లంకుకు సాయం చేసేందుకు కేంద్రం అనుమతి

లంకుకు సాయం చేసేందుకు కేంద్రం అనుమతి

రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులు సిద్ధం

చెన్నై : ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని అసెంబ్లీలో ఇటీవల చేసిన తీర్మానాన్ని అనుసరించి సీఎం స్టాలిన్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం వల్ల అత్యవసర, నిత్యావసర వస్తువులకు గిరాకీ ఏర్పడింది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. పెట్రోలు, డీజిల్, కిరోసిన్‌ కొనుగోలుకు గంటల తరబడి ప్రజలు క్యూలో ఉంటున్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ దొరకడం గగనమైంది. దేశమంతా విద్యుత్‌ కోతలతో అల్లాడుతోంది. విద్యుత్‌ లేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్‌ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తున్నాయి.

ఇందులో భాగంగా స్టాలిన్ ప్రభుత్వం కూడా శ్రీలంక దేశానికి అత్యవసర వస్తువులను, ఆహార పదార్థాలు, మందులను అందజేయాలని నిర్ణయించింది. అయితే నేరుగా శ్రీలంకకే పంపే అవకాశం లేనందున కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని గవర్నర్‌ ద్వారా కేంద్రానికి పంపింది. అలాగే సీఎం స్టాలిన్‌ గతనెల 29న ప్రధాని మోదీకి లేఖ రాయగా కేంద్రం నుంచి అనుమతి లభించింది. దీంతో విదేశాంగ మంత్రి జయశంకర్‌కు సీఎం పూర్తి వివరాలతో కూడిన లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లును ప్రారంభించింది.

40 టన్నుల బియ్యం, 50 టన్నుల  మిల్క్ పౌడర్, రూ.28 కోట్ల విలువైన 137 రకాల మందులను సిద్ధం చేసింది. సుమారు రూ.123 కోట్ల విలువైన ఈ సరుకులను ఢిల్లీకి చేరవేసి అక్కడి నుంచి శ్రీలంకకు పంపడమా లేక చెన్నై నుంచి శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయానికి చేర్చడమా అనే అంశంపై కేంద్రం నుంచి సమాచారం అందాల్సి ఉంది. 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ సర్కారుకు సమాధే

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు