
భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ధరణి అనే వ్యవస్థను తీసుకువచ్చింది. దీంతో నేరుగా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయంటూ చెప్పుకొచ్చి .. గ్రామీణ స్థాయి వ్యవస్థలో ఉన్న భూ రక్షకులు అయిన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసి ఇతర శాఖల్లో కలిపారు. దీంతో గ్రామాల్లో అనేకమంది రైతులు భూ సమస్యల కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. అనేకమంది రైతులు, సామాన్య ప్రజలు తమ భూ సమస్యల పరిష్కారం ఎలా చేసుకోవాలో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో నిత్యం ఉండే సమస్యలు భూ సమస్యలు. అటువంటి ప్రధానమైన రెవెన్యూ వ్యవస్థలో భూ రక్షకులుగా ఉండాల్సిన అధికారులు ఉండకపోవడంతో అక్కడక్కడా భూములు కబ్జా అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం గ్రామాల్లో క్షేత్ర స్థాయి రెవెన్యూ పర్యవేక్షకులను నియమించలేదు. దీంతో అనేక మంది రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.
కొత్తగా జీపీవోలు
భూమి ఆత్మగౌరవం.. అటువంటి భూమి కళ్ల ముందు కబ్జా అవుతుంటే రైతులు ప్రజలు తట్టుకోలేరు. అయినా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని పరిష్కరించేందుకు అధికారి లేకపోవడంతో చాలా తిప్పల పాలయ్యారు. అయితే గత ప్రభుత్వం ముందుగా వీఆర్వోలను ఇతర శాఖలకు పంపింది. ఆ తరువాత వీఆర్ఏలుగా ఉన్న వారిని సైతం ఇతర శాఖలకు పంపడంతో గ్రామాల్లో భూ రక్షకులు లేని పరిస్థితి. నిత్యం గ్రామాల్లో రైతుల భూ సమస్యల కోసం ఓ అధికారి ఉండాలనే భావనతో ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పూర్వ వీఆర్వో వ్యవస్థల మాదిరిగా గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని చెప్పింది. అందుకు అనుగుణంగానే భూమిని అత్యంత రక్షణగా ఉంచడానికి భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా తయారుచేశారు. ఎవరి భూమీ అన్యాక్రాంతం కాకుండా ఈ భూ భారతిని పకడ్బందీగా రూపొందించారు. ఒక్క గుంట భూమి కూడా కబ్జాకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొని గత వీఆర్వో, వీఆర్ఏలను తిరిగి మాతృ సంస్థలోకి తీసుకొచ్చేందుకు జీపీవోలుగా పోస్టులను మంజూరు చేసి పరీక్షలు నిర్వహించింది. రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించి సుమారు 9 వేల జీపీవోల నియామకం కోసం చర్యలు తీసుకుంది. దీంతో వారంతా ఉత్సాహంగా పరీక్షలు రాశారు. కాగా, ఇటీవల వారికి జిల్లాలో కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి వారిని తిరిగి గ్రామాల్లోకి పంపుతోంది.
ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు!
జీపీవోలుగా ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్బందీగా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేసి గ్రామాలను కేటాయించడంతో ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో భూ రక్షకులుగా జీపీవోలు వెళ్లనున్నారు. దీంతో గ్రామాల్లో రైతుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ గ్రామానికి జీపీవో నియామకం అయిన సంగతిని తెలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నారంటే రైతులకు రెవెన్యూ అధికారుల అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పంట చేనుకు కాపు కాసేది రైతు అయితే .. ఆ రైతు భూ రక్షకులే నేటి జీపీవోలు. తరతరాలుగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేసి క్షేత్రస్థాయిలో ఏ సమస్య లేకుండా కృషిచేసే రెవెన్యూ అధికారి లేక అనేకమంది రైతులు గోస వడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రభుత్వంలో పల్లెలకు భూ రక్షకులుగా జీపీవోలను నియమించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మాతృసంస్థలో నుంచి బయటకు వచ్చామనే బాధలో ఉన్న తమను తిరిగి రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు.
- గ్యార సాయిలు,
జీపీవో, యాచారం, కామారెడ్డి జిల్లా