కేటాయించిన నీళ్లే వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ

కేటాయించిన నీళ్లే వాడుకోలేని దుస్థితిలో తెలంగాణ
  • రాష్ట్రం వచ్చిన కొత్తలో 37%.. ఇప్పుడు 34 % వాటా
  • కేటాయించిన నీళ్లే తీసుకోలేని దుస్థితిలో తెలంగాణ
  • ఇప్పుడు 50 శాతం నీళ్లివ్వాలని పట్టుబడుతున్న రాష్ట్రం
  • ఏటా 70 శాతం నీళ్లు తరలించుకుపోతున్న ఏపీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా నదిలో నీటి పంపకాలు తేల్చే వరకూ రెండు రాష్ట్రాలకు చెరి సగం నీళ్లివ్వాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్న మన రాష్ట్రం.. వాస్తవానికి ఉన్న కోటానే కోల్పోయింది. ప్రాజెక్టుల నిర్మాణంలో చూపించిన అంతులేని నిర్లక్ష్యం.. హక్కుగా దక్కిన వాటిలో మూడు శాతం కోటా తగ్గిపోవడానికి కారణమయ్యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా ఇప్పటి వరకు మన రాష్ట్రం ఏ ఒక్క ఏడాది కూడా 30 శాతానికి మించి నీళ్లు వాడుకోలేకపోయింది. ఏపీ తనకు హక్కుగా దక్కే కోటాకు మించి ఏటా నీటిని తోడేసుకుంటూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతలను పూర్తి చేయడం మినహా తెలంగాణలో మొదలు పెట్టిన కృష్ణా ప్రాజెక్టులు సగం కూడా పూర్తి కాలేదు. ఫలితంగా హక్కుగా మనకు దక్కాల్సిన నీళ్లే కాదు.. వరద జలాలను వాడుకోవడంలోనూ వెనుకబడ్డాం.

ఎనిమిదేండ్లలో ఒక్కసారి పూర్తి వాటా వాడుకోలే

రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నీళ్లకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు ఉండటంతో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. రెండు రాష్ట్రాలకు కామన్‌‌‌‌ ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌తోపాటు మొత్తం కృష్ణా బేసిన్‌‌‌‌లో ఏపీ 63%, తెలంగాణ 37% నీళ్లు తీసుకునేందుకు అప్పట్లో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారు. తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 37% నీళ్లు తీసుకోకపోవడం, ఏపీ ఏటా 70 శాతానికిపైగా నీటిని తరలించుకుపోతుండటంతో కృష్ణా బోర్డు ఏర్పాటు స్ఫూర్తే దెబ్బతింటోందనే వాదన తెరపైకి వచ్చింది. 2016–17లో నీటి కోటాను తగ్గించుకోవాలనే బోర్డు ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం గుడ్డిగా ఓకే చెప్పింది. ఫలితంగా రాష్ట్రం షేర్‌‌‌‌ 37 శాతం నుంచి 34 శాతానికి పడిపోయింది. అప్పటి నుంచి ఏపీకి 66, తెలంగాణకు 34 నిష్పత్తిలో నీటిని కేటాయిస్తున్నారు. 

అక్రమ ప్రాజెక్టులు కట్టి తోడుకుపోతున్న ఏపీ

బేసిన్‌‌‌‌ అవతలికి శ్రీశైలం నీళ్లను తరలించుకుపోయేందుకు అనేక అక్రమ ప్రాజెక్టులను ఏపీ చేపట్టింది. రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ స్కీం నిర్మాణంలో ఉంది. తెలంగాణ మాత్రం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను గాలికొదిలేసింది. ఫలితంగా ప్రాజెక్టులు ఉప్పొంగినా బేసిన్‌‌‌‌లో ఉన్న మన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. ఏపీ మాత్రం గ్రావిటీ ద్వారా వరద నీళ్లను రాయలసీమకు మళ్లించుకుంటోంది. రెండేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు చెరిసగం నీళ్లివ్వాలనే వాదన తెరపైకి తెచ్చింది. కృష్ణా బోర్డుతోపాటు కేంద్రానికి లేఖలు రాసింది. బోర్డు మీటింగుల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని ప్రభుత్వం చెబుతున్నా, ఈ రెండేండ్లు కూడా పాత పద్ధతిలోనే నీటిని కేటాయించారు. నీటి కోటా తేల్చడం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్‌‌‌‌ నిర్ణయించాల్సి ఉందని బోర్డు చెప్తోందని మన అధికారులు అంటున్నారు. 2016–17లో తెలంగాణ షేర్‌‌‌‌ తగ్గిస్తూ బోర్డు మీటింగ్‌‌‌‌లో ఎలా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రం తరపున వాదించిన దాఖలాలు లేవు.

ఏడేండ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులు

నాగార్జునసాగర్‌‌‌‌ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టా సిస్టం, పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్ట్‌‌‌‌ స్కీంలు, కేసీ కెనాల్‌‌‌‌, సుంకేసుల నుంచి భారీగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుంటోంది. తెలంగాణ మాత్రం నాగార్జునసాగర్‌‌‌‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్‌‌‌‌ ఎత్తిపోతలు, కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌, జూరాలతోపాటు దానిపై ఏర్పాటు చేసిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌ లిఫ్టుల ద్వారానే నీళ్లు తీసుకోగలుగుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనులు ఏడేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పటి పూర్తవుతాయో తెలియడం లేదు.