సెప్టెంబర్ 12కి వాయిదా పడ్డ ఓటుకు నోటు కేసు

సెప్టెంబర్ 12కి వాయిదా పడ్డ ఓటుకు నోటు కేసు

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు గురువారం విచార‌ణ‌ చేపట్టింది. విచారణను సెప్టెంబర్ 12కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని, ఈ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. 

ఇక.. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలంటూ నామినేటేడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ ఇంట్లో రేవంత్‌ రెడ్డి డబ్బు సంచులతో ఉన్న వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే  స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడినట్లు ఆడియో టేప్ రిలీజయ్యింది. దీంతో తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయగా... రేవంత్ రెడ్డి కొన్ని రోజలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని, ఆయనను కూడా కేసులో చేర్చాలని ఆళ్ల రామక్రిష్ణారెడ్డి తలపు తట్టారు.