భారత్ తో ఎగుమతులు, దిగుమతులను నిలిపేసిన తాలిబన్లు

భారత్ తో ఎగుమతులు, దిగుమతులను నిలిపేసిన తాలిబన్లు

కాబూల్: అఫ్గానిస్థాన్ ను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నారు. మాజీ ప్రభుత్వ అధికారులను వెతికి పట్టుకోవడానికి కాబూల్ వీధుల్లో తిరుగుతున్నారు. దేశం విడిచి పారిపోవాలని యత్నిస్తే  మహిళలు, పిల్లలని కూడా చూడకుండా వారిపై సాయుధ తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ఇతర దేశాలతో సంబంధాల విషయంలోనూ తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అఫ్గాన్ కు అండగా ఉంటూ వచ్చిన భారత్ తో సంబంధాలను తెంచుకునే విధంగా వారి తీరు కనిపిస్తోంది.

భారత్, అఫ్గాన్ మధ్య జరిగే ఎగుమతులు, దిగుమతులను తాలిబన్లు నిలిపివేశారు. అఫ్గాన్ నుంచి పాకిస్తాన్ మీదుగా భారత్ కు వచ్చే ఎగుమతులను తాలిబన్లు అడ్డుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. కాగా, అఫ్గాన్ తో భారత్ మంచి వ్యాపార సంబంధాలను కలిగి ఉంది. అదే సమయంలో అఫ్గాన్ లో భారత్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు భారత్ నుంచి అఫ్గాన్ కు జరిగిన ఎగుమతుల విలువ 835 మిలియన్లు. అలాగే అఫ్గాన్ లో ఇండియా 3 బిలియన్ల పెట్టుబడులు పెట్టడాన్ని బట్టి ఇరు దేశాల సంబంధాలను అర్థం చేసుకోవచ్చు.