రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండవేడిమి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.పెరుగుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. మే నెల మధ్యలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్ లోనే రికార్డు అవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్  భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి.

హైదరాబాద్ లోనూ రికార్డ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం మాదాపూర్ లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. బాలజీనగర్, మైత్రీవనం, తిరుమలగిరి, అడ్డగుట్టలో 41.3 డిగ్రీలు, మౌలాలిలో 41.1, ప్రశాంత్ నగర్, శ్రీనర్ కాలనీ, జుమ్మెరాత్ బజార్ లో 41, మచ్చ బొల్లారం, అల్కాపురి కామన్ హాల్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

మహారాష్ట్రలోని విదర్భ నుంచి వస్తున్న వేడి గాలులతో ఉత్తర తెలంగాణలో వడగాలులు వీస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఈ నెల 24 వరకు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమ నుంచి తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు దగ్గర ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు.