
బిజినెస్ డెస్క్, వెలుగు: ఆర్‌బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్ విధానం ఈ ఏడాది అక్టోబర్ నుంచి కచ్చితంగా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు నెలల పాటు ఈ డెడ్‌లైన్‌ను పొడిగించారు. ఈ ఏడాది జులై నుంచే కార్డు టోకెనైజేషన్ అమల్లోకి రావాల్సి ఉంది. బ్యాంకులు, కార్డు నెట్‌వర్క్ కంపెనీలు, కస్టమర్లు టోకెనైజేషన్‌కు పూర్తి స్థాయిలో రెడీ అవ్వడానికి ఆర్‌బీఐ ఈ మూడు నెలలు టైమ్ ఇచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు లేదా ఇతర సైట్‌లలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డిటెయిల్స్‌ను సేవ్ చేసుకోవాలని అనుకునే కస్టమర్లు వచ్చే నెల 30 లోపు టోకెనైజేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఇప్పటికే సేవ్ అయి ఉన్న కార్డు డిటెయిల్స్ డిలీట్ అయిపోతాయి. టోకెనైజేషన్ వస్తే వెబ్‌సైట్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), యాప్‌లలో ట్రాన్సాక్షన్లు జరిపేటప్పుడు ప్రతీసారి కార్డు వివరాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ట్రాన్సాక్షన్లను కూడా టోకెన్ రూపంలో సేవ్ అయిన కార్డు నుంచి సురక్షితంగా చేసుకోవచ్చు.
కార్డు మోసాలు తగ్గించేందుకే..
డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆర్‌బీఐ టోకెనైజేషన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు డిటెయిల్స్‌ను సంబంధిత ప్లాట్‌ఫామ్‌లు సేవ్ చేసుకోవడానికి టోకెనైజేషన్‌తో కుదరదు. కస్టమర్ తమ కార్డు డిటెయిల్స్‌ను సేవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే మాత్రం ‘టోకెన్ల’ రూపంలో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘టోకెనైజేషన్ అంటే కార్డు డిటెయిల్స్‌ను ‘టోకెన్ల’ రూపంలో సేవ్ చేయడం. కార్డు, టోకెన్ రిక్వెస్టర్, వాడుతున్న డివైజ్‌ను బట్టి యునిక్ టోకెన్‌ను ఇష్యూ చేస్తారు. కాగా, ఏ సైట్‌లలోనైనా కార్డు డిటెయిల్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే, ఆ సైట్‌ను టోకెన్ రిక్వెస్టర్‌గా పిలుస్తారు. కస్టమర్ నుంచి టోకెనైజేషన్ రిక్వెస్ట్‌ను తీసుకొని ఈ రిక్వెస్ట్‌ను సంబంధిత కార్డు నెట్‌వర్క్‌కు (వీసా, మాస్టర్‌కార్డ్, రూపే వంటివి) టోకెన్ రిక్వెస్టర్ పంపుతారు’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం ఆన్‌లైన్ కార్డు ట్రాన్సాక్షన్లలో భాగం పంచుకుంటున్న సంస్థలు కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డు నెంబర్లను, ఎక్స్‌పైరి డేట్ వంటి ఇన్‌ఫర్మేషన్‌ను స్టోర్ చేసుకుంటున్నాయి.
కస్టమర్లు ప్రతీసారి కార్డు డిటెయిల్స్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా కార్డు డిటెయిల్స్‌ను సేకరిస్తున్నాయి. కానీ, ఈ డిటెయిల్స్‌ను కొన్ని సంస్థలు, ప్లాట్‌ఫామ్‌లు తప్పుగా వాడతాయని ఆర్‌బీఐ ఆందోళన చెందుతోంది. ‘కార్డు ట్రాన్సాక్షన్ల అథంటికేషన్‌ను పరిశీలించడానికి చాలా ట్రాన్సాక్షన్లలో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్‌ఏ) ప్రాసెస్‌ను కచ్చితంగా జరపడం లేదు. మోసగాళ్ల చేతుల్లోకి కార్డు డిటెయిల్స్ చేరితే కార్డు హోల్డర్లు తమ డబ్బులు నష్టపోవాల్సి వస్తోంది’ అని ఆర్‌బీఐ వివరించింది.
కార్డు టోకెనైజేషన్‌పై తరచూ అడుగుతున్న ప్రశ్నలు
1) కార్డు టోకెనైజేషన్ అంటే ఏంటి?
ఆర్‌బీఐ డెఫినిషన్ ప్రకారం, ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో కార్డు డిటెయిల్స్‌ను సేవ్ చేసేటప్పుడు టోకెనైజేషన్ కింద ఒరిజినల్ డిటెయిల్స్ ‘టోకెన్’ గా పిలిచే కోడ్‌లతో భర్తీ అవుతాయి.
2) టోకెనైజేషన్ వలన ఉపయోగం ఏంటి?
కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్లు జరిపేటప్పుడు టోకెనైజేషన్ కింద అసలైన కార్డు వివరాలను వ్యాపారులతో, వెబ్‌సైట్లు, యాప్‌లతో పంచుకోవల్సిన అవసరం ఉండదు. అందువలన కార్డు వివరాలు సేఫ్‌గా ఉంటాయి.
3) కార్డు టోకెనైజేషన్ ఎలా చేయాలంటే?
ఉదాహరణకు ఒక కస్టమర్ అమెజాన్‌లో కార్డు డిటెయిల్స్‌ను టోకెనైజేషన్ విధానంలో సేవ్ చేసుకోవాలని అనుకున్నాడని అనుకుందాం. ఈ సైట్‌లో కార్డు పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మొదటిసారి తన కార్డు డిటెయిల్స్‌ను కస్టమర్ ఇస్తాడు. ఇదే సైట్ కార్డును ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం టోకెనైజ్ చేసుకుంటారా? అని అడుగుతుంది. దానికి ఒకే చెబితే కార్డు నెట్‌వర్క్ కంపెనీకి కస్టమర్ అడిగిన టోకెన్ రిక్వెస్ట్‌ను అమెజాన్ పంపుతుంది. ఈ కార్డు నెట్‌వర్క్ కంపెనీ ఒక యునిక్ టోకెన్ నెంబర్‌ను ఇష్యూ చేస్తుంది.
4) టోకెనైజేషన్‌ను ఎవరు చేస్తారు?
ఆర్‌బీఐ అనుమతి పొందిన కార్డు నెట్‌వర్క్ కంపెనీలు మాత్రమే కార్డు టోకెనైజేషన్ విధానాన్ని జరుపుతాయి. అది కూడా కస్టమర్ల కోరిక మీదకే చేస్తాయి. కార్డును టోకెనైజ్ చేయడం తప్పనిసరి కాదు. చేయమని అనుకుంటే మాత్రం కార్డు ట్రాన్సాక్షన్ చేసే ప్రతీసారి కస్టమర్ తమ కార్డు డిటెయిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. కార్డును టోకెనైజ్ చేసుకోవడంలో కస్టమర్ ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక్కో సైట్, పీఓఎస్ , యాప్‌లలో ఒక్కో యునిక్ టోకెన్‌ను క్రియేట్ చేసుకోవాలి.