గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
  •     68 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, ఇన్నోవా, యాక్టివా స్వాధీనం 

 మెహిదీపట్నం, వెలుగు :  గంజాయి అమ్ముతుండగా.. ఆదివారం టాస్క్ ఫోర్స్ టీమ్, టప్పాచబుత్రా పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద 68 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు, ఇన్నోవా, యాక్టివాని స్వాధీనం చేసుకున్నారు.  ఏసీబీ జావేద్ తెలిపిన ప్రకారం.. టప్పా చబుత్రాలో ఉండే పెయింటర్ మహమ్మద్ ఇసాక్ (33), ఫర్నిచర్ షాప్ లో పని చేసే ఇస్సాముద్దీన్(26) వరుసకు బావ బావమరిది.  ఏడు నెలల కిందట మహమ్మద్ ఇసాక్ ఒడిశాకు చెందిన రాజు అనే వ్యక్తిని ఆసిఫ్ నగర్  ఫర్నిచర్ షాప్‌‌‌‌లో కలిశాడు.  

రాజు ఇతర రాష్ట్రాల్లో పరిచయాలు ఉన్నాయని గంజాయి అమ్మితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని నమ్మించాడు. మొదట మహమ్మద్ ఇసాక్ గంజాయి తెచ్చి కేజీ రూ. 4 వేలకు అమ్మాడు. కొద్ది రోజుల తర్వాత అతడు ఇస్సాముద్దీన్‌‌‌‌ను గంజాయిని అమ్మి పెట్టాలని కోరారు. దీంతో వీరు చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్మకాలు జరిపేవారు. 68 కేజీల గంజాయిని సరఫరా చేయాలని, అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తామని రాజును పిలిచి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

ఇన్నోవా కారులో 36  ప్యాకెట్లు తీసుకొని బిలాల్ మజీద్, ఇమ్రాన్ హోటల్ వద్ద ఆపి కస్టమర్ల వారు కోసం ఎదురు చూస్తున్నారు.  పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.17.5 లక్షల వరకు ఉండొచ్చని ఏసీపీ తెలిపారు. ఆపరేషన్‌‌‌‌లో సీఐ శ్రీనివాస్, డీఐతో పాటు టాస్క్ ఫోర్స్ సీఐ, సిబ్బందిని  ఏసీపీ  అభినందించారు.