జగిత్యాల జిల్లా: ఆరు నెలల క్రితం వెల్గటూర్ మండలం పాశిగామ లో.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లతో ఇథానాల్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాజెక్ట్ నిర్మించాలని గ్రామంలో భూమిని కేటాయించారు. ఇవాళ (మార్చి 31) బీఈర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఆ ప్రాజెక్ట్ భూమి పూజ చేయడానికి పాశిగామ గ్రామానికి వెళ్లారు. మంత్రి రాకను తెలుసుకున్న గ్రామస్తులు కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టు నిర్మించడానికి వీలు లేదని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇథనాల్ ప్రాజెక్టుతో తమ గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుతాయని, వెంటనే ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పంధించాలని కొప్పుల ఈశ్వర్ ను నిలదీశారు గ్రామస్తులు.
భూమి పూజతో పాటు ప్రాజెక్టు పనులను అడ్డుకుని రాయపట్నం, కరీంనగర్ ఎస్ హెచ్-7 రోడ్డుపై బైఠాయించిన పాశిగామ గ్రామస్తులు నిరసనలు తెలియజేశారు. దీంతో రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లీయర్ చేసేందుకు పోలీసులు వాహనాలు కోటిలింగాల మీదుగా దారి మళ్లించారు. నిరసనను ఎదుర్కొన్న కొప్పుల ఈశ్వర్ గ్రామస్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. దాంతో మంత్రిపై ప్రజల ఆగ్రహం మరింత ఎక్కువైంది. దాదాపు గంటనుంచి రోడ్డుపైనే బైటాయించి.. ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతున్నారు.