ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు.. ఆత్మస్తుతి పరనింద

ఎల్కతుర్తి  సభలో  కేసీఆర్ మాట్లాడిన తీరు.. ఆత్మస్తుతి పరనింద

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి 25 ఏళ్లు నిండిన సందర్భంగా ఎల్కతుర్తి  సభలో  కేసీఆర్ మాట్లాడిన తీరువిని తెలంగాణ సమాజం అవాక్కు అయింది.  పది సంవత్సరాలు తెలంగాణను ఏలిన మాజీ ముఖ్యమంత్రి నోట పచ్చి  ఫ్యూడల్ భావజాలం కనిపించడం దురదృష్టకరం. తనకు తాను పొగుడుకున్నారు. కాంగ్రెస్ పార్టీపై,  రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిపై కేసీఆర్​ అక్కసు వెళ్లగక్కడం బాగాలేదు. 

ఆత్మస్తుతి  పరనింద అన్నట్లుగా  కేసీఆర్ ప్రసంగం సాగింది.  తెలంగాణ ప్రజాకోర్టులో శిక్షపడిన బీఆర్​ఎస్​ అధినేత  కేసీఆర్ పరనిందకే ప్రాధాన్యమిచ్చారు.  తనకు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్​ ప్రభుత్వపాలన చూస్తుంటే దుఃఖం వస్తోందని, ఆగమైతున్న తెలంగాణ అంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు.  ప్రజాసంపదను అడ్డగోలుగా ఆర్భాటాలకు,  అనర్థ ప్రాజెక్టులకు వాడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు అధికారం కోల్పోయాక ఇలా మాట్లాడటం సహజమేమో!  మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకోవడం తప్పుకాకపోవచ్చు. 

కానీ, ఏడుపుగొట్టు రాజకీయాలతో మళ్ళీ అధికారం కోరుకోవడమే బాగాలేదు. ఒకనాడు  దేశాన్ని ఏలాలని భావించి, పార్టీ పేరునే మార్చినవారు, రాష్ట్రంలోనే అధికారం కోల్పోవడం మింగుడుపడని విషయంగా మారింది. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని,  అమరవీరుల త్యాగాన్ని, పోరాటాలని తమ కుటుంబ సొత్తుగా భావించి పదేండ్లు పాలించినవారు ఇవాళ కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని నిందించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి కదా!   

కాంగ్రెస్ సర్కార్​పై కేసీఆర్ అక్కసు

సకల జనుల పోరాటాలు, విద్యార్థుల బలిదానాలు, కవులు, కళాకారులు నినదించిన తెలంగాణ రాష్ట్ర పోరాటానికి ముగింపుపలికి, తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసినది యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ సాహసం వలన  స్వరాష్ట్రం వచ్చిందన్నది  కాదనలేని అక్షర సత్యం.  ఇచ్చిన మాట,  చేసిన శపథం నెరవేర్చి  సోనియా గాంధీ  తెలంగాణ పిల్లల బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ఏర్పాటును చేయడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా?  పది సంవత్సరాలు వరుసగా రెండుసార్లు అధికారం  చెలాయించిన   కేసీఆర్  తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారు.  

శుష్క వాగ్దానాలు,  దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని, మూడెకరాల భూమి దళిత గిరిజనులకు ఇస్తామని,  నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, అన్యాక్రాంతం అయిన లక్ష ఎకరాల భూమి తిరిగి స్వాధీనం చేసుకుని పంపిణీ చేస్తా,  కోటి ఎకరాల సాగునీరు, 1 లక్ష 20 వేల కోట్లు ఖర్చు చేసి కూలిపోయిన కాళేశ్వరం  ప్రాజెక్ట్,  ఏకకాలంలో లక్ష రుణమాఫీ, పాలమూరు– రంగారెడ్డి  ప్రాజెక్టు,  దళిత, బీసీ బంధు, తెలంగాణలోని ప్రతి పట్టణాన్ని  పారిస్, లండన్ చేస్తామని  వారు చెప్పిన ఒక్కమాట అయినా నెరవేర్చారా? 

వేల కోట్లు రాలుతున్న ఇసుక దోపిడీకి అడ్డంగా వచ్చిన నేరెళ్ల దళితులపై సాగించిన దాష్టీకం, తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వందలాది మంది నిరుద్యోగులను జైలుకు పంపినది  కేసీఆర్.  ఎల్కతుర్తి సభలో  ఏం మాట్లాడినా చెల్లుతుందను కోవడం ఆయన పొరపాటు.  ధర్నాచౌక్ ఎత్తివేసిన కేసీఆర్​ నేడు తెలంగాణలో పోలీస్ రాజ్యం అంటూ శ్రీరంగనీతులు వల్లించడం విన్నవారికే విచిత్రంగా కనిపిస్తుంది.

వరి వేస్తే ఉరి

ధరణి పేరుతో కేసీఆర్ పాలనలో 22 లక్షల మంది రైతులు పడ్డ కష్టాలు గ్రామాల్లో బీఆర్ఎస్ సాగించిన దాష్టీకాలతో అనేకమంది పేద రైతులు కన్నుమూశారు.  ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసి ఇష్టారీతిన కేసీఆర్ పాలనలో సాగించిన, సృష్టించిన అరాచకాలకు లెక్కేలేదు.  ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను లాగేసుకున్న బీఆర్ఎస్ ఇపుడు మళ్లీ  రైతుల ముసుగు తొడుక్కొని మాట్లాడటం విచిత్రం. 

వరి వేస్తే ఉరి అని తెలంగాణ రైతులను  సంక్షోభంలోకి నెట్టారు.  బీజేపీతో  కేంద్రంలో అంటకాగిన బీఆర్ఎస్.. రైతు వ్యతిరేక నల్లచట్టాలకు, నోట్ల రద్దు,  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వారికి మద్దతు ఇచ్చి తెలంగాణ నోట్లో మట్టి కొట్టింది కూడా బీఆర్​ఎస్​ అన్న సంగతి జనం మరవలేదు.  తెలంగాణలో వందలాది ఎకరాలను అప్పనంగా అమ్మి తెలంగాణ పరపతి ఎకరం రూ.100 కోట్లు అన్నది తమరుకాక మరెవరు చెప్పండి.  

 చేనేత బకాయిలను రూ.400 కోట్లు విడుదల చేసి, ఒక కోటి 50 లక్షల చేనేత చీరలను ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి  పనితీరును చేనేత మహిళలు భేష్ అనవచ్చు.  గడిచిన 17 నెలల అనతికాలంలో రేవంత్ సర్కార్ సాధించిన ప్రగతి వారికి కనబడకపోవడం శోచనీయం.  

కాంగ్రెస్​ పాలనలో 58వేల ఉద్యోగాల భర్తీ

మహిళలకు  ఫ్రీ బస్సుపై కేసీఆర్​ మాట్లాడిన వెటకారాన్ని  తెలంగాణ మహిళలు జీర్ణించుకోలేరు.  ఏడాదిలోనే  58 వేల ఉద్యోగాల భర్తీ చేసిన రేవంత్​రెడ్డిపై మాట్లాడే స్థాయి కేసీఆర్​కు ఉందా అని విద్యార్థులు, నిరుద్యోగులు అంటున్నారు. రేవంత్​రెడ్డి ఎలాంటి పాలన చేస్తున్నాడో.. 21 వేల కోట్లతో  రెండు లక్షల రుణమాఫీ జరిగిన 25 లక్షల రైతు కుటుంబాలను అడిగితే తెలుస్తుంది.  200 యూనిట్ల ఉచిత కరెంటు,  సన్నవడ్లకు రూ.500 బోనస్,  3.20 కోట్ల మందికి  సన్నబియ్యంతో రేవంత్ సర్కార్ చరిత్రలో సువర్ణ అధ్యాయానానికి నాంది పలికింది.  

30 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణను అమలుపరిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.   బీసీలకు  విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని 42 శాతం  రిజర్వేషన్స్ బిల్లును  తెచ్చిన ఘనత ప్రజాసర్కారుదే.  రైతు కమిషన్, విద్యా కమిషన్,  లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం,  మెట్రోరైల్  ఓఆర్ఆర్  తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్టులు.  రూ. 2.2 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చింది  సీఎం  రేవంత్ రెడ్డి  సర్కారు.

 ఎల్కతుర్తి సభలో  ‘నాకు ఏడుపొస్తోంది. కడుపు మండుతోంది’ అంటూ  మొసలి కన్నీరు ఎంతకార్చినా.. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్​ ప్రభుత్వం జరిపిన  అభివృద్ధి, సంక్షేమం సామాజిక న్యాయాన్ని  తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు కాదనలేరనే విషయాన్ని మర్చిపోయి ఎన్ని రజతోత్సవ సభలు జరుపుకున్నా ఫలితమేమిటి? 

- పున్న కైలాష్ నేత,
టీపీసీసీ జనరల్ సెక్రటరి