తీర్పును తర్వాత వెలువరిస్తాం

తీర్పును తర్వాత వెలువరిస్తాం

పౌరసత్వ వివాదంపై ముగిసిన వాదనలు 

హైదరాబాద్, వెలుగు: వేములవాడ టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​కు రెండు దేశాల పౌరసత్వాలు ఉన్నాయని దాఖలైన కేసులో బుధవారం వాద ప్రతివాదనలు ముగిశాయి. కేసుపై తీర్పును తర్వాత వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకోకుండానే భారత పౌరసత్వాన్ని పొందారని, ద్వంద్వ పౌరసత్వం ఉన్నందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆది శ్రీనివాస్‌‌ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీన్ని సవాల్‌‌ చేస్తూ చెన్నమనేని రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు స్టే జారీ చేసింది. ఈ కేసులో సుదీర్ఘ కాలం పాటు సాగిన వాద ప్రతివాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.    

చెన్నమనేని విదేశీ పౌరుడే..: కేంద్రం

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌‌ జనరల్‌‌ టి.సూర్యకరణ్‌‌రెడ్డి వాదిస్తూ.. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌‌ 10, సెక్షన్‌‌ 7బీ ప్రకారం చెన్నమనేని భారత సంతతికి చెందిన విదేశీ పౌరుడు అవుతారని చెప్పారు. జర్మనీ పౌరసత్వం ఉన్నందున చెన్నమనేని విదేశీ పౌరుడేనన్నారు.   

జర్మనీ పాస్ పోర్ట్ తో ప్రయాణాలు..

చట్టసభ సభ్యుడిగా ఉన్న చెన్నమనేని చట్టానికి వ్యతిరేకంగా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ పిటిషనర్ ఆది శ్రీనివాస్‌‌ తరఫున సీనియర్‌‌ అడ్వకేట్ రవికిరణ్‌‌ రావు వాదించారు. నేటికీ చెన్నమనేనికి జర్మనీ పాస్‌‌పోర్టు ఉందని, దానిపైనే ప్రయాణాలు చేస్తున్నారని చెప్పారు. 2013 వరకు ఉన్న జర్మన్‌‌ పాస్‌‌పోర్టును 2023 వరకు పొడిగించుకున్నారని తెలిపారు. ఓవర్సీస్‌‌ సిటిజన్‌‌ ఆఫ్‌‌ ఇండియా కార్డు అప్లికేషన్‌‌ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. చెన్నమనేని తరఫు అడ్వకేట్ వై.రామారావు వాదిస్తూ.. భారత పౌరసత్వం పొందిన తర్వాత జర్మనీ పాస్‌‌పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన చెన్నమనేనికి ద్వంద్వ పౌరసత్వం ఉన్నట్లు కాదన్నారు.