చైనాలో పర్యటించడంపై మళ్లా ఆలోచించుకోండి

చైనాలో పర్యటించడంపై మళ్లా ఆలోచించుకోండి
  • ఆర్బిట్రరీ చట్టాల అమలు నేపథ్యంలో తన పౌరులకు అమెరికా సూచన

బీజింగ్ : చైనాలో ఆర్బిట్రరీ చట్టాలు (ఒక వ్యక్తి నేరం చేశాడని సాక్ష్యాధారాలు లేకపోయినా ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీలుకల్పించే చట్టం) అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించడంపై మళ్లీ ఆలోచించుకోవాలని తన పౌరులకు అమెరికా సూచించింది. ఈ మేరకు యూఎస్  ఓ అడ్వైజరీని విడుదల చేసింది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో 78 ఏండ్ల అమెరికా పౌరుడికి చైనా కోర్టు జీవితకాలం జైలుశిక్ష విధించింది. 

తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే ఫారెన్  రిలేషన్స్  లాను కూడా అమల్లోకి తెచ్చింది. దాంతో పాటు విదేశీ విమర్శకులపై ఆంక్షలు విధించడానికి గూఢచర్య వ్యతిరేక చట్టం కూడా తెచ్చింది. దీంతో విదేశీ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాలో పర్యటించే ముందు ఒకటికి రెండుమార్లు ఆలోచించుకోవాలని అమెరికా తన పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది.