ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
  • స్కానింగ్‌‌ సెంటర్‌‌ నిర్వాహకుడిని అరెస్ట్‌‌ నుంచి తప్పించేందుకురూ. 16 లక్షలు డిమాండ్‌‌
  • ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
  • విచారణ జరిపి డీఎస్పీ, సీఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు : అరెస్ట్‌‌ నుంచి తప్పించేందుకు స్కానింగ్‌‌ సెంటర్‌‌ నిర్వాహకుడి నుంచి లంచం డిమాండ్‌‌ చేసిన సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, టౌన్‌‌ సీఐ వీరరాఘవులును ఏసీబీ ఆఫీసర్లు అరెస్ట్‌‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణ రాష్ట్ర మెడికల్‌‌ కౌన్సిల్‌‌ టీమ్‌‌ కొన్ని రోజుల కింద జిల్లాలోని పలు ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్కడ జరిగే అక్రమాలపై కలెక్టర్‌‌ తేజస్‌‌ నందలాల్‌‌ పవార్‌‌, డీఎంహెచ్‌‌వో కోట చలంకు ఫిర్యాదు చేసింది.

ఓ స్కాన్‌‌ సెంటర్‌‌ నిర్వాహకుడు ఎలాంటి అర్హత లేకుండానే కొన్నేండ్లుగా స్కానింగ్‌‌లు తీస్తూ రూ. కోట్లు సంపాదించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ డాక్టర్స్‌‌... డీఎస్పీ పార్థసారథికి, సూర్యాపేట టౌన్‌‌ సీఐ రాఘవులకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట టూటౌన్‌‌ పీఎస్‌‌లో నమోదైన కేసులో అరెస్ట్ నుంచి తప్పించి, బెయిలబుల్‌‌ కేసు నమోదు చేసేందుకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డీఎస్పీ, సీఐ డిమాండ్‌‌ చేయగా... రూ.16 లక్షలకు డీల్ కుదిరింది.

అయితే డబ్బుల కోసం డీఎస్పీ, సీఐ ఒత్తడి తేవడంతో తట్టుకోలేకపోయిన సదరు స్కానింగ్‌‌ సెంటర్‌‌ నిర్వాహకుడు ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. దీంతో నల్గొండ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలోని టీమ్‌‌ సోమవారం సూర్యాపేట డీఎస్పీ ఆఫీస్‌‌కు వచ్చి రెండున్నర గంటల పాటు విచారణ జరిపింది. డీఎస్పీ, సీఐ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో సీఐ రాఘవులు, డీఎస్పీ పార్థసారథిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టు 2 అడిషనల్‌‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌‌ చందర్‌‌ తెలిపారు.