మునుగోడులో నామినేషన్లు వేస్తమని గిరిజనుల హెచ్చరిక 

మునుగోడులో నామినేషన్లు వేస్తమని గిరిజనుల హెచ్చరిక 

చౌటుప్పల్, వెలుగు: ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ సర్కార్ పోడు భూములకు పట్టాలివ్వాలని, లేదంటే కేసీఆర్​సభను అడ్డుకుంటామని గిరిజనులు హెచ్చరించారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం తుంబాయి, కడిలాబాయి తండాకు చెందిన గిరిజన రైతులు తమ పాత పట్టా పుస్తకాలతో సంస్థాన్ నారాయణపురం తరలివచ్చారు. ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మంచాల మండలాల్లోని 14 గ్రామాల పరిధిలో 2 వేల గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మా చేతుల్లో 13 వేల ఎకరాల భూమి ఉంది. వీటిని ఇందిరాగాంధీ సర్కార్ పంపిణీ చేసి పట్టాలిచ్చింది.

ఇపుడు ధరణి తెచ్చి కొత్త పాస్​బుక్స్ ఇవ్వలేదు. పాస్​బుక్స్ లేకపోవడంతో ఫారెస్టోళ్లు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారు” అని గిరిజనులు వాపోయారు. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లేదంటే నిజామాబాద్ లో పసుపు రైతులు నామినేషన్లు వేసిన మాదిరి.. తాము కూడా మునుగోడులో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.