
ట్యాంక్ బండ్ వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించిన ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. చివరి రోజు సండే కావడంతో జనాలు భారీగా వచ్చినప్పటికీ ప్రాక్టీస్ రేస్‌లతో సరిపెట్టడంతో నిరాశ చెందారు. మొదటిరోజుతో పోలిస్తే సాధారణ గ్యాలరీలో సంఖ్య కాస్త పెరిగింది. వీఐపీ గ్యాలరీ ఫుల్ అయ్యింది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వీఐపీ గ్యాలరీ నుంచి రేసింగ్‌ను చూశారు. వీఐపీ గ్యాలరీలో కెపాసిటీకి మించి ఉన్నారని, ఎక్కువ మంది వెళితే కుంగిపోయే ప్రమాదం ఉందని మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వచ్చిన వారిని పోలీసులు ఎంట్రెన్స్ దగ్గరే నిలిపివేశారు. దాదాపు రెండు గంటల తర్వాత వారిని లోపలికి అనుమతించారు. రేసింగ్ లీగ్ ఏర్పాట్లపై అభిమానులు అసంతృప్తితో వెనుదిరిగారు. భారీగా ఖర్చుపెట్టి టికెట్లు కొన్నామని, ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. కెపాసిటీ కంటే ఎక్కువ మందిని గ్యాలరీలోకి వదలడంతో ఇబ్బంది పడ్డామని మరికొందరు పేర్కొన్నారు. - వెలుగు, హైదరాబాద్