ప్రధానోపాధ్యాయుడు బదిలీపై వెళ్లొద్దంటూ విద్యార్థుల ధర్నా

ప్రధానోపాధ్యాయుడు బదిలీపై వెళ్లొద్దంటూ విద్యార్థుల ధర్నా

ఓ ప్రధానోపాధ్యాయుడు కోసం విద్యార్థులందరూ రోడ్డెక్కారు. మా సారు మాకే కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. స్కూలు పిల్లలకు మద్దతుగా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన నిర్వహించారు. అసలింతకు ఆ ప్రధానోపాధ్యాయుడు చేసిన మంచి పని ఏంటి..? విద్యార్థులు రోడ్డెక్కాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? 

అసలేం జరిగిందంటే..? 

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఖాజా మొయినుద్దీన్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. అయితే.. మరో స్కూలుకు ప్రధానోపాధ్యాయుడు మొయినుద్దీన్ బదిలీపై వెళ్లాల్సి ఉంది. అయితే.. ఇది ఇష్టం లేని మేడిపల్లి కలాన్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు.  ఖాజా మొయినుద్దీన్ సార్.. బదిలీపై మరోచోటకు వెళ్లొద్దంటూ స్కూలు ఎదుటే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. మా సార్ మా స్కూల్లోనే ఉండాలంటూ గ్రామంలో ర్యాలీ కూడా నిర్వహించారు. పిల్లలకు మద్దతుగా వారి తల్లిదండ్రులు కూడా జత కలిశారు. 

1వ తరగతి నుండి 7వ తరగతి వరకూ ఉన్న ఈ స్కూల్లో 129 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో ఖాజా మొయినుద్దీన్ గత12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మేడిపల్లి కలాన్ గ్రామం నుండి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా, డ్రాపౌట్స్ లేకుండా కృషి చేశారు. అంతేకాదు..స్కూలును ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. 8 ఏళ్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలనే నిబంధన ఉంది. దీంతో హెడ్ మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ మరో స్కూలుకు బదిలీ కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ‘హెడ్ మాస్టర్ బదిలీ కావొద్దు.. మా సార్ మాకే కావాలి’ అంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. 

హెడ్ మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ స్కూలును ఎంతో అభివృద్ధి చేశారని, తమకు చాలా చక్కగా విద్యాబుద్దులు నేర్పిస్తున్నారని స్టూడెంట్స్ చెబుతున్నారు.  ఖాజా మొయినుద్దీన్ సార్ మరో పాఠశాలకు బదిలీపై వెళ్లకుండా ఇదే స్కూల్లో విధులు నిర్వర్తించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను వేడుకుంటున్నారు.