భారత్ గోధుమల ఎగుమతులపై యూఏఈ నిషేధం

భారత్ గోధుమల ఎగుమతులపై యూఏఈ నిషేధం

న్యూఢిల్లీ : భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నాలుగు నెలల పాటు నిషేధం విధించింది. దీని ప్రకారం గోధుమలు, గోధుమ పిండి ఎక్స్ పోర్టు, రీ ఎక్స్ పోర్టుపై నిషేధం అమల్లోకి వస్తుంది. దేశీయ వినియోగం కోసమే భారత్ గోధుమల ఎగుమతికి అంగీకరించిందని యూఏఈ వెల్లడించింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే.. దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధుమలను ఎగుమతి చేయడానికి భారత్‌ ఆమోదించిందని పేర్కొంది. మే 14న భారత్‌ గోధుమ ఎగుమతులను నిషేధించిన విషయం తెలిసిందే.

గోధుమలను ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతించిన దేశాలకు ఎగుమతి కొనసాగుతుందని, క్రెడిట్‌ లెటర్‌ జారీ అయిన వాటికి సంబంధించి ఎగుమతికి భారత్ అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ప్రపంచ దేశాలు భారత్‌ను కోరాయి. ఆహార కొరత తలెత్తకుండా ప్రపంచ దేశాలకు 469,202 టన్నుల గోధుమల ఎగుమతికి భారత్ అనుమతి ఇచ్చింది. తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేషియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్‌కు విజ్ఞప్తి చేశాయి. యూఏఈ విజ్ఞప్తి మేరకు ప్రజల అవసరాలకు సరిపడా గోధుములను పంపేందుకు భారత్‌ సుముఖత వ్యక్తం చేసింది.

భారత్‌ సస్పెన్షన్ ప్రారంభమైన మే 13కి ముందు యూఏఈకి తీసుకువచ్చిన భారతీయ గోధుమలను ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ, ఇండియా ఫిబ్రవరిలో విస్తృత వాణిజ్యం, పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశాయి. ఒక దేశం వస్తువులపై మరో దేశం అన్ని సుంకాలను తగ్గించుకోవాలని, ఐదేళ్లలో తమ వార్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈపీఏ)గా పిలిచే ఈ ఒప్పందం మే 1 నుంచి అమలులోకి వచ్చింది.