
సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలో అనుమతులు, అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలో ‘పేదల ఆరోగ్యం,- నకిలీ డాక్టర్స్ పై- ప్రభుత్వ వైఖరి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గత 10 రోజుల క్రితం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసి పలు అనుమతులు, అర్హత లేని హాస్పిటల్స్‌ను గుర్తించారని తెలిపారు. ఈనెల 3న డీఎంహెచ్ వో అర్హతలు లేని హాస్పిటల్ కు షోకాజ్ నోటీస్ లు ఇచ్చామని, వారం రోజుల్లో సీజ్ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అర్హతలు లేని ఆస్పత్రులకు డీఎంహెచ్‌వో ఎలా అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వడమే కాకుండా రెన్యూవల్ కూడా చేశారని ఆరోపించారు. డీఎంహెచ్ వోపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, మాస్ లైన్ (ప్రజా పందా) పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కో-కన్వీనర్ లింగయ్య, పీడీఎస్ యూ రాష్ట్ర నాయకులు కిరణ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ లింగయ్య, సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు నరేశ్, తెలంగాణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు విప్లవ్ కుమార్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.