ఉగాది పండుగ ‘బస్వాపూర్’ కట్టపైనే!

ఉగాది పండుగ ‘బస్వాపూర్’ కట్టపైనే!

యాదగిరిగుట్ట, వెలుగు : బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కింద ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్తులకు పండుగ పబ్బం లేకుండా పోయింది. నష్టపరిహారం, పునరావాసం కోసం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అమలు చేయకపోవడంతో నిర్వాసితులు రెండోసారి చేపట్టిన నిరసన దీక్షలు బుధవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి.

బుధవారం ఉగాది పండుగ అయినా నిర్వాసితులు నిరసన దీక్షలు కొనసాగించారు. పండుగను బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపైనే జరుపుకున్నారు. ఇందులో భాగంగా నిర్వాసితులు కుండలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేశారు. దీక్షలో కూర్చున్నవారికి పచ్చడిని అందజేశారు. అనంతరం కట్టపైనే వంటావార్పు నిర్వహించి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీ ప్రకారం లప్పనాయక్ తండా గ్రామస్తులకు పునరావాసం కింద దాతరుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 294లో ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

రిజర్వాయర్ కోసం తీసుకున్న భూములకు ఎకరానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. సర్పంచ్ ధనావత్ బుజ్జి శంకర్ నాయక్, ఉప సర్పంచ్ మంక్యా నాయక్, మాజీ సర్పంచ్ కాశీరాం, నిర్వాసితులు రవికాంత్, భారతీ, లక్ష్మి పాల్గొన్నారు.