సమాజ శాంతిని కోరుకుంటారు పురోహితులు. కేవలం భూమ్మీద మాత్రమే కాదు, అన్ని ప్రదేశాలలోనూ శాంతి నెలకొనాలని కాంక్షించారు మన రుషులు. స్వర్గం, దేవలోకం, ఆకాశం, అంతరిక్షం, భూమి, నీరు, భూమి మీద ఉన్న ఓషధులు, వనమూలికలు... ఇవే కాకుండా అన్ని లోకాలలోని దేవతలు, బ్రహ్మ, సర్వజనులకు శాంతి నెలకొనాలని కాంక్షించారు మహర్షులు. పంచభూతాల వల్ల, బ్రహ్మ మొదలైన దేవతల వల్ల అపాయం కలుగకుండా శాంతియుత జీవితం గడపాలని మంత్రాలు ఉపదేశిస్తున్నాయి. ‘‘శాంతాకారం భుజగ శయనం... సర్వలోకైక నాథం’’ అని భగవంతుడి గురించి చెప్తూ... శాంతం ఒక ఆకారాన్ని దాలిస్తే అదే భగవంతుడు అని చెప్పారు మహర్షులు.మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలి. మన చుట్టూ ఉన్న మనుషులు ప్రశాంతంగా ఉండాలి. మన మనసు ప్రశాంతంగా ఉండాలి. అంటూ శాంతం గురించి వివరిస్తున్నారు.ప్రకృతి విలయాన్ని సృష్టిస్తే ప్రజలంతా అశాంతిపాలవుతారు. మన పరిసరాలలోని మనుషులు అలజడి సృష్టిస్తే ప్రజలంతా అశాంతితో అల్లకల్లోలమవుతారు. ప్రజలంతా మానవ కల్యాణం కోసం, మానవాళి శ్రేయస్సు కోసం నిత్యం శాంతిమంత్రాన్ని అవలంబించాలని పెద్దలు చెప్పిన మాటలను ఆచరించటానికి ప్రయత్నించాలి.
ఓం శాంతిః శాంతిః శాంతిః
-  డా. వైజయంతి పురాణపండ 
ఫోన్: 80085 51232