హైదరాబాద్, వెలుగు: సిటీల్లో బయటకు పోవాలంటే క్యాబ్‌లు బుక్ చేసుకున్నట్టే.. రైతులు కూడా తమకు అవసరమయ్యే మెషీన్లు బుక్ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ కొత్త యాప్‌ను రెడీ చేస్తోంది. ఫామ్ మెకనైజేషన్‌ను కొత్త తరహాలో అన్నదాతలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది. పంట కోసే హార్వెస్టర్లు, దుక్కిదున్నే ట్రాక్టర్లు, నాటు వేసే మెషీన్లు ఇలా ప్రతి యంత్రాన్నీ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది. దీంతో పాటు ఇప్పటివరకు కొందరు వ్యక్తులకే ఉపయోగపడుతున్న యంత్రలక్ష్మీ పరికరాలు అందరికీ అందేలా కస్టమర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఫామ్ యాప్‌తో..
గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు, మొబైల్ ఫోన్లు బాగా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి యంత్రాలను బుక్ చేసుకునేలా యాప్ రూపొందిస్తే రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ ఆలోచించింది. రైతులకు సీజన్‌ను బట్టి యంత్రాలు బుక్ చేసుకునేలా ‘ఫామ్ యాప్’ను రెడీ చేస్తోంది. ఆ యాప్ వివరాలు నమోదు చేస్తే తమకు అవసరమైన యంత్రాలు దగ్గర్లో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుస్తోంది. హార్వెస్టర్లు, నాటేసే మెషీన్లు బుక్ చేస్కోండి.
ఆ ప్రకారం రైతులు యంత్రాలను ఈజీగా బుక్ చేసుకోవచ్చు.
కస్టమర్ హైరింగ్ సెంటర్లతో..గతంలో వ్యక్తిగత ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ప్రభుత్వం అందించింది. వాటిని అవసరమున్నప్పుడు రైతులు వాడుకుంటున్నారు. తరువాత అవి ఖాళీగా ఉంటున్నాయి. దీంతో ఇక సొంత యంత్రాలను సర్కారు పక్కన పెట్టనున్నట్లు సమాచారం. వాటికి బదులు కస్టమర్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణకు ఈ యేడు రూ. 1,500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తోంది. మండలాలు, గ్రామాల వారీగా కస్టమర్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. గ్రామాల వారీగా రైతులకు అవసరమయ్యే పవర్ స్ప్రేయర్లు, నాగళ్లు, టిల్లర్లు, వీడర్లు, టార్పాలిన్లు లాంటి యంత్రాలను కిరాయికి తీసుకుని వాడుకునే వెసులుబాటు కల్పించనుంది.
ఎవరి దగ్గర ఏమేం ఉన్నాయో తెలుసుకొని..
ఫామ్ మెకనైజేషన్‌లో భాగంగా రాష్ట్రంలో రైతుల వివరాలను వ్యవసాయ శాఖ సేకరించింది. ‘ఫామ్ ఇంప్లిమెంట్స్ ఇన్వెంటర్స్’ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా డేటాను తీసుకుంది. రైతుల దగ్గర ఏమేం పరికరాలున్నాయో గుర్తించింది. క్లస్టర్ల వారీగా ఇప్పటికే 90 శాతం వివరాలు సేకరించినట్టు సమాచారం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ ప్రకారం ఏయే ప్రాంతాల్లో ఏయే యంత్రాలు అవసరమో అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 18,625 హార్వెస్టర్లు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. కూలీల సమస్య వల్ల వరి నాటు యంత్రాల అవసరం ఎక్కువగా ఉందని తెలుసుకుంది.