కూరెల్లలో జైనుల ఆనవాళ్లు

కూరెల్లలో జైనుల ఆనవాళ్లు

ఇక్కడ దొరికిన వేల ఏండ్ల నాటి గుర్తులు.. ఒకప్పటి ఆచార, సంప్రదాయాలను కళ్లకు కడుతున్నాయి. విగ్రహాలు, వస్తువులు అప్పట్లో ఉన్న మత విశ్వాసాలు, లైఫ్​స్టైల్​ని అంచనా వేయడానికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం జైన విద్యా కేంద్రం, ధ్యాన క్షేత్రం. ఇప్పటికీ జైనమత ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయిక్కడ.

కూరెల్ల గ్రామంలో దొరికిన ఆధారాల బట్టి జైన మతం ఇక్కడ  చాలా కాలం విలసిల్లిందని ఆర్కియాలజిస్ట్​లు చెప్తున్నారు. ఈ ఊరు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉంది. ఇక్కడ ప్రాచీన  జైన మత ఆనవాళ్లు ఎన్నో దొరికాయి. క్రీస్తు పూర్వం నుంచే తెలంగాణాలో  జైన మతం ఉందనడానికి ఈ ప్రాంతమే సాక్ష్యం. 

మాంధాత గుట్ట 

మధ్యప్రదేశ్​లోని ఖాండ్వా జిల్లాలో ‘మాంధాత ఓంకారేశ్వర్’ అనే దిగంబర జైన సిద్ధక్షేత్రం ఉండేది. దానిని ‘సిద్ధవరకూటం’ అని కూడా పిలుస్తారు. అక్కడ  జైన తీర్థంకరులు సంభవనాథుడు, చంద్రప్రభు, ఆదినాథుని విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు చెప్తారు. అదే ప్రాంతంలో ఎంతోమంది జైన మునులు మోక్షం పొందినట్లు జైన మత గ్రంథాల్లో ఉంది. అందుకే ఆ క్షేత్రం పేరునే కూరెల్లలోని జైన క్షేత్రానికి పెట్టారు. ఇప్పటికీ ఈ క్షేత్రం ఉన్న కొండని ‘‘మాంధాత గుట్ట” అనే పిలుస్తారు. అంతేకాదు ఈ గుట్ట దగ్గర సప్త మాతృకల రాతిఫలకం దొరికింది. ఇది రాష్ట్ర కూటుల కాలం నాటిదని ఆర్కియాలజిస్టులు చెప్పారు. 

బొర్ర కోమటి

రాతి మీద చెక్కిన వినాయక విగ్రహం ఒకటి ఈ గుట్టపై ఉంది. ఈ విగ్రహానికి రెండు చేతులు మాత్రమే ఉన్నాయి. తొండం కుడి వైపుకు తిరిగి ఉంది. దక్షిణాభిముఖంగా వున్న ఈ విగ్రహాన్ని జైన మత సంప్రదాయం ప్రకారం చెక్కారు. ఈ విగ్రహానికి కొంచెం దూరంలో ధ్యాన భంగిమలో ఉన్న వర్థమాన మహావీరుని విగ్రహం ఉంది. ఈ  విగ్రహాల ఆధారంగా ఈ ప్రాంతంలో జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉందనేది ఆర్కియాలజిస్ట్​ల అంచనా. ఈ ఊళ్లో ఒక పొలంలో వున్న వర్ధమాన మహావీరుని విగ్రహాన్ని అక్కడి వాళ్లు ‘‘బొర్ర కోమటి” అని పిలుస్తారు. అంతేకాదు.. చాలా జైన క్షేత్రాల్లో వర్థమాన మహావీరుడిని ఈ పేరుతోనే పిలుస్తారని చరిత్రకారులు చెప్తున్నారు. కోమటులంటే గోమఠులని, గోమఠులంతా జైనులని చరిత్ర చెప్తోంది. శ్రావణ బెళగోళలోని గోమఠేశ్వరుని(బాహుబలి) పేరు నుంచే ఈ కోమటి అనే పదం వచ్చింది. 

చౌముఖి స్తంభం

కూరెల్ల గ్రామ పంచాయతీ ఆఫీస్​ వెనుక జైన చౌముఖి స్తంభం ఉంది. ఇది నాలుగు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో ఉంది. దీన్ని నీలిరంగు రాతితో చెక్కారు. దానిపై ధ్యాన భంగిమలో వున్న మహావీరుని బొమ్మ చెక్కారు. జైన విద్యా కేంద్రం ఉన్నచోటే చౌముఖి స్తంభం ఉంటుందని చరిత్ర చెప్తోంది. కాబట్టి, కూరెల్ల కూడా జైన మత విద్యా కేంద్రంగా విలసిల్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ కూరెల్ల గ్రామస్తులు చౌముఖి స్తంభానికి పూజలు చేస్తుంటారు. 

పూసలు, రాగి నాణేలు 

మహావీరుని విగ్రహం దొరికిన పొలాల్లోనే టెర్రకోట మట్టిపూసలు, ఎర్రని పగడపు పూసలు, రాగి నాణేలు దొరికాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ మట్టిని పెకిలించినా.. జైన మతానికి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతుంటాయి. రైతులు దుక్కి దున్నేటప్పుడు ఎన్నో పురాతన వస్తువులు దొరికాయి. లేత ఎరుపు, నల్లని రంగుతో వున్న కుండ పెంకులు కూడా ఎక్కువగా దొరికాయి.14 అడుగుల పొడవు, తొమ్మిదిన్నర అడుగుల వెడల్పు ఉండే శాతవాహన కాలం నాటి ఇటుకల కుప్పలు కూడా ఇక్కడ కనిపించాయి. అంతేకాదు.. ఇక్కడ ఒక  దేవాలయానికి సంబంధించిన రాతి పునాది ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పెద్ద ఆలయం ఉండేదని తెలుస్తోంది. ::: హరిపురం రఘునందన స్వామి, సిద్దిపేట, వెలుగు

 ఆనవాళ్లను కాపాడాలి

కూరెల్లలో దొరుకుతున్న జైనమత ఆనవాళ్లను కాపాడుకోవాలి. ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ తవ్వకాలు చేస్తే మరిన్ని ఆధారాలు దొరుకుతాయి. వాటిని కాపాడుకోవాలి. లేదంటే క్రీస్తు పూర్వం నాటి చరిత్ర ముందు తరాలకు తెలియకుండా పోతుంది. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి. కూరెల్లతో పాటు మాంధాత గుట్ట, సింగరాయ గుట్ట, మోయ తుమ్మెద వాగు పరిసర ప్రాంతాల్లో జైన ఆనవాళ్లు ఇంకిన్ని దొరికే అవకాశం వుంది. – సామలేటి మహేష్​టార్చ్ (టీమ్ ఆఫ్​ రీసెర్చ్ హెరిటేజ్ అండ్ కల్చర్) మెంబర్​