
- రాష్ట్ర ఖజానాలో పైసల్లేవ్
- రైతు భరోసాకు ఇప్పటికిప్పుడు రూ.11 వేల కోట్లు ఎట్ల?
- అందులో 30% నిధులు కూడా ఖజానాలో నిల్వలేవు
- కొత్తగా అప్పులు తీసుకునే పరిస్థితి కూడా లేదు
- ఈ ఆర్థిక సంవత్సరం అప్పులన్నీ గత సర్కారే తీసుకుంది
- రాబడి గాడిన పడే దాక తప్పని తిప్పలు
- ఓఆర్ఆర్ లీజు సొమ్ము, భూముల అమ్మకంతో
- వచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వమే ఖర్చు చేసింది
- ఎలాగైనా సర్దుబాటు చేసి హామీలు
- అమలు చేసేందుకు కొత్త సర్కార్ ప్రయత్నం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. కొత్త ప్రభుత్వానికి ఆదిలోనే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కనీసం అప్పులు తీసుకుందామంటే.. ఆ పరిస్థితి కూడా లేదు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2023–24) లక్ష్యంగా పెట్టుకున్న అప్పులన్నింటినీ ఎన్నికల ఫలితాల కంటే ముందే గత ప్రభుత్వం తీసేసుకున్నది. కొత్త ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ... వీటికి కొంతకాలం తర్వాత నిధులు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. అయితే రైతు భరోసా, గృహజ్యోతి, మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 సాయం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ వంటి వాటికి వెంటనే నిధుల అవసరం తప్పనిసరిగా మారింది.
గ్యారంటీల అమలుకు ఎన్ని నిధులు అవసరం? ఏవి ఎప్పుడు మొదలుపెట్టేందుకు అవకాశం ఉంటుందనే దానిపై రిపోర్ట్ రెడీ చేయాలని ఉన్నతాధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఓఆర్ఆర్ లీజు సొమ్ము, ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులను కూడా గత సర్కారే ఖర్చు చేసింది. ఈ మొత్తం రూ.19 వేల కోట్లు ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ఏడాదికి కనీసం రూ.60 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది.
పరిస్థితి అంతంత మాత్రమే
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల్లో ప్రకటించిన అతిముఖ్యమైనది రైతుభరోసా. రాష్ట్రంలోని రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఎకరాకు రూ. 15,000 పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసాను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జమ చేయాల్సి ఉన్నది. ఎకరాకు రూ.7,500 చొప్పున కోటి 50 లక్షల ఎకరాలకు ఇవ్వాలి.
ఇందుకు దాదాపు ఒక దఫాకే రూ.11 వేల కోట్లు అవసరమవుతాయి. అయితే రాష్ట్ర ఖజానాలో ఈ మొత్తంలో 30 శాతం కూడా నిధులు నిల్వ లేవు. ఆ ఉన్నవాటిలో నుంచే రాష్ట్రానికి సంబంధించిన ఇతర అవసరాలన్నీ తీర్చాల్సి ఉంది. రైతులకు యాసంగి పెట్టుబడి సాయంపై గత నెలలో ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. అదే సమయంలో పెట్టుబడి సాయం వేయకుండా ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. అయితే అప్పటికే రాష్ట్ర ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రావడం.. రైతుభరోసా అమలు చేద్దామని చూస్తే నిధులు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కనీసం వచ్చే నెలలోనైనా రైతుభరోసా అమలు చేసేందుకు అవసరమైన పైసలు సమకూర్చాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఎంతోకొంత నిధులు రాబట్టుకుని.. యాసంగి సీజన్ పెట్టుబడి సాయాన్ని జనవరి చివరలో లేదంటే ఫిబ్రవరి లో రైతుల ఖాతాల్లో వేయాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయమూ తగ్గింది
రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడినప్పటి నుంచి అంటే సెప్టెంబర్ నెల నుంచి ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అనుకున్న అంచనాల కంటే తక్కువ మొత్తంలో రాబడి వస్తున్నది. అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే వచ్చే మార్చి నాటికి రావాల్సిన మొత్తం రెవెన్యూ రూ.2.16 లక్షల కోట్లు అయితే.. ఇందులో లక్షా 15 వేల కోట్లు మొన్న నవంబర్ చివరి నాటికి వచ్చింది. అంటే ఇంకా మిగిలిన నాలుగు నెలల్లో లక్ష కోట్ల రూపాయలు రావాలి. ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్, జీఎస్టీ ద్వారానే సమకూరుతున్నది. అయితే గత ప్రభుత్వం ముందస్తు లిక్కర్ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో అప్పుడే రావాల్సినంత రాబడిని పిండేసుకున్నది. ఇప్పుడు యావరేజ్‌గా లిక్కర్ సేల్స్‌తో నెలకు రూ.2,300 కోట్లు వస్తుంది. లక్ష్యం ప్రకారమైతే.. రూ. 3 వేల కోట్ల నుంచి 3.5 వేల కోట్ల దాకా రావాలి. ఇక స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్‌తో నవంబర్ చివరి నాటికి రూ.12 వేల కోట్లు రావాల్సి ఉండగా.. అది రూ.9,500 కోట్లే వచ్చింది. అంటే రూ.4 వేల కోట్లు తగ్గింది. ఎన్నికల ఎఫెక్ట్ రియల్ భూమ్ లేక భారీగా భూముల క్రయవిక్రయాలు ఆగిపోవడంతో ఆ ఎఫెక్ట్ ఆదాయంపై పడింది. జీఎస్టీ కూడా అంతంత మాత్రంగానే వస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ.51 వేల కోట్లు లక్ష్యంగా ఉండగా.. నవంబర్ నాటికి వచ్చింది రూ.30 వేల కోట్లలోపే. మిగిలిన 4 నెలల్లో ఇంకా రూ.20 వేల కోట్లు రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే..
రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో తీసుకోవాల్సిన అప్పులన్నీ మరో 4 నెలలు మిగిలి ఉండగానే పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసుకుంది. 12 నెలల కాలంలో తీసుకోవాల్సిన అప్పులను 8 నెలల్లోనే తీసుకుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. 2023-24లో దాదాపు రూ.40 వేల కోట్లు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం గత నవంబర్లోనే అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే ముందే తీసుకుంది. సగటున ప్రతినెలా దాదాపు 5వేల కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు కొత్తగా ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకునే చాన్స్ లేకుండా చేసింది. ఇతర మార్గాల ద్వారా అప్పులు ఎట్లా సమకూర్చు కోవాలనే దానిపై కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనికి ఇప్పటికే మించిపోయిన గత ప్రభుత్వ అప్పులు అడ్డంకిగా మారుతున్నాయి. గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏకంగా రూ.5.3 లక్షల కోట్ల మేర అప్పులు చేసింది.