రామప్పకు తొలగని ఓపెన్‌‌కాస్ట్‌‌ ముప్పు!

రామప్పకు తొలగని ఓపెన్‌‌కాస్ట్‌‌ ముప్పు!

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: 
 ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు దక్కించుకున్న రామప్ప దేవాలయానికి ఓపెన్​కాస్టు రూపంలో  పొంచి ఉన్న ముప్పు ఇంకా తొలగిపోలేదు.  ఈ దేవాలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్​లో ఓసీపీ ఏర్పాటుకు అప్పట్లో సింగరేణి ప్రయత్నించగా, తీవ్ర విమర్శలు రావడంతో అలాంటిదేమీ లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఏడాదిన్నర తర్వాత సింగరేణి మరోసారి ఓసీపీ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే వెంకటాపూర్ లో ఓసీపీ పనులు ప్రారంభించేందుకు అనుమతించాలని పురావస్తు శాఖ ఆఫీసర్లను సింగరేణి ఉన్నతాధికారులు కోరారు. దీంతో ఓసీపీ తవ్వకాల వల్ల జరిగే వాయు, ధ్వని కాలుష్యం ఎలా ఉంటుందనే విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ కోరడం చర్చనీయాంశంగా మారింది. 

గతంలోనే ఓసీపీ‌ కోసం ఏర్పాట్లు..

ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఈ టెంపుల్​కు 7 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్‌‌ గ్రామ శివారులో 40.43 మిలియన్‌‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి గుర్తించింది. అన్ని రకాల సర్వేలు జరిపి 19 ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు జరపాలని భావిస్తూ అనుమతులు తీసుకుంది. 314 హెక్టార్ల అటవీ భూములు, 1480 హెక్టార్ల వ్యవసాయ, ప్రభుత్వ అసైన్డ్‌‌ భూములను సేకరించాలని రిపోర్ట్‌‌ తయారు చేసింది. కొంత భూమి సేకరించి హద్దులు ఏర్పాటు చేసి రోడ్డు కూడా వేశారు. భూసేకరణ కింద రైతులకు నష్ట పరిహారం అందించి, ఆర్‌‌‌అండ్‌‌ఆర్‌‌ ప్యాకేజీ వర్తింప చేసి  2021 డిసెంబర్‌‌ నెలలో ఓపెన్‌‌ కాస్ట్‌‌ తవ్వకాలు జరపాలని భావించింది. దీనికి అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు.

రామప్పకు యునెస్కో గుర్తింపుతో తారుమారు

రామప్ప దేవాలయానికి జూలై 25, 2021న ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు వచ్చింది. దీంతో దేశ, విదేశీ పర్యాటకులు పెరుగుతుండడంతో ఆమేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో సింగరేణి ఓసీపీ విషయం బయటకు వచ్చింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సింగరేణి ఆఫీసర్లు  వెనక్కి తగ్గారు. భూసేకరణ కోసం రైతులతో మాట్లాడటానికి ఏర్పాటు చేసిన సభలన్నీ రద్దు చేసుకున్నారు. రైతులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్‌‌ అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు. భూసేకరణ వివరాలను ప్రకటించకుండానే మరుగున పడేశారు.

ఏడాదిన్నర తర్వాత మళ్లీ తెరపైకి..

ఏడాదిన్నర తర్వాత మళ్లీ వెంకటాపూర్‌‌లో ఓసీపీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఓవైపు కేంద్ర పురావస్తు శాఖ ప్రసాద్‌‌ స్కీంలో భాగంగా రూ.75 కోట్లతో ఏర్పాట్లు చేస్తుండగా, వారం కింద సింగరేణి ఆఫీసర్లు వెంకటాపూర్‌‌లో పర్యటించి ఓసీపీ గురించి రైతులతో మాట్లాడుతున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ అనుమతులు తీసుకొని త్వరలోనే బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తామని చెప్పారు.  తవ్విన బొగ్గును తరలించడానికి రైల్వే ట్రాక్‌‌ ఏర్పాటుపై కూడా సర్వే చేస్తున్నారు. ఈ విషయమై 'వీ6 వెలుగు' ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లతో మాట్లాడితే వెంకటాపూర్‌‌లో ఓపెన్‌‌ కాస్ట్‌‌ బొగ్గు తవ్వకాలకు అనుమతించాలని సింగరేణి తమను  కోరింది నిజమేనని చెప్పారు. కానీ, బొగ్గు తవ్వకాలు జరపడానికి జరిపే పేలుళ్ల వల్ల కలిగే శబ్ద, వాయు కాలుష్యం, బొగ్గు రవాణాకు వచ్చిపోయే లారీలు, ఇతర భారీ వాహనాల వల్ల కలిగే ఇబ్బందులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సింగరేణికి తమ డిపార్ట్‌‌మెంట్‌‌ హయ్యర్‌‌ అఫీషియల్స్‌‌ సూచించినట్లు ఆయన తెలిపారు. కాగా, ఓపెన్‌‌కాస్ట్‌‌ బొగ్గు తవ్వకాలు జరిపే ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల మేర దాని ప్రభావం ఉంటుందని, భూ అంతర్భాగంలో చేసే బాంబు పేలుళ్ల వల్ల రామప్ప దేవాలయానికి ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వెంకటాపూర్​ ఓపెన్​కాస్టును పూర్తిగా ఉపసంహరించుకోవాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు. 

సింగరేణి ఆఫీసర్లు వచ్చి సర్వే చేశారు

ఇటీవల సింగరేణి ఆఫీసర్లు వెంకటాపూర్ కు వచ్చి మళ్లీ సర్వే చేశారు. త్వరలో ఓపెన్‌‌ కాస్ట్‌‌ పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు రైతులతో చెప్పారు. ఓపెన్‌‌కాస్ట్‌‌ వల్ల రామప్ప దేవాలయానికి ఎలాంటి  ప్రమాదం జరుగుతుందో మాకైతే తెలియదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఆఫీసర్లే అన్నీ చూసుకోవాలి.  మా గ్రామానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. సింగరేణి ఆఫీసర్లు సర్వే వివరాలను మా గ్రామ పంచాయతీకి తెలియచేయకుండానే నిర్వహించారు. 
‒ మెడబోయిన అశోక్,  వెంకటాపూర్ సర్పంచ్, ములుగు జిల్లా

రామప్ప టెంపుల్‌‌కి నష్టం జరిగే పనులు చేయొద్దు

యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప టెంపుల్‌‌కి నష్టం జరిగే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దు. వెంకటాపూర్‌‌లో సింగరేణి ఏర్పాటు చేసే ఓపెన్‌‌ కాస్ట్‌‌ గని వల్ల శబ్ద, వాయు కాలుష్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బాంబు బ్లాస్టింగ్‌‌ల వల్ల టెంపుల్‌‌ కి నష్టం కలగవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
‒ దాసరి శ్రీనివాస్‌‌,   జవహర్‌‌ నగర్‌‌, ములుగు జిల్లా